Begin typing your search above and press return to search.

తీవ్ర ఆంక్ష‌ల‌కు సిద్ధం.. ఆస్ట్రేలియా ఆశ‌లు వ‌దులుకోవాల్సిందే..

By:  Tupaki Desk   |   27 July 2020 4:40 PM IST
తీవ్ర ఆంక్ష‌ల‌కు సిద్ధం.. ఆస్ట్రేలియా ఆశ‌లు వ‌దులుకోవాల్సిందే..
X
ప్ర‌స్తుతం విదేశీయానం.. ఎన్నారై అంటేనే దూరం పెట్టే పరిస్థితి. విదేశాల‌కు వెళ్లాల‌నే ఆలోచ‌న ఇప్ప‌ట్లో ఎవ‌రికీ లేదు. మ‌హ‌మ్మారి వైర‌స్ వ్యాప్తితో విదేశాల‌కు వెళ్లాల‌ని క‌ల‌లుగంటున్న వారికి ఊహించ‌ని దెబ్బ తగిలింది. ఒక ఏడాది.. రెండేళ్ల వ‌ర‌కు విదేశాల‌కు వెళ్లేందుకు సాహ‌సించ‌ని ప‌రిస్థితి. ఈ క్ర‌మంలో ఆయా దేశాలు త‌మ విదేశాంగ విధానంలో మార్పులు చేసుకుంటున్నాయి. విదేశీయుల‌కు కాకుండా త‌మ దేశ‌స్తుల‌కే ప్రాధాన్య‌మిచ్చేలా అమెరికాతో స‌హా అన్ని దేశాలు చ‌ర్య‌లు తీసుకుంటున్నాయి. ఇందులో భాగంగా తాజాగా ఆస్ట్రేలియా ఓ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. విదేశాలకు వెళ్లే వలసదారులపై పలు ఆంక్షలు విధించింది. త‌మ దేశానికి వచ్చి స్థిర‌ప‌డే వలసదారుల సంఖ్యపై ఆస్ట్రేలియా పరిమితి విధించింది. తాజాగా తీసుకున్న ఈ నిర్ణ‌యంతో భారతీయులపై తీవ్ర ప్ర‌భావం చూపనుంది. వీసాల నిబంధ‌న‌లు స‌ర‌ళ‌త‌రం.. అతి త‌క్కువ ఖ‌ర్చు ఉండే దేశం ఆస్ట్రేలియా. అందుకే అమెరికాకు అవ‌కాశం రాక‌పోతే ప్ర‌త్యామ్నాయంగా ద్వీప‌క‌ల్ప దేశంగా ఉన్న ఆస్ట్రేలియా విమానం ఎక్కుతారు. ఇప్పుడు అది కుద‌ర‌ని ప‌రిస్థితి.

తమ దేశంలోకి వలసదారుల ఎంట్రీపై ఆస్ట్రేలియా పరిమితులు విధిస్తూ నిర్ణయం తీసుకుంది. 2020-21 సంవత్సరానికి వలసదారుల సంఖ్య 30 వేలకు కుదించింది. 2018-19లో ఈ సంఖ్య 2,32,000గా ఉంది. అయితే ఆస్ట్రేలియా ఈ నిర్ణయం తీసుకోవ‌డానికి కార‌ణం మహమ్మారి వైర‌సే. ఆ మహమ్మారి వ్యాప్తితో ఆస్ట్రేలియా ఆర్థిక వ్యవస్థ ఇంకా కోలుకోలేదు. ఇతర దేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై నిషేధం విధించడం, సరిహద్దులు మూసివేయడం వంటి చర్యలు తీసుకోవడంతో ఇప్పుడు ఆస్ట్రేలియా ఆర్థిక వ్యవస్థ కొంచెం ప్ర‌మాదంలో ప‌డింది. అయినా స‌రే దేశ ఆరోగ్యం కోసం ఆస్ట్రేలియా ఈ నిర్ణ‌యం తీసుకుంది. వాస్త‌వంగా వ‌ల‌స‌దారుల వ‌లన దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ మెరుగ్గా ఉంటుంది. కానీ ప‌రిస్థితులు ప్ర‌తికూలంగా ఉన్న ప‌రిస్థితుల్లో ఆ క‌ఠిన నిర్ణ‌యం తీసుకుంది.

అంతర్జాతీయ ప్రయాణికులపై ఆంక్షలు విధించడంతో వీసా అప్లికేషన్ల సంఖ్య తగ్గిపోయిందని తెలుస్తోంది. 2018-19లో ఓవర్సీస్ నుంచి ఆస్ట్రేలియాకు వచ్చే వారి సంఖ్య 2,32,000 ఉండగా 2019-20కి అది ల‌క్ష 54 వేల‌కు పడిపోయింది. 2020-21కి 31వేలకు చేరుకుంది. ఆస్ట్రేలియాలో భారత్‌కు చెందిన వారు దాదాపు 7 లక్షల మంది ఉన్నారు. ఆస్ట్రేలియాలో నైపుణ్యం కలిగిన వలసదారుల్లో భారతీయులే అధిక సంఖ్యలో ఉన్నారు. అక్కడ 90 వేల మంది భారతీయ విద్యార్థులు పలు విశ్వ‌విద్యాల‌యాల్లో విద్యనభ్యసిస్తున్నారు. సరిహద్దులు వచ్చే ఏడాది జనవరిలో తెరుచుకుంటాయని సమాచారం. ప్ర‌స్తుతం ఆస్ట్రేలియాకు వ‌చ్చేవారు కనీసం రెండు వారాల పాటు హోంక్వారంటైన్‌లో ఉండాలనే నిబంధ‌న తీసుకోనున్నారు.

ఇంత‌లా జాగ్ర‌త్త‌ప‌డుతున్న ఆస్ట్రేలియా మ‌హ‌మ్మారి వైర‌స్ నుంచి కొంత కోలుకున్న‌ది. ఆ దేశంలో ఇప్పటివరకు న‌మోదైన కేసులు 13,900.. మృతులు 155 మంది. ప‌టిష్ట చ‌ర్య‌లు తీసుకోవ‌డంతో వైర‌స్‌ను క‌ట్ట‌డి చేశారు. భ‌విష్య‌త్‌లో వైర‌స్ తీవ్ర రూపం దాల్చ‌కుండా ఇప్ప‌టి నుంచే ఆస్ట్రేలియా జాగ్ర‌త్త‌లు ప‌డుతోంది. అందులో భాగంగానే వ‌ల‌స‌దారుల సంఖ్య‌ను కుదించింది.