Begin typing your search above and press return to search.

గంటాకు దిమ్మ తిరిగేలా అయ్య‌న్న షాక్‌!

By:  Tupaki Desk   |   16 July 2017 7:06 AM GMT
గంటాకు దిమ్మ తిరిగేలా అయ్య‌న్న షాక్‌!
X
ఇద్ద‌రు ముఖ్య‌నేత‌ల మ‌ధ్య పంచాయితీ ఉంటే దాన్ని ఎక్కువ‌కాలం నాన‌బెట్ట‌టం ఎంత మాత్రం స‌రికాదు. ఇంత చిన్న విష‌యాన్ని ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ఎందుకు అర్థం చేసుకోరో ఒక ప‌ట్టాన అర్థం కాదు. ఒక‌రిని దెబ్బ తీయ‌టానికి మొద‌ల‌య్యే ప్ర‌య‌త్నం అంత‌టితో ఆగ‌ద‌న్న‌ది బేసిక్ రూల్‌. అందుకే.. దెబ్బ తీసే కార్య‌క్ర‌మం అస‌లు మొద‌లుకాకుండానే చూస్తారు. ఒక‌వేళ‌.. మొద‌లైనా.. అధినాయ‌కుడు సీన్లోకి వ‌చ్చి ఇష్యూ క్లోజ్ చేస్తారే కానీ.. తెలుగు టీవీ సీరియ‌ల్ మాదిరి సాగ‌దీసే ప్ర‌య‌త్నం చేయ‌రు.

స‌మ‌స్య‌ల్ని ప‌రిష్క‌రించే క‌న్నా.. స్టేట‌స్ కోతో బండి లాగించే అల‌వాటున్న ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు త‌న‌కు తానే స‌మ‌స్య‌ల్ని ఆహ్వానిస్తుంటారు. తిరుగులేని అధికారం ఉన్నా.. ఎవ‌రినీ నొప్పించ‌కుండా ఉండేందుకు తెగ ప్ర‌య‌త్నం చేస్తూ లేనిపోని స‌మ‌స్య‌ల్ని కొని తెచ్చుకుంటుంటారు. విశాఖ జిల్లాలో మంత్రులు గంటా.. అయ్య‌న్న‌ల మ‌ధ్య అధిప‌త్య పోరు ఇప్ప‌టిది కాదు. కానీ.. ఈ విష‌యంలో తానేం కోరుకుంటున్నాన‌న్న విష‌యాన్ని బాబు ఇరువురికి అర్థ‌మ‌య్యేలా చెప్ప‌లేద‌న్న ఆరోప‌ణ ఉంది.

సుదీర్ఘంగా సాగుతున్న వీరి మ‌ధ్య పోరు పుణ్య‌మా అని పార్టీ ప‌ర‌ప‌తికి ఇబ్బందిక‌రంగా మారింది. ఏపీ స‌ర్కారుకు తీవ్రంగా ఇరుకున ప‌డేసిన వైజాగ్ భూముల వ్య‌వ‌హారంలో మ‌రో కీల‌క ప‌రిణామం చోటు చేసుకుంది. భూ కుంభ‌కోణాల‌పై సిట్ జ‌రుపుతున్న విచార‌ణ‌కు హాజ‌రైన మంత్రి అయ్య‌న్న‌పాత్రుడు తాజాగా మంత్రి గంటా మీద ఫిర్యాదు చేసిన‌ట్లుగా వ‌స్తున్న వార్త‌లు క‌ల‌క‌లాన్ని రేపుతున్నాయి.

ఆనంద‌పురం మండ‌లం వేముల‌వ‌ల‌స‌లో ప్ర‌భుత్వ భూముల్ని త‌మ‌విగా చూపించి మంత్రి స‌మీప బంధువు ఒక‌రు ఇండియ‌న్ బ్యాంకు నుంచి రూ.190 కోట్లు తీసుకున్న వైనంతో పాటు.. మ‌రికొన్ని ఉదంతాల్ని సిట్ అధికారుల‌కు మంత్రి అయ్య‌న్న ఇచ్చిన‌ట్లుగా తెలుస్తోంది.

ఈ ప‌రిణామం మంత్రి గంటా శిబిరంలో తీవ్ర క‌ల‌క‌లాన్ని రేపుతోంది. మంత్రి గంటాతో పాటు.. ఆయ‌న‌తో స‌న్నిహితంగా ఉండే అన‌కాప‌ల్లి ఎమ్మెల్యే పీలా గోవింద స‌త్య‌నారాయ‌ణ‌పైనా కొన్ని ఆరోప‌ణ‌ల్ని సిట్ ముందు చేసిన‌ట్లుగా స‌మాచారం. ఈ నెల 19న మ‌రికొన్ని ఆధారాల‌తో సిట్ ఎదుట‌కు తాను వ‌స్తాన‌ని అయ్య‌న్న చెప్పిన వైనం విశాఖ టీడీపీలో కొత్త క‌ల‌క‌లాన్ని రేప‌ట‌మే కాదు.. గంటా వ‌ర్గానికి దిమ్మ తిరిగిపోయే షాకింగ్ గా మారింద‌ని చెబుతున్నారు. ఈ వాద‌న‌కు బ‌లం చేకూర్చేలా మంత్రి గంటా త‌న కార్య‌క్ర‌మాల‌న్నింటిని ర‌ద్దు చేసుకొని హుటాహుటిన విజ‌య‌వాడ‌కు బ‌య‌లుదేరి వెళ్ల‌టం చూస్తుంటే.. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబును క‌లిసి.. త‌న ఆవేద‌న‌ను.. ఆక్రోశాన్ని పంచుకునే అవ‌కాశం ఉందంటున్నారు. సిట్‌కు ఆధారాలు ఇచ్చిన‌ట్లుగా చెబుతున్న అయ్య‌న్నపై బాబుకు ఫిర్యాదు చేయ‌టం ఖాయ‌మ‌న్న మాట వినిపిస్తోంది.