Begin typing your search above and press return to search.

పొత్తు... తమ్ముళ్లతో చిత్తు...

By:  Tupaki Desk   |   24 Aug 2018 5:02 AM GMT
పొత్తు... తమ్ముళ్లతో చిత్తు...
X
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు - ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి తెలుగు తముళ్లు ఝలక్ ఇస్తున్నారు. ఇది పైకి నమ్మలేని మాటగానే ఉన్నా... లోలోపల మాత్రం చంద్రబాబుపై తమ్ముళ్లు నిప్పులు చెరుగుతున్నారు. ఇన్నాళ్లూ తానేపార్టీ... పార్టీయే తాను అన్నట్లుగా మెలిగిన చంద్రబాబు నాయుడికి ఇక ముందు అలాంటి ఆటలు సాగే అవకాశాలు కనిపించడం లేదు. ముఖ్యంగా తెలంగాణలో పొత్తులుంటాయని చంద్రబాబు నాయుడు ప్రకటించిన అనంతరం తెలుగు తమ్ముళ్లు. అందునా సీనియర్ నాయకులు మండిపడుతున్నారు. తెలంగాణలోనూ - కేంద్రంలోనూ ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితి - భారతీయ జనతా పార్టీలను గద్దె దింపేందుకు చంద్రబాబు నాయుడు చిరకాల ప్రత్యర్ధి కాంగ్రెస్‌ తో చేతులు కలపాలని భావిస్తున్నారు. బుధవారం నాడు ఈ విషయాన్ని నేరుగా కాకపోయినా అన్యాపదేశంగా చెప్పారు. భారతీయ జనతా పార్టీని - తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర సమితిని కొట్టాలని - ఇందుకోసం కాంగ్రెస్ పార్టీతో కూడా కలుద్దామంటూ అమరావతిలో జరిగిన పార్టీ సమావేశంలో చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఇది మొదటి నుంచి అనుకుంటున్నా పార్టీ నాయకులు మాత్రం - కార్యకర్తలు మాత్రం ఇదంతా పత్రికల డ్రామాగానే భావించారు. అయితే చంద్రబాబు నాయుడు తన నిర్ణయాన్ని అధికారికంగానే ప్రకటించడం - గవర్నర్ నరసింహన్‌ తో భేటీ కావడం వంటి పరిణామాలు చూసిన తర్వాత ఇవన్నీ నిజాలేనని వారికి నమ్మకం కలిగింది.

చంద్రబాబు నాయుడు తన అధికారం కోసం ఏమైనా చేస్తాడనే ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టిన సీనియర్ నాయకులు కూడా ఆయన నిర్ణయంతో కంగు తిన్నారు. నిజానికి తెలుగుదేశం పార్టీ పుట్టిందే కాంగ్రెస్ వ్యతిరేకంగా అని - అలాంటి వారితో ఇప్పుడు కల్లబొల్లి సాకులు చెప్పి ఎలా చేరతారని వారు ప్రశ్నిస్తున్నారు. ఇలా చేస్తే పైలోకాల్లో ఉన్న ఎన్.టి.రామారావు ఆత్మ క్షోభిస్తుందని వారంటున్నారు. కాంగ్రెస్ తో పొత్తుపై మంత్రులు చింతకాయల అయ్యన్నపాత్రుడు - కె.ఈ.క్రష్ణమూర్తి మండిపడ్డారు. ఈ పొత్తుతో ముందుకు వెళ్తే ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుందని పరుష వ్యాఖ్యలతో చంద్రబాబు నాయుడిపై ఫైర్ అయ్యారు. ప్రజలు నడిరోడ్డున నించోపెట్టి నిలదీస్తారని నిప్పులు చెరిగారు. అంతే కాదు ప్రజలు తంతారు అని కూడా వ్యాఖ్యానించారు. దీంతో కాంగ్రెస్ పార్టీతో పొత్తుపై చంద్రబాబు నాయుడు వెంటనే దిద్దుబాటు చర్యలు ప్రారంభించారు. తన అనుంగు అనుచరుడు - ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప చేత అలాంటిదేమీ ఉండదంటూ ప్రకటించారు. మొత్తానికి చంద్రబాబు నాయుడి పొత్తు ఎత్తు పార్టీ నాయకుల ముందు చిత్తు అయ్యేలాగే ఉంది.