Begin typing your search above and press return to search.

అవంతి వర్సెస్ గుడివాడ...?

By:  Tupaki Desk   |   17 April 2022 2:30 AM GMT
అవంతి వర్సెస్ గుడివాడ...?
X
కొత్త మంత్రులు వర్సెస్ పాత మంత్రులు. వైసీపీలో ఇప్పటిదాకా చూడని కధ ఇది. ఇప్పటిదాకా వైసీపీలో చేరిన మాజీ మంత్రులు ఉన్నారు. కానీ వైసీపీ తీసేసిన మాజీలు అయితే లేరు. ఇపుడు వారు ఫ్రెష్ గా వచ్చారు. ఇక కొత్త వారు ఎటూ కిరీటాలు ధరించి ఉన్నారు. దాంతో కొత్త వర్సెస్ పాతల మధ్య ఎక్కడ చూసినా తెలియని రాగద్వేషాలు రగులుతున్నాయి.

నెల్లూరు నుంచి మొదలుపెడితే ఉత్తరాంధ్రా దాకా ఇదే తీరు. ఇదే ఊసు. ఇక ఉమ్మడి విశాఖ జిల్లా విషయానికి వస్తే తాజా మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావు ఉన్నారు. ఇపుడు ఆయన శిష్యుడు గుడివాడ అమరనాధ్ మంత్రి అయిపోయారు. తన కళ్ళ ముందు ఎదిరిగిన అమరనాధ్ మంత్రిగా వెలిగిపోతూంటే దీవించాల్సిన గురువుగారికి గుస్సా వస్తోంది.

పోనీ అమరనాధ్ ఏమైనా సాధారణ శాఖలతో సరిపెట్టుకున్నారా అంటే అదేమీలేదుగా. ఆయన చేతిలో అయిదు ప్రధాన శాఖలు ఉన్నాయి. పరిశ్రమలు, ఐటీ, చేనేత, జౌలిశాఖ, వాణిజ్య పన్నులు, మౌలిక సదుపాయల కల్పన శాఖతో గుడివాడ వైభవం వహవా అనిపించేలా ఉంది. మరో వైపు 34 నెలలు మంత్రిగా చేశారు కానీ అవంతికి టూరిజం శాఖ మాత్రమే ఇచ్చారు.

సరే ఇపుడు అవంతి బాధ ఏంటి అంటే ఆయన ఉన్న విశాఖ జిల్లాకు ఒక్క బెర్త్ ఇవ్వలేదు. ఉన్న ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలలో తాను తగిన వాడిని కదా, కంటిన్యూ చేయవచ్చు కదా అన్నది అవంతి శ్రీనివాసరావు బాధ. మరో వైపు చూస్తే కాపులకు తానే ప్రతినిధిగా ఉంటే గుడివాడను ఐకాన్ స్టార్ ని చేయడమేంటి అన్న మధనమూ ఉంది.

ఇవన్నీ కలసి అవంతి బాధ ఎక్కువగా ఉందని ప్రచారం అయితే ఉందిట. ఉమ్మడి విశాఖ జిల్లా మంత్రిగా గుడివాడనే ఇపుడు ఉంటారు. ఆయన మంత్రిగా ప్రమాణం చేసి విశాఖ వస్తే అందరూ వచ్చారు కానీ తాజా మాజీ మంత్రి గారు మాత్రం కనిపించలేదు. ఇక తనకు మంత్రి పదవి ఎందుకు ఇవ్వలేదని రోడ్ల మీదకు వచ్చి అల్లరి చేసి హడావుడి చేసిన కరణం ధర్మశ్రీ కూడా అమరనాధ్ కి స్వాగతం చెప్పారు.

కానీ అవంతి తాను వెళ్ళలేదు. భీమిలీ నుంచి ఏ ఒక్కరూ పోవద్దని కూడా ఆదేశాలు జారీ చేశారని టాక్ నడుస్తోంది. దీంతో గుడివాడ వర్గీయులు ఇదేమి రాజకీయం గురువా అని పెదవి విరుస్తున్నారు. బాబాయ్ అబ్బాయి అని పిలుచుకునే సాన్నిహిత్యం వీరిద్దరిది. అలాగే అమరనాధ్ చదివింది ఎక్కడో కాదు, అవంతి ఎడ్యుకేషనల్ సంస్థలలోనే. మరి శిష్యుడు ఎదిగివస్తే ఆశీస్సులు ఇవ్వరా అని గుడివాడ అనుచరులు మండుతున్నారు.

ఇక నీది అనకాపల్లి జిల్లా, మాది విశాఖ జిల్లా. ఆ జిల్లాలోకి వస్తే కుదరదు అంతే అనేస్తున్నారుట తాజా మాజీ మంత్రి గారి అనుచర వర్గం. మొత్తానికి జగన్ మంత్రి వర్గ విస్త్రణ కాదు కానీ కొత్త గొడవలు స్టార్ట్ అయిపోయాయి. ఇవి ముదిరి పాకాన పడితే మాత్రం టీడీపీ సైకిల్ హ్యాపీగా ఎక్కడ పడితే అక్కడ తొక్కేసుకోవచ్చు అంతే.