Begin typing your search above and press return to search.

వాట్సాప్ లో ఆర్టీసీ జేఏసీ నేతలపై ఆడియోక్లిప్పులతో ఫైర్

By:  Tupaki Desk   |   21 Nov 2019 7:29 AM GMT
వాట్సాప్ లో ఆర్టీసీ జేఏసీ నేతలపై ఆడియోక్లిప్పులతో ఫైర్
X
ఉద్యమ నేతలకు ఎప్పుడూ ఒక పెద్ద ఇబ్బంది ఉంటుంది. ఉద్యమాన్ని నిర్మించటం.. దాన్ని అమలు చేయటం వరకూ ఓకే. ఒకసారి ఆట మొదలయ్యాక దానికి ఫుల్ స్టాప్ పెట్టటం సాధ్యం కాదు. పులి స్వారీ షురూ అయ్యాక మధ్యలో దిగుతానంటే కుదరదు. పులి స్వారీ ఎంత కష్టమైనదో తెలంగాణ ఉద్యమాన్ని నిర్మించిన కేసీఆర్ లాంటి అధినేతకు బాగా తెలుసు.

సుదీర్ఘకాలం ఉద్యమ పులిపై స్వారీ చేసి విజయవంతంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ఆయనకు.. పులి స్వారీని అడ్డుకోవటం ఎలానో బాగా తెలుసు. ఉద్యమాన్ని స్టార్ట్ చేయటం పెద్ద విషయం కాదు. కానీ.. దాన్ని విజయవంతంగా పూర్తి చేయటం వెనుక ఉండే సవాళ్లు అన్ని ఇన్ని కావు. అందుకే.. ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెకు ఎలాంటి సమ్మెట దెబ్బ కొట్టొచ్చన్న విషయాన్ని కేసీఆర్ చేతల్లో చేసి చూపించారని చెప్పాలి.

సమ్మె డిమాండ్లపై మొదట్నించి ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ఆయన.. ఏడు వారాలకు దగ్గరకు వచ్చినా.. సమ్మె విషయంలో పెదవి విప్పకుండా ఉండటం ద్వారా జేఏసీ నేతల్ని ఉక్కిరిబిక్కిరి చేయటంలో విజయం సాధించారు. .ఇదంతా ఒక ఎత్తు అయితే.. సమ్మెపై సర్కారు స్పందించకుండా ఉండటం.. కోర్టులు చేతులెత్తేయటం.. రాజకీయ పార్టీలు సైతం కేసీఆర్ డిపెన్స్ లో పడేసేలా వ్యవహరించటంలో ఫెయిల్ కావటంతో ఆర్టీసీ జేఏసీకి సమ్మెకు పుల్ స్టాప్ పెట్టక తప్పని పరిస్థితి.

సమ్మె చేస్తే ఏదో జరుగుతుందన్న ఆశతో తమ నేతలు చెప్పిన మాటలకు ఓకే చేసి.. వారి బాటలో నడిచిన ఆర్టీసీ ఉద్యోగులు. .ఈ రోజున సమ్మె విరమణ విషయంలో తగ్గుతున్న వైనంపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావటంతో ఫెయిల్ అయిన వేదన ఒకటి.. సమ్మెను విరమిస్తూ ప్రకటన చేయటంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పలువురు కార్మికులు.. తమ వేదనను ఆడియోక్లిప్పుల రూపంలో వైరల్ చేస్తున్నారు.

జేఏసీ నేతలపై తిట్ల వర్షం కురిపిస్తున్న ఆడియోలు అంతకంతకూ పెరుగుతున్నాయి. వైరల్ గా మారిన ఈ ఆడియోల ధాటికి జేఏసీ నేతలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మూడు నెలలుగా జీతాల్లేకుండా బండి నడిపించటం ఆర్టీసీ ఉద్యోగులకు కష్టంగా మారటం.. కనుచూపు మేర కేసీఆర్ సర్కారు కిందకు దిగే అవకాశం లేకపోవటంతో తప్పనిసరి పరిస్థితుల్లోనే తాము సమ్మెను విరమిస్తున్నట్లు జేఏసీ నేతలు చెబుతున్న వ్యాఖ్యల్ని ఎవరూ నమ్మని పరిస్థితి ఏర్పడినట్లుగా చెప్పక తప్పదు.