Begin typing your search above and press return to search.

జకోవిచ్ కు భారీ షాక్.. మరోసారి వీసా రద్దు

By:  Tupaki Desk   |   14 Jan 2022 1:03 PM GMT
జకోవిచ్ కు భారీ షాక్.. మరోసారి వీసా రద్దు
X
ఆస్ట్రేలియా ఓపెన్ లో పాల్గొని రికార్డు స్థాయిలో 21వ గ్రాండ్ స్లామ్ సాధించాలని కలలుగన్న టెన్నిస్ దిగ్గజం, ప్రపంచ నంబర్ 1 ఆటగాడు నోవాక్ జకోవిచ్ కు భారీ షాక్ తగిలింది. ఆస్ట్రేలియా ప్రభుత్వం తాజాగా మరోసారి అతడి వీసాను రద్దు చేసింది. దీంతో మూడేళ్లు అతడు మళ్లీ ఆస్ట్రేలియా గడ్డపై అడుగుపెట్టేందుకు అవకాశం రాకపోవచ్చు. ఈ మేరకు ఆ దేశ ఇమ్మిగ్రేషన్ మినిస్ట్రర్ అలెక్టస్ హాకే కఠిన నిర్ణయం తీసుకున్నారు. దేశ ప్రజల ఆరోగ్య భద్రత నేపథ్యంలో జకోవిచ్ వీసాను రద్దు చేస్తున్నట్లు తెలిపారు. అందుకు తన పూర్తి విచక్షణా అధికారం ఉపయోగించినట్లు చెప్పారు.

జకోవిచ్ ఈనెల 5న మెల్ బోర్న్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నాడు. అయితే అతడి వద్ద వ్యాక్సినేషన్ కు సంబంధించిన ధ్రువపత్రాలు లేవు. దీంతో ఆస్ట్రేలియా బోర్డర్ ఫోర్స్ అధికారులు అతడిని అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే జకోవిచ్ వీసాను రద్దు చేసి అతడిని ఇమ్మిగ్రేషన్ డిటెన్షన్ సెంటర్ కు తరలించారు.

తనకు వైద్యపరమైన మినహాయింపులు ఉన్నాయని చెప్పినా అధికారులు పట్టించుకోలేదని జకోవిచ్ కోర్టుకెక్కారు. డిసెంబర్ 16న తనకు కోవిడ్19 సోకిందని.. దీంతో వ్యాక్సినేషన్ అవసరం లేదంటూ తన లాయర్ల ద్వారా కోర్టులో వాదనలు వినిపించారు.

ఆస్ట్రేలియా ఫెడరల్ కోర్టు జకోవిచ్ కు అనుకూలంగా తీర్పునిచ్చింది. అతడి వీసాను వెంటనే పునురుద్దరించాలని.. అతడిని డిటెన్షన్ సెంటర్ నుంచి విడుదల చేయాలని అధికారులను ఆదేశించింది. దీంతో జకోవిచ్ డిటెన్షన్ సెంటర్ నుంచి బయటకు వచ్చి హోటల్ కు చేరుకున్నాడు. ఆ తర్వాత కొద్దిగంటల్లోనే తిరిగి ప్రాక్టీస్ మొదలుపెట్టాడు.

ఇక జనవరి 17 నుంచి మెగా ఈవెంట్ ప్రారంభమవుతున్న తరుణంలో ఆస్ట్రేలియా ఇమ్మిగ్రేషన్ మంత్రి తన విచక్షణాధికారాన్ని ఉపయోగించి మరోసారి వీసా రద్దు చేశారు.