Begin typing your search above and press return to search.

భారత్ టూర్ రద్దు చేసుకున్న ఆ దేశ ప్రధాని

By:  Tupaki Desk   |   4 Jan 2020 9:58 AM IST
భారత్ టూర్ రద్దు చేసుకున్న ఆ దేశ ప్రధాని
X
నయా ప్రపంచంలో నీరో చక్రవర్తి అంటూ అపకీర్తిని ఎదుర్కొంటున్న ఆస్ట్రేలియా ప్రధానమంత్రి మోరిసన్ దిద్దుబాటు చర్యలకు తెర తీశారా? అంటే అవునని చెప్పాలి. ఆస్ట్రేలియాలోని పలుప్రాంతాల్లో ప్రబలిన కార్చిచ్చు ఇప్పుడా దేశాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. కొత్త సంవత్సరం వేళ ప్రపంచంలోని చాలా దేశాలు ఆనందంతో పండుగ చేసుకుంటే.. ఆస్ట్రేలియా ప్రజలు మాత్రం కార్చిచ్చుతో కిందామీదా పడుతున్నారు.

ఇలాంటివేళ.. తమ దేశ జట్టు న్యూజిలాండ్ తో ఆడే క్రికెట్ మ్యాచ్ కోసం తామెంత భద్రతను కల్పిస్తున్న విషయాన్ని చెప్పటమే కాదు.. వారిని స్వయంగా కలవటం ద్వారా దేశ ప్రజల ఆగ్రహాన్ని ఎదుర్కొంటున్నారు ఆస్ట్రేలియా ప్రధాని. కార్చిచ్చుతో ప్రజలు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కోవటమేకాదు.. పెద్ద ఎత్తున ప్రాణనష్టంతో పాటు ఆస్తి నష్టాన్ని ఎదుర్కొంటున్న వేళ.. కీలకమైన అంశాన్ని వదిలేసి.. క్రికెట్ జట్టును కలవటం అంత ముఖ్యమా? అని తిట్టిపోస్తున్నారు.

ఇలా ప్రతికూలతల్ని ఎదుర్కొంటున్న ఆస్ట్రేలియా ప్రధాని తాజాగా తన భారత్ పర్యటనను రద్దు చేసుకున్నారు. దేశ ప్రజలు ఎదుర్కొంటున్న కార్చిచ్చు బీభత్సం వేళ తాను విదేశీ పర్యటనకు వెళ్లకూడదని నిర్ణయించుకున్నారు. ఈ నెల 13 నుంచి నాలుగు రోజుల పాటు ఆయన భారత్ లో పర్యటించటమే కాదు.. ప్రధాని మోడీతో ద్వైపాక్షిక చర్చలు జరపాల్సింది. తన భారత పర్యటనలో భాగంగా ముంబయి.. బెంగళూరు మహానగరాల్ని కూడా పర్యటించాల్సి ఉంది.

కొద్దిరోజులుగా దేశాన్ని అతలాకుతలం చేస్తున్న కార్చిచ్చు బీభత్సం ఇప్పటికి ఒక కొలిక్కి రాలేదు. ఇప్పటివరకూ ఈ మంటల్లో 20 మంది చిక్కుకొని ప్రాణాలు కోల్పోతే.. సుమారు 500 ఇళ్లు దగ్థమయ్యాయి. విక్టోరియాలోని మల్లకూట ప్రాంతంలో దాదాపు 3వేల మంది పర్యాటకులు చిక్కుకుపోతే.. మరో వెయ్యి మంది ఇతర ప్రాంతాల్లో ఇరుక్కుపోయారు. న్యూసౌత్ వేల్స్.. విక్టోరియా రాష్ట్రాల్లో కార్చిచ్చు తీవ్రత ఎక్కువగా కనిపిస్తోంది. ఆస్ట్రేలియా ఎదుర్కొంటున్న కార్చిచ్చు సమస్య వేళ.. భారత ప్రధాని మోడీ మాట్లాడారు. భారీగా ఏర్పడిన ప్రాణ.. ఆస్తి నష్టంపై భారతీయులందరి తరఫున ఆయన సంతాపాన్ని వ్యక్తం చేశారు.