Begin typing your search above and press return to search.

పారాలింపిక్స్ లో చరిత్ర సృష్టించిన 'అవనీ' ..

By:  Tupaki Desk   |   3 Sept 2021 3:00 PM IST
పారాలింపిక్స్ లో చరిత్ర సృష్టించిన అవనీ ..
X
టోక్యో పారాలింపిక్స్‌ లో భారత అథ్లెట్స్ జోరు కొనసాగుతుంది. పారాలింపిక్స్‌ లో పతకాల పంట పండిస్తూ త్రివర్ణ పతకాన్ని రెపరెపలాడిస్తున్నారు. తాజాగా మరో పతకం భారత్ ఖాతాలోకి చేరింది. షూటర్ అవని లేఖారా గన్‌ తో మరోసారి అదరగొడుతోంది. మొదటి మ్యాచ్ నుంచి అసాధారణ రీతిలో ప్రదర్శన కనబరుస్తూ పతకాల వేటను కొనసాగిస్తోంది. దీంతో ఒకే పారాలింపిక్స్ లో రెండు పతకాలు సాధించిన తొలి భారత మహిళగా ఆమె తన పేరిట రికార్డు రాసుకుంది. 19 ఏళ్ల ప్రాయంలోనే ఆ రికార్డును సొంతం చేసుకుని అందరి చేత మన్ననలను పొందుతోంది.

ఈ క్రమంలో జోగిందర్‌ సింగ్‌ బేడీ, మరియప్పన్‌ తంగవేళు, దేవేంద్ర ఝాజరియా తర్వాత ఒకటి కంటే ఎక్కువ పతకాలు సాధించిన 4వ భారత అథ్లెట్‌గా రికార్డుల్లోకెక్కింది. నేడు జరిగిన 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్ ఎస్హెచ్ 1 విభాగంలో ఆమె కాంస్య పతకాన్ని గెలిచింది. ఈ విభాగంలో చైనాకు చెందిన ఝాంగ్ క్యూపింగ్ స్వర్ణం సాధించింది. జర్మనీ క్రీడాకారిణి నటాషా హిల్ ట్రాప్ రజతం గెలిచింది. ఈ పథకం తో ఈ గేమ్స్ లో ఇప్పటివరకు భారత పతకాల సంఖ్య 12కు చేర్చింది. వాటిల్లో రెండు స్వర్ణం, 6 రజతం, 4 కాంస్య పతకాలు ఉన్నాయి.

అంతకుముందు 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ విభాగంలో బంగారు పతకం సాధించి చరిత్ర సృష్టించిన అవని, పారాలింపిక్స్‌ లో స్వర్ణం సాధించిన తొలి భారత మహిళగా రికార్డు నెలకొల్పిన సంగతి తెలిసిందే. కాగా, ఈ రోజే అటు ప్రవీణ్ కుమార్ పురుషుల హైజంప్‌ T64 విభాగంలో 2.07 మీటర్ల ఎత్తు జంప్ చేసి రజత పతకాన్ని సాధించాడు. 18 ఏళ్లకే పతకం సాధించిన పిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించాడు. కాగా, రెండో పతకం సాధించిన అవనికి ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలియజేశారు. అవని కాంస్య పతక ప్రదర్శనతో టోక్యో ఒలింపిక్స్ లో భారత ఖ్యాతి మరింత పెరిగిందని అన్నారు. భవిష్యత్ లో ఆమె మరిన్ని విజయాలను సాధించాలని ఆకాంక్షించారు. 2012లో జరిగిన ఓ కారు యాక్సిడెంట్ లో జైపూర్ కు చెందిన ఈ అమ్మాయి వెన్నుపూస విరిగి చక్రాల కుర్చీకే పరిమితమైపోయింది. 1984 పారాలింపిక్స్ లో జోగిందర్ సింగ్ సోధి మూడు పతకాలు సాధించడమే ఇప్పటిదాకా రికార్డ్. ఆయన ఓ రజతం, రెండు కాంస్య పతకాలను గెలిచారు. షాట్ పుట్ లో రజతం సాధించిన ఆయన.. డిస్కస్ త్రో, జావెలిన్ త్రోల్లో కాంస్య పతకాలను గెలుచుకొచ్చారు.