Begin typing your search above and press return to search.

ఆర్మీ యూనిఫాం జోలికెళ్లొద్దు

By:  Tupaki Desk   |   9 Jan 2016 7:52 AM GMT
ఆర్మీ యూనిఫాం జోలికెళ్లొద్దు
X
ఫ్యాషన్‌ పేరిట ప్రజలు ఆర్మీ దుస్తులను వేసుకోవద్దని ఆర్మీ అధికారులు సూచించారు. ఉగ్రవాదుల దాడులను నివారించడంలో భాగంగా ఆర్మీ అధికారులు సాధారణ ప్రజానీకానికి కొన్ని మార్గదర్శకాలను జారీ చేశారు. ఆర్మీ దుస్తులను వేసుకోవడం ఫ్యాషన్‌ గా భావించరాదని... ఆర్మీ దుస్తులను ధరించడం చట్టవిరుద్ధమని ఆర్మీ అధికార ప్రతినిధి ఒకరు ప్రకటించారు. పఠాన్‌ కోట్‌ లోని వైమానిక స్థావరంపై ఉగ్రదాడి జరిగిన నేపథ్యంలో ఆర్మీ అధికారులు దేశవ్యాప్తంగా ప్రజలకు ఈ సూచనలు - మార్గదర్శకాలు వెలువరించారు.

సాధారణ ప్రజానీకంతోపాటు ప్రయివేటు సెక్యూరిటీ ఏజెన్సీలు - పోలీసులు - ఇతర కేంద్ర బలగాలకు చెందినవారు 'యుద్ధంలో ఉపయోగించే మాదిరి' దుస్తులను ధరించకూడదని, ఇది చట్ట విరుద్ధమేకాక, అనవసరపు భయాలకు దారి తీస్తుందని ఆ అధికారి తెలిపారు. ఆర్మీ యూనిఫారంలను విక్రయించడంలో ఆసక్తి కలిగిన వాణిజ్యవేత్తలు, దుకాణదారులు స్థానిక ఆర్మీ అధికారులను సంప్రదించి కంటోన్మెంట్‌ ఆమోదిత ప్రాంతాల్లో దుకాణాలను ఏర్పాటు చేసుకోవడానికి అనుమతి తీసుకోవాలని ఆ అధికారి సూచించారు. అనధికార వ్యక్తులకు ఆర్మీ దుస్తులను విక్రయించడం చట్టవిరుద్ధమని ఆ అధికారి స్పష్టం చేశారు.

ఫ్యాషన్ పేరుతో కార్గోలు - జాకెట్లు ఆర్మీ దుస్తుల డిజైన్లతో వస్తున్నాయి. ఇలాంటివి ధరించిన పౌరులు ఇబ్బందిపడే ప్రమాదమూ ఉంది. మావోయిస్టు ప్రాంతాల్లో ఇలాంటివి వేసుకుని తిరిగితే వారిని భద్రతాదళాలుగా భావించి మావోయిస్టులు టార్గెట్ చేసే ప్రమాదమూ ఉంది. కాబట్టి సైన్యం సూచనలు పాటించడం మంచిదే.