Begin typing your search above and press return to search.

వాళ్లు క్రికెట్ మానేసి ఉద్యోగాలు చూసుకుంటున్నారు

By:  Tupaki Desk   |   11 July 2017 9:32 AM GMT
వాళ్లు క్రికెట్ మానేసి ఉద్యోగాలు చూసుకుంటున్నారు
X
స్టార్ క్రికెట‌ర్ల‌కు వ‌చ్చిన చిత్ర‌మైన స‌మ‌స్య ఇది. త‌మ క్రికెట్ బోర్డుతో ఏర్ప‌డిన జీతాల వివాదం కార‌ణంగా ఆస్ట్రేలియా ప్లేయ‌ర్స్ వేరే ఉద్యోగాల‌ను చూసుకుంటున్నారు. గ‌త నెల 30తోనే బోర్డుతో ప్లేయ‌ర్స్ కాంట్రాక్ట్ ముగిసింది. జులై 1 లోపే కొత్త కాంట్రాక్ట్‌ పై సంత‌కం చేయాల్సి ఉన్నా.. ఆదాయంలో వాటా విధానానికి స్వ‌స్తి చెప్పి బోర్డు కొత్త జీతాల ప‌ద్ధ‌తిని ప్ర‌వేశ‌పెట్ట‌డాన్ని ప్లేయ‌ర్స్ తీవ్రంగా వ్య‌తిరేకించారు. కాంట్రాక్ట్‌ ల‌పై సంత‌కాలు చేయ‌లేదు. దీంతో వాళ్ల‌కు ఆస్ట్రేలియా బోర్డు జీతాలు ఇవ్వ‌డం లేదు. ఇక చేసేది లేక వేరే ఆదాయ మార్గాలు చూసుకుంటున్నారు.

ఆస్ట్రేలియ‌న్ క్రికెట‌ర్స్ అసోసియేష‌న్ జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్ టిమ్ క్రూయిక్‌ షాంక్ మాట్లాడుతూ క్రికెట్ ఆస్ట్రేలియా వ‌ల్లే ప్లేయ‌ర్స్‌ కు ఈ ప‌రిస్థితి త‌లెత్తింద‌ని అన్నారు. `ప్లేయ‌ర్స్‌ కు జీతాలు చెల్లించ‌డం లేదు.. చెల్లించ‌బోమ‌ని కూడా క్రికెట్ ఆస్ట్రేలియా తేల్చి చెప్పింది. దీంతో త‌ప్ప‌నిస‌రి ప‌రిస్థితుల్లో వేరే మార్గాలు చూసుకోవాల్సి వ‌స్తోంది` అని ఆయ‌న తెలిపారు. జీతాల వివాదం కార‌ణం ఇప్ప‌టికే ఆస్ట్రేలియా ఎ టీమ్ సౌతాఫ్రికా టూర్ ర‌ద్ద‌యింది. సీనియ‌ర్ టీమ్ ఇండియా - సౌతాఫ్రికా టూర్ల‌తోపాటు యాషెస్ సిరీస్ జ‌ర‌గ‌డం కూడా ఇప్పుడు అనుమానంగా మారింది. ఈ వివాదంలో ప్లేయ‌ర్సంతా క‌లిసిక‌ట్టుగా ఉన్నార‌ని, త‌గ్గేదే లేద‌ని నిర్ణ‌యించుకున్నార‌ని టిమ్ చెప్పారు. క్రికెట్ ఆస్ట్రేలియాతో క‌లిసి ప‌నిచేయ‌డానికి తాము సిద్ధంగా ఉన్నా.. ఆదాయంలో వాటా విష‌యంలో మాత్రం రాజీ ప్ర‌స‌క్తే లేద‌ని ఈ మ‌ధ్యే కెప్టెన్ స్టీవ్ స్మిత్ కూడా స్ప‌ష్టంచేశాడు. క్రికెట్ ఆస్ట్రేలియా మాత్రం ఆదాయంలో ఎక్కువ భాగాన్ని కింది స్థాయిలో క్రికెట్ అభివృద్ధికి కేటాయించాల‌ని భావిస్తోంది.

కాగా, క్రికెట్ బోర్డుల‌తో జీతాల వివాదం ఇది కొత్త కాదు. 1970ల్లో ఇదే ఆస్ట్రేలియా టీమ్ ప్లేయ‌ర్స్ బోర్డుతో ప‌డ‌క‌.. రెబ‌ల్ వ‌ర‌ల్డ్ సిరీస్ క్రికెట్‌ లో చేరిన విష‌యం తెలిసిందే. రీసెంట్‌ గా వెస్టిండీస్ క్రికెట‌ర్లు కూడా ఇలాగే బోర్డుతో విభేదించి టీమ్‌ లో స్థానాలు కోల్పోయారు. ఆస్ట్రేలియా ప్లేయ‌ర్స్ డ‌బ్బుపై వ్యామోహంతో ఇలా చేయ‌డం లేద‌ని, అయితే ప్ర‌తి ఒక్క‌రి ప్ర‌యోజ‌నాల‌ను కాపాడే విధానం ఉండాల‌న్న‌ది వారి డిమాండ్ అని ఏసీఏ జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్ టిమ్ చెప్పారు.