Begin typing your search above and press return to search.

24 ఏళ్ల తర్వాత పర్యటన.. ఆటగాడిని చంపుతామంటూ బెదిరింపు

By:  Tupaki Desk   |   2 March 2022 3:30 AM GMT
24 ఏళ్ల తర్వాత పర్యటన.. ఆటగాడిని చంపుతామంటూ బెదిరింపు
X
సాధారణంగా ద్వైపాక్షిక సిరీస్ లంటే ఏడాదికో రెండేళ్లకో జరుతుంటాయి. లేదంటే కనీసం నాలుగేళ్లకు ఒకసారయినా జరుగుతాయి. అయితే, ఒక జట్టు, ఓ దేశంలో 24 ఏళ్లపాటు పర్యటించనే లేదంటే నమ్ముతారా? అది నిజం. అలా పర్యటనకు రాని జట్టు ఆస్ట్రేలియా అయితే.. ఈ ఆతిథ్య దేశం పాకిస్థాన్. బాంబు పేలుళ్లు, ఉగ్రవాదంతో అట్టుడికే పాకిస్థాన్ వెళ్లేందుకు ఏ జట్టయినా ఎందుకు సిద్ధంగా ఉంటుంది. ఇదే కోణంలో ఆసీస్ రెండు దశాబ్దాలపైగా దూరంగా ఉంటోంది. చివరి సారి 1998లో కంగారూలు పాకిస్థాన్ లో పర్యటించారు.

అంటే.. దాదాపు రెండు ఆసీస్ క్రికెట్ తరాలు పాకిస్థాన్ గడ్డపై కాలు మోపలేదని అనుకోవచ్చు. ఆస్ట్రేలియా అనే కాదు ఇంగ్లండ్, న్యూజిలాండ్ కూడా చానాళ్లు పాక్ కు వెళ్లేందుకు అంగీకరించలేదు. పర్యటనకు బోర్డులు ఒప్పందం కుదుర్చకున్నా ఆటగాళ్లు తాము వెళ్లలేమంటూ వైదొలగిన సందర్భాలున్నాయి. మరోవైపు తాజాగా ఆస్ట్రేలియా పాకిస్థాన్ టూర్ కు వచ్చింది.

అయితే, ఆదిలోనే హంసపాదులా ఆ జట్టు ఆటగాడి ప్రాణాలు తీస్తామంటూ బెదిరింపులొచ్చాయి. ఓ క్రికెటర్ కు ఈ స్థాయిలో బెదిరింపులు రావడం అంటే మామూలు మాటలు కాదు. అదికూడా ఆస్ట్రేలియా క్రికెటర్ కు బెదిరింపులంటే మిగతా పాశ్చాత్య ప్రపంచం మొత్తం పట్టించుకుంటుంది. భార్యకు బెదిరింపులు ఆస్టన్ ఆగర్. ఆసీస్ ఆల్ రౌండర్.

ఇప్పుడిప్పుడే కీలక ఆటగాడిగా ఎదుగుతున్నాడు. పాకిస్థాన్‌ పర్యటనలో ఉన్న ఆస్ట్రేలియా జట్టలోనూ సభ్యుడు. అలాంటి ఆటగాడిని చంపుతామంటూ బెదిరింపులు వచ్చాయి. అతడి భార్య మెడ్‌లీన్‌ ఇన్‌స్టాగ్రామ్‌కు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి ఈ హెచ్చరికలు వెళ్లాయి. వీటిని ఆస్ట్రేలియా, పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డులు తోసిపుచ్చాయి.

ఆ హెచ్చరికలు నిజమైనవి కావని, ఎవరో కావాలనే చేశారని తమ దర్యాప్తులో తేలిందని వెల్లడించాయి. దీంతో ఆస్ట్రేలియా ఆటగాడికి ఎలాంటి ప్రమాదం లేదని చెప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

ఆసీస్ జట్టులో కలవరం.. సరిగ్గా 12 ఏళ్ల క్రితం.. 2010లో ఇదే రోజుల్లో శ్రీలంక పాకిస్థాన్ లో పర్యటించింది. ఆ రోజుల్లో ఉగ్రవాదం తీవ్రంగా ఉండేది. పాకిస్థాన్ మాజీ ప్రధాని బెనజీర్ బుట్టోనే దారుణ హత్యకు గురయి అప్పటికి రెండు మూడేళ్లే. ఇక బాంబు పేలుళ్లు సరేసరి. రోజూ పాక్ లోని ఏదో ఒక నగరం బాంబు పేలుళ్లతో దద్దరిల్లేది. అప్పటికే ముంబైలో జరిగిన దాడులు (26/11)తో భారత్.. పాకిస్థాన్ ను పూర్తిగా దూరం పెట్టింది.

మిగతా క్రికెట్ ప్రపంచమూ దగ్గరకు తీయలేదు. అలాంటి సమయంలో ధైర్యం చేసి టూర్ కు వెళ్లింది శ్రీలంక. కానీ.. ఆ జట్టు ఆటగాళ్లు ప్రయాణిస్తున్న బస్సుపై ఉగ్రవాదులు దాడులకు తెగబడ్డారు. మిడిలార్డర్ బ్యాట్స్ మన్ సమరవీర తీవ్రంగా గాయపడ్డాడు. అప్పటినుంచి విదేశీ జట్లు పాక్ లో పర్యటన అంటే బెంబేలెత్తేవి.

ఈ నేపథ్యంలో ప్రస్తుతం పరిస్థితులు సద్దుమణగడంతో 24 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఆస్ట్రేలియా టూర్ కు వచ్చింది. ఈ క్రమంలోనే ఆగర్ కు బెదిరింపులు రావడంతో జట్టు ఒకింత కలవరపాటుకు గురైంది. ‘మెడ్‌లీన్‌ మీరు బాగున్నారని ఆశిస్తున్నా. అయితే, మీకో హెచ్చరిక.. మీ భర్త ఆష్టన్‌ అగర్‌ పాకిస్థాన్‌ పర్యటనకు వస్తే.. అతడు తిరిగి ఆస్ట్రేలియాకు వెళ్లడు.

ఈ పర్యటనకు వస్తే మీ పిల్లలు తండ్రిని కోల్పోతారు. మావాళ్లు మీ భర్తను చంపేస్తారు’ అని ఆమెకు మెసేజ్‌లు పంపారు. ఈ విషయాన్ని మెడ్‌లీన్‌ వెంటనే ఆసీస్‌, పాక్‌ క్రికెట్‌ బోర్డులకు తెలియజేయగా భద్రతా అధికారులు రంగంలోకి దిగి దర్యాప్తు చేపట్టారు. అయితే, ఆ బెదిరింపులు నిజమైనవి కాదని తేలిందన్నారు.

ఒక ఫేక్‌ అకౌంట్‌ నుంచే ఆ సందేశాలు వచ్చాయని పేర్కొన్నారు. ఈ పర్యటనలో పాకిస్థాన్‌తో ఆసీస్‌ మూడు టెస్టులు, మూడు వన్డేలతో పాటు ఒక టీ20 మ్యాచ్‌లో తలపడనుంది. మార్చి 4 నుంచి ఏప్రిల్‌ 5 వరకు ఈ పర్యటన కొనసాగనుంది. కాగా, ఈ రెండు జట్లు ఇప్పటివరకు యూఏఈ వంటి తటస్థ వేదికలపై తలపడుతున్నాయి.