Begin typing your search above and press return to search.

టీఆర్ఎస్ కార్యకర్తల అత్యుత్సాహంతో ఆటోడ్రైవర్ సీరియస్

By:  Tupaki Desk   |   15 Nov 2022 10:36 AM GMT
టీఆర్ఎస్ కార్యకర్తల అత్యుత్సాహంతో ఆటోడ్రైవర్ సీరియస్
X
టీఆర్ఎస్ కార్యకర్తల అత్యుత్సాహం ఓ ఆటో డ్రైవర్ పాలిట శాపంగా మారింది. అతడి పరిస్థితి సీరియస్ గా ఉంది. ఒళ్లంతా కాలిన గాయాలతో ఆస్పత్రి పాలయ్యాడు. సంగారెడ్డిలో ఈ విషాదం చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త మెడికల్ కాలేజీల ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకొని టీఆర్ఎస్ కార్యకర్తలు సంగారెడ్డి మెడికల్ కాలేజీ ఓపెనింగ్ సందర్భంగా విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు.

ఈ ఉదయం సంగారెడ్డితోపాటు 8 మెడికల్ కాలేజీలను కేసీఆర్ ప్రారంభించారు. హైదరాబాద్ ప్రగతి భవన్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వాటిని లాంఛనంగా అందుబాటులోకి తీసుకొచ్చారు. ఆన్ లైన్ విధానంలో తరగతులను ప్రారంభించారు. దీంతో ఇప్పటివరకూ ఉన్న ప్రభుత్వ వైద్య కళాశాలల సంఖ్య 17కు పెరిగింది. కొత్త కళాశాలలు అందుబాటులోకి రావడంతో అదనంగా 1150 మంది విద్యార్థులకు వైద్యవిద్య అందనుంది.

సంగారెడ్డిలో మెడికల్ కాలేజీ అందుబాటులోకి రావడంతో టీఆర్ఎస్ కార్యకర్తలు ఆనందోత్సాహాలను వ్యక్తం చేశారు. భారీ ఎత్తున బైక్ ర్యాలీని నిర్వహించారు. వైద్య కళాశాలల ప్రారంభోత్సవాన్ని పండుగలా జరుపుకున్నారు. ఈ సందర్భంగా భారీగా బాణాసంచాను కాల్చారు.

అయితే ఇక్కడే అపశృతి చోటుచేసుకుంది. పేలిన బాణాసంచాలన్నీ అటుగా వెళుతున్న ఆటోపై పడ్డాయి. క్షణంలో మంటలు అంటుకున్నాయి. ఈ మంటల్లో ఆటోడ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు. ఒళ్లంతా కాలిన గాయాలయ్యాయి.

పక్కనే ఉన్న టీఆర్ఎస్ కార్యకర్తలు మంటలు ఆర్పడానికి ప్రయత్నించేసరికి పరిస్థితి చేయిదాటింది. పక్కనే బట్టల దుకాణం నుంచి శాలువాలను తీసుకొచ్చి అతడిపై కప్పారు. ప్రస్తుతం ఆటోడ్రైవర్ పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం.

తెలంగాణ వ్యాప్తంగా కొత్త మెడికల్ కాలేజీల సంబరం వేళ టీఆర్ఎస్ కార్యకర్తల అత్యుత్సాహంతో ఒకరు సీరియస్ కావడం విషాదం నింపింది. దీనిపై స్థానికులు టీఆర్ఎస్ నేతలపై మండిపడుతున్నారు. ఆటోడ్రైవర్ కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.