Begin typing your search above and press return to search.

కొళాయి నీళ్లు వాడొద్దంటూ అమెరికాలో అక్కడి అధికారుల హెచ్చరిక

By:  Tupaki Desk   |   28 Sept 2020 7:00 AM IST
కొళాయి నీళ్లు వాడొద్దంటూ అమెరికాలో అక్కడి అధికారుల హెచ్చరిక
X
అమెరికాలోని మున్సిపల్ అధికారులు ఒక ప్రాంతంలో నివసించే వారెవరూ కుళాయి నీళ్లు వాడకూడదని హెచ్చరికలు జారీ చేశారు. దీనికి కారణం తెలిస్తే.. చెమటలు పట్టాల్సిందే. టెక్సాస్ రాష్ట్రంలోని లేక్ జాక్సన్ ప్రాంతంలోని ప్రజలెవరూ ప్రభుత్వం సరఫరా చేసే నీటిని వినియోగించకూడదని స్పష్టం చేశారు. మనిషి మెదడును తినేసే ప్రాణాంతక సూక్ష్మజీవులతో ప్రమాదం పొంచి ఉందన్న అనుమానాలే.. ఇందుకు కారణంగా చెబుతున్నారు.

లేక్ జాక్సన్ ప్రాంతంలో దాదాపు 27 వేల మంది ప్రజలు నివసిస్తుంటారు. అక్కడి కుళాయి నీళ్లలో నేగ్లెరియా ఫోలరీ అనే రకం అమీబా ఉన్నట్లుగా భావిస్తున్నారు. ఈ రకం అమీబా కొత్తేం కాకున్నా.. చాలా అరుదుగానే నీటిలో కనిపిస్తుంటుంది. ఈ రకం అమీబా ప్రపంచ వ్యాప్తంగా ఉంది. దీనికున్న మంచిగుణం.. ఇది అంటువ్యాధి కాదు. ఒకరితో ఒకరికి వ్యాపించే వీల్లేదు.

అదే సమయంలో ఇది చాలా ప్రమాదకరమైంది. ఈ అమీబా సోకిన వారికి జ్వరం.. వికారం.. వాంతులు.. మెడ పట్టేసినట్లుగా ఉండటం.. తలనొప్పి లాంటి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. ఇది సోకిన తర్వాత వెంటనే వైద్యసాయం అందకపోతే.. మరణం వరకు వెళ్లే ప్రమాదం ఉంది. దీని కారణంగా పలువురు చనిపోతుంటాని అధికారులు చెబుతున్నారు. ఇప్పటివరకు ఈ రకం కేసు ఒకటి ఫ్లోరిడాలో నమోదైంది. దీంతో.. అప్రమత్తమైన అధికారులు జాగ్రత్తలు జారీ చేశారు.

లేక్ జాక్సన్ లో ప్రస్తుతం సరఫరా అయిన నీరు మొత్తం తొలగించే వరకూ.. కొత్త నీటి నమూనాల్ని సేకరించిన తర్వాతే హెచ్చరికలు తొలగించనున్నారు. తాము సరఫరా చేసిన నీటిని కేవలం బాత్రూం ఫ్లష్ లకు మాత్రమే వాడాలని అధికారులు కోరుతున్నారు. అయితే.. ఈ నీటిని తీయటానికి ఎంతకాలం పడుతుందో చెప్పలేమని చెబుతున్నారు. ఏమైనా.. మున్సిపల్ అధికారుల మాటతో స్థానిక ప్రజలు హడలిపోతున్నారు.