Begin typing your search above and press return to search.

ఆగస్టు 15న మరో ఐదు దేశాలకు స్వాతంత్ర్య దినోత్సవం

By:  Tupaki Desk   |   14 Aug 2022 5:30 PM GMT
ఆగస్టు 15న మరో ఐదు దేశాలకు స్వాతంత్ర్య దినోత్సవం
X
ఆగస్టు 15 మనకు ఎంతో ప్రత్యేకం. పైగా ఈ ఏడాది 75వ స్వాతంత్ర్య దినం. అందుకే ఈ సిల్వర్ జూబ్లీకి ప్రతీ ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలని ప్రధాని మోడీ పిలుపునిచ్చాడు. ఎంతో మంది త్యాగధనులు తమ సర్వస్వంతోపాటు ప్రాణాలు త్యాగం చేసి సంపాదించిన ఈ స్వాతంత్య్రాన్ని మనం ఇప్పుడు జరుపుకుంటున్నాం. అంతటి స్వేచ్ఛను అనుభవిస్తున్నామంటే అదంతా స్వాతంత్ర్య సమరవీరులు పెట్టిన భిక్షనే. అందుకే అందరినీ తలుచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

బ్రిటీష్ వలస పాలన నుంచి భారతదేశానికి స్వాతంత్ర్యం లభించి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ సంవత్సరం 'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్' పేరుతో భారతదేశం స్వాతంత్ర్య దినోత్సవాన్ని పండుగగా జరుపుకుంటోంది. ప్రతీ ఇంటిపై భారత మువ్వెన్నెల పతాకం ఎగురవేస్తున్నారు.

ఇక భారత్ తోపాటు మరో ఐదు దేశాలు కూడా ఇదే రోజున స్వాతంత్ర్య దినోత్సవానికి జరుపుకుంటాయన్న సంగతి తెలుసా? భారత్ లాగా ఆ దేశాలు కూడా వలసవాదం.. పరాయి పాలన నుంచి విముక్తిని ఈ ఆగస్టు 15నే పొందాయి.

-ఉత్తరకొరియా, దక్షిణ కొరియా

రెండో ప్రపంచ యుద్ధంలో అరవీర భయంకరంగా ప్రత్యర్థులపై విరుచుకుపడిన దేశం జపాన్. జపాన్ పాలనలో 35 ఏళ్ల పాటు ఉన్న ఉత్తరకొరియా, దక్షిణ కొరియా దేశాలకు కూడా ఆగస్టు 15నే స్వాతంత్ర్యం వచ్చింది. రెండు కొరియా దేశాలను అమెరికా, దాని మిత్రదేశాలు కలిసి రెండో ప్రపంచ యుద్ధ సమయంలో జపాన్ ను ఓడించి విముక్తి కల్పించాయి. దీన్ని 'గ్యాంగ్ బోక్ జియోల్' (కాంతి పునరుద్ధరణ సమయం) అని కొరియా దేశాలు పిలుస్తాయి. కొరియా యుద్ధం తర్వాత ఈ రెండు దేశాలు విడిపోయాయి. ఈ రెండు దేశాల మధ్య 1950-53 వరకూ యుద్ధం జరిగింది. ఆ తర్వాత ఒకటిగా ఉన్న కొరియా రెండుగా చీలి ఉత్తర, దక్షిణ కొరియాలు ఆవిర్భవించాయి.

-లిచెన్ స్టెయిన్

యూరప్ లోని 'లిచెన్ స్టెయిన్' దేశం కూడా ఆగస్టు 15నే స్వాతంత్ర్యం పొందింది. ప్రపంచంలో అతి చిన్న దేశాల్లో ఆరో దేశంగా లిచెన్ స్టెయిన్ ఉంది. ఈరోజును 'స్టాట్స్ ఫీయర్ ట్యాగ్' అని పిలుస్తారు. ఈ తేదీని ప్రిన్స్ ఫ్రాంజ్ జోసెఫ్2 పుట్టినరోజును కూడా జరుపుకుంటారు.

-బహ్రెయిన్

మన లాగే బ్రిటీషర్ల వలసపాలనలో నక్కిన దేశం 'బహ్రెయిన్'. ఆ దేశంలోని జనాభాపై ఐక్యరాజ్యసమితి సర్వే తర్వాత ఆగస్టు 15న , 1971లో బహ్రెయిన్ స్వాతంత్ర్యం పొదింది. బ్రిటీషర్ల నుంచి స్వాతంత్య్రాన్ని పొందినప్పటికీ ఆ దేశం ఆగస్టు 15న స్వాతంత్య్రాన్ని జరుపుకోదు. బహ్రెయిన్ దివంగత పాలకుడు ఇసా బిన్ సల్మాన్ అల్ ఖలీప్ సింహాసనాన్ని అధిరోహించిన రోజు అయిన డిసెంబర్ 16న జాతీయ దినోత్సవంగా జరుపుకుంటుంది.

-కాంగో

ఇక ఆఫ్రికన్ దేశం కాంగో కూడా ఫ్రాన్స్ నుంచి 1960 ఆగస్టు 15న స్వాతంత్ర్యం పొందింది. ఈ ఆఫ్రికన్ దేశం చాలా ఏళ్లు ప్రాన్స్ కబంధ హస్తాల్లో మగ్గిపోయింది.

ఈ ఆగస్టు 15న మనతోపాటు ఈ ఐదుదేశాలు కూడా స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకోబోతున్నాయి. అన్ని కూలా వలస పాలనలోనే మగ్గినవి కావడం గమనార్హం.