Begin typing your search above and press return to search.

కరోనా వేళ ఉద్యోగులకి గుడ్ న్యూస్ చెప్పిన ఆటోమొబైల్ కంపెనీలు..?

By:  Tupaki Desk   |   22 July 2020 1:00 PM IST
కరోనా వేళ ఉద్యోగులకి గుడ్ న్యూస్ చెప్పిన ఆటోమొబైల్ కంపెనీలు..?
X
కరోనా మహమ్మారి దెబ్బ ప్రతి రంగం పై పడింది. కరోనా వైరస్ విజృంభణ తరువాత దేశంలో వేతనాల కోత, ఉద్యోగాలు తీసేయడం మాత్రమే కనిపించింది. కానీ, తొలిసారి కరోనా విజృంభణ తరువాత ఉద్యోగులకి జీతాలు పెంచుతూ .. ఇంక్రెమెంట్లు, బోనస్ లు కూడా ప్రకటింస్తున్నాయి. కరోనా సమయంలో ఉద్యోగం తీయకపోతే చాలు ...మళ్లీ జీతాల పెంపు ,ఇంక్రెమెంట్లు, బోనస్ లా అనుకుంటున్నారా? ఇదేదో అబద్దం అనుకోకండి నిజంగా నిజమే కరోనా విజృంభణ తరువాత లాక్ డౌన్ సడలింపులు మొదలైన తరువాత ఆటోమొబైల్ కంపెనీల జోరు మాములుగా లేదు. కరోనా కంటే ముందు అంటే గత రెండేళ్ల నుండి ఆటోమొబైల్ కంపెనీలు మందగమనం కొనసాగుతోంది. అదే సమయంలో కరోనా విలయతాండవం మొదలు కావడంతో మరింత మందగమనంలోకి వెళ్ళిపోయింది.

కానీ, ప్రస్తుతం ఆటోమొబైల్ పరిశ్రమ పుంజుకుని తమ ఉద్యోగులకు తీపి కబురు అందించటంతో మిగిలిన రంగాలకు కూడా భవిష్యత్ పై భరోసా కలిగే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దేశంలోని దిగ్గజ కార్ల తయారీ కంపెనీలు అన్నీ కూడా తమ ఉద్యోగుల వేతనాలను పెంచుతుండటం విశేషం. టొయోట కిర్లోస్కర్ , హ్యుందాయ్ మోటార్ ఇండియా కూడా ఇదే దారిలో పయనిస్తుంది. ఇక దేశీయ కార్ల దిగ్గజం మారుతి సుజుకి , ఎంజి మోటార్ .. తన ఉద్యోగులకు బోనస్, ఇంక్రెమెంట్లను వచ్చే రెండు నెలల్లో అందించేందుకు సన్నద్ధం అవుతుంది. గత ఏడాది కాలంగా ఆటోమొబైల్ పరిశ్రమ లోని ఉద్యోగుల్లో ఒక ఆందోళన నెలకొంది. అమ్మకాలు క్షీణించి పోవటం, ఆ వెంటనే కరోనా రావటంతో ఉద్యోగ భద్రత ప్రమాదంలో ఉందని భావించారు. కానీ, తాజా పరిణామాలు చూస్తే వారికి ఇక మంచి రోజులు వచ్చినట్టే. మొత్తంగా చూస్తే దేశంలోని 14 ప్రధాన కార్లు, వాహనాలు తయారు చేసే ఆటోమొబైల్ కంపెనీల్లో 10 కంపెనీలు తమ ఉద్యోగుల వేతనాలు పెంపు, బోనస్, ఇంక్రెమెంట్ల చెల్లింపు నిర్ణయాలు తీసుకోవటం శుభసూచికం.

హోండా, టొయోట, రెనాల్ట్ కంపెనీలు తమ ఉద్యోగులకు 4% నుంచి 14% వరకు వేతనాలు పెంచాయి. ఉద్యోగుల కేటగిరీ ని బట్టి వారికి జీతభత్యాల పెంపు వర్తిస్తుంది. హ్యుందాయ్ మోటార్ ఇండియా అయితే తమ కార్మికులకు ప్రమోషన్లు కూడా ప్రకటించగా... ఉద్యోగులకు బోనస్ లను కూడా చెల్లించటం విశేషం. ఇక మహీంద్రా అండ్ మహీంద్రా అయితే , తమ ఉద్యోగుల వేతనాలు తగ్గించేది లేదని, అలాగే పెంపు కూడా ఉండబోదని స్పష్టం చేసింది. ప్రస్తుతం కరోనా విజృంభిస్తుండటంతో ప్రజా రవాణా, షేరింగ్ ట్రాన్స్పోర్టేషన్ కు గిరాకీ తగ్గి, మళ్ళీ సొంత వాహనాలపై మక్కువ చూపుతున్నారు. దీంతో ఆటోమొబైల్ కంపెనీలకు కేవలం 2 నెలల్లోనే మళ్ళీ కరోనా కంటే ముందు ఉన్న అమ్మకాల్లో 85% నికి దగ్గరగా తాజా సేల్స్ వచ్చేశాయి. దీన్ని బట్టి చూస్తే అతి త్వరలోనే దేశంలోని ఇతర రంగాలకు భరోసానిస్తే మన ఆర్థిక వ్యవస్థ త్వరలోనే కోలుకుంటుందని చెప్పొచ్చు.