Begin typing your search above and press return to search.

అర్జెంట్ గా ఆ సలహాదారుడ్ని తప్పించండి సారూ..

By:  Tupaki Desk   |   20 Dec 2020 11:39 AM IST
అర్జెంట్ గా ఆ సలహాదారుడ్ని తప్పించండి సారూ..
X
ఆరేళ్లు అప్రతిహతంగా సాగిన సారు పాలనకు ఇటీవల కాలంలో అదే పనిగా స్పీడ్ బ్రేకులు వచ్చి పడుతున్నాయి. ఒకటి తర్వాత ఒకటిగా తగులుతున్న ఎదురుదెబ్బల పుణ్యమా అని.. తెలంగాణలో తిరుగులేని అధినేతకు ఇప్పుడు కొత్త ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రాజకీయంగా ఎదురవుతున్న సవాళ్లు ఒక ఎత్తు అయితే.. పాలనా పరంగా తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు మొదటికే మోసం వచ్చేలా చేయటమే కాదు.. ప్రభుత్వానికి సెల్ఫ్ గోల్ అన్నట్లుగా సాగుతున్నాయి.

దుబ్బాక ఉప ఎన్నిక ఫలితం వెలువడిన వెంటనే.. ఏ మాత్రం గ్యాప్ ఇవ్వకుండా గ్రేటర్ ఎన్నికల్ని నిర్వహించాలన్న కేసీఆర్ ఆలోచన బాగానే ఉన్నా.. దానికి ముందు వరదలకు పరిహారంగా పదివేల రూపాయిలు ఇవ్వాలన్న నిర్ణయం సంచలనంగా మారింది. పదివేల పరిహారంతో ఓట్లు పోటెత్తుతాయని.. గ్రేటర్ ఎన్నికల్లో తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకోవటం ఖాయమన్న మాట వినిపించింది. ఆశ్చర్యకరంగా ఏ పది వేలు అయితే భారీ విజయాన్ని ఇస్తుందని అంచనా వేశారో.. అదే పది వేలు గ్రేటర్ లో గులాబీ కారుకు భారీ డ్యామేజ్ అయ్యేలా చేసిందన్న విషయం ఫలితాల వెల్లడితో అర్థమైంది.

దేశ చరిత్రలో ఇప్పటివరకు మరే ప్రభుత్వం.. ముఖ్యమంత్రి ఇవ్వని రీతిలో పదివేల రూపాయిల పరిహారం అన్న గొప్పల సంగతి ఎలా ఉన్నా.. ప్రభుత్వ ఖజానాకు రూ.700 కోట్ల భారం పడటంతో మింగా లేక కక్కాలేని పరిస్థితి నెలకొని ఉందంటున్నారు. అదే రూ.700 కోట్లు ఉంటే పరిస్థితి మరోలా ఉండేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇదంతా ఓకే కానీ.. ఇంతకీ ఈ పదివేల పరిహారం ఐడియా ఎవరు ఇచ్చిందన్న చర్చ ప్రభుత్వ వర్గాల్లో సాగుతోంది.

విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఆయన కుమారుడు మంత్రి కేటీఆర్ కు అత్యంత సన్నిహితుడిగానే కాదు.. వారిని అమితంగా ప్రభావితం చేసే కీలక అధికారే తాజా ఐడియా ఇచ్చినట్లు చెబుతున్నారు. తాజాగా వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లకు సంబంధించిన ఇష్యూలోనూ.. ఆయన మాటల్ని నమ్మి కొత్త పద్దతిని తెర మీదకుతెచ్చినట్లుగా తెలుస్తోంది.

ఈ ఎపిసోడ్ లోనూ ప్రభుత్వానికి జరిగిన డ్యామేజ్ అంతా ఇంతా కాదు. ఈ రెండు ఐడియాలు ఇచ్చింది ఒకే పెద్దసారు అన్న మాట పలువురి నోట వినిపిస్తోంది. ఆరేళ్లలో జరగని డ్యామేజీ..గడిచిన ఆర్నెల్లలో జరిగిందని.. ఆ పెద్ద అధికారి విషయంలో ముఖ్యమంత్రి మహా గుర్రుగా ఉన్నట్లుగా తెలుస్తోంది.అదే సమయంలో ఆ మహానుభావుడ్ని వీలైనంత త్వరగా తప్పించాలన్న సూచనను సీఎం ముందుకు పెట్టాలన్న యోచనలో పలువురు ఉన్నట్లుగా తెలుస్తోంది. మరేం జరుగుతుందో చూడాలి.