Begin typing your search above and press return to search.

రోడ్డు పై చెత్త వేశారో.. లెక్క తెలుస్తారు !

By:  Tupaki Desk   |   7 Aug 2021 5:03 PM IST
రోడ్డు పై చెత్త వేశారో.. లెక్క తెలుస్తారు !
X
ఇంటిని ఎంత పరిశుభ్రంగా ఉంచుకుంటామో.. పరిసరాలను కూడా అంతే శుభ్రంగా ఉంచుకోవాలి. ముఖ్యంగా దేశంలో కరోనా మహమ్మారి జోరు గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న సమయంలో క్లీన్ అండ్ గ్రీన్ అనేది చాలా ముఖ్యం. మనం ఎంత ఆరోగ్యంగా ఉండాలి అంటే అంత శుభ్రంగా ఉండాలి. కానీ, కొందరు మాత్రం ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు. ఒక స్వచ్ఛ భారత్ అని చెప్తున్నా, ఏ మాత్రం భాద్యత లేకుండా రోడ్లపై చెత్త వేస్తున్నారు. తమ ఇంట్లోని చెత్తని రోడ్లపై ఎందుకు వేస్తున్నారో ఒక్కసారి ఆలోచించాలి. మన ఇంటిని శుభ్రంగా ఉంచుకుంటే సరిపోదు,మన చుట్టూ ఉన్న పరిసరాల్ని కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. మీకు తెలిసో, తెలియకో ఖాళీ ప్రదేశం ఉందని రోడ్లపై చెత్త వేశారో కెమెరా కళ్లు గుర్తిస్తాయ్‌. చెత్త వేసిన వారికి పెనాల్టీలు విధిస్తారు. పదే పదే అదే ‘చెత్త’పని చేస్తే సంబంధిత అధికారులు కఠిన చర్యలు తీసుకుంటారు

ఇకపోతే , ఆంధ్రప్రదేశ్‌ లోని నంద్యాల మున్సిపల్ పట్టణాన్ని గ్రీన్ సిటీ, క్లీన్ సిటీగా మార్చేందుకు ఎమ్మెల్యే శిల్పా రవి, ఇతర మున్సిపల్ అధికారులు తమ వంతుగా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. . గడిచిన కాలంగా స్వచ్ఛ నంద్యాల లో భాగంగా వివిధ కార్యక్రమాలు చేపట్టిన అధికారులు బహిరంగ ప్రదేశాల్లో కుప్పలుగా పేరుకుపోయిన చెత్తను తొలగించింది. భహిరంగ ప్రదేశాల్లో గుట్టలుగా పోగైన చెత్తను తొలగించడంతో పాటు ఆయా సందర్భాల్లో అక్కడ ముగ్గులు వేశారు. దీపావళి వంటి పండుగలు నిర్వహించారు. ఖాళీ అయిన ఆ ప్రదేశాల్లో తిరిగి చెత్త వేస్తుండటం అధికారుల దృష్టికి వచ్చింది. ఎన్ని విధాలుగా చెప్పినా, ఎంతగా అవగాహన కల్పించినా మారని వారికోసం కఠిన చర్యలు తప్పవనే నిర్ణయానికొచ్చారు.

ఇందులో భాగంగానే ఎక్కడైతే బహిరంగ ప్రదేశాల్లో చెత్త ఎక్కువగా వేస్తున్నారో, వాటిని గుర్తించి అక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఈ కెమెరాలన్నింటిని మున్సిపల్ కార్యాలయానికి అనుసంధానించారు. సీసీ కెమెరాల ద్వారా చెత్త వేసే వారిని గుర్తించి జరిమానాలు విధిస్తున్నారు. నంద్యాల పట్టణంలో ఈ కార్యక్రమం గత కొన్ని రోజులుగా జరుగుతూ ఉండటంతోపాటు, రోడ్ల మీద చెత్త వేస్తున్న వారికి భారీగా పెనాల్టీలు కూడా వేస్తుండటంతో బహిరంగ ప్రదేశాలలో చెత్త వేసే వారి సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది.

జరిమానాలకు బిత్తరపోయి పబ్లిక్ ప్లేసెస్‌లో చెత్త వేయడానికి భయపడుతున్నారు స్థానికులు. దీని ద్వారా ప్రజల్లో కొంత మార్పు వచ్చినట్లు ఎమ్మెల్యే మున్సిపల్ అధికారులు భావిస్తున్నారు. దీంతో మొత్తం పట్టణమంతా కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసే యోచనలో ఉన్నారు. కాగా, బహిరంగ ప్రదేశాల్లో చెత్తవేసి పెనాల్టీల బారినపడ్డ బాధితులు మాత్రం.. స్థానికులకు హితబోధ చేయడం కనిపిస్తోంది. చెత్త వేయడంలో ఇష్టానికి ప్రవర్తిస్తే అంతే సంగతంటూ తోటి కాలనీ వాసుల్ని హెచ్చిరిస్తున్నారు.