Begin typing your search above and press return to search.

ఇంతకీ అటార్నీ జనరల్‌ పవర్స్‌ ఏంటి?

By:  Tupaki Desk   |   23 Jun 2015 11:30 AM GMT
ఇంతకీ అటార్నీ జనరల్‌ పవర్స్‌ ఏంటి?
X
విభజన చట్టంలోని సెక్షన్‌ 8ని హైదరాబాద్‌లో అమలు చేయాలని ఏపీ అధికారపక్షం డిమాండ్‌ చేస్తుంటే.. సవాలే లేదు.. సెక్షన్‌ 8 ఎట్లా అమలు చేస్తారంటూ తెలంగాణ రాష్ట్ర సర్కారు వాదించటం తెలిసిందే.

ఇదే సమయంలో ఈ అంశంపై తానేం చేయాలన్న విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళితే.. వారు.. అటార్నీ జనరల్‌ను ఈ విషయం మీద ఏం చేయాలో చెప్పాలని కోరటం.. దానికి ఆయన స్పందించి గవర్నర్‌ నరసింహన్‌కు మౌఖికంగా కొన్ని సలహాలు ఇచ్చినట్లుగా వార్తలు వచ్చాయి. సెక్షన్‌ 8ని హైదరాబాద్‌లో అమలు చేయాలని.. ఓటుకు నోటు కేసును గవర్నర్‌ డీల్‌ చేయాలని చెప్పటంతో పాటు.. హైదరాబాద్‌లో తెలంగాణ పోలీసులకు ఎంత అధికారం ఉంటుందో.. అంతే అధికారం ఏపీ పోలీస్‌కు కూడా ఉంటుందని చెప్పినట్లుగా వార్తలు వచ్చాయి.

ఈ వార్తల్లో విషయం లేకపోతే తెలంగాణ అధికారపక్షం స్పందించేది కాదు. కానీ.. అందుకు భిన్నంగా తెలంగాణ అధికారపక్షం ఈ వ్యవహారం మీద అగ్గి మీద గుగ్గిలం అయిపోతోంది. సెక్షన్‌ 8ని ఎలా అమలు చేస్తారని ప్రశ్నిస్తోంది. ఇదిలా ఉంటే.. రాష్ట్రాల మధ్య పంచాయితీ విషయంలో సలహా ఇచ్చిన అటార్నీ జనరల్‌ అధికారాలేంటి? ఆయన పరిధి ఏమిటి? ఆయనేం చేస్తారన్న అంశంపై ఇప్పుడు అందరి దృష్టి పడింది. ఈ నేపథ్యంలో అటార్నీ జనరల్‌ పవర్స్‌ చూస్తే..

= అటార్నీ జనరల్‌ భారత ప్రభుత్వానికి న్యాయపరమైన సలహాలు ఇస్తారు.

= దేశంలోని అన్ని కోర్టుల్లో విచారణలను వినే హక్కు ఆయన సొంతం.

= భారతప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టులో అన్ని కేసులకు హాజరు కావొచ్చు.

= న్యాయశాఖ సలహాతో అత్యంత ప్రాధాన్యమున్న అంశాల్లో న్యాయపరమైన అంశాలకు ఆయన్ని సలహా కోరవచ్చు.

= పార్లమెంటు ప్రోసీడింగ్స్‌లో ఆయన పాల్గనచ్చు. కానీ.. ఓటుహక్కు ఉండదు.

= అటార్నీ జనరల్‌ చూసే అంశాలన్నీ న్యాయ మంత్రిత్వ శాఖే చూసుకుంటుంది.

= భారతప్రభుత్వానికి వ్యతిరేకంగా అటార్నీ జనరల్‌ హాజరు కాలేరు.

= క్రిమినల్‌ ప్రోసీడింగ్స్‌లో నిందితుల తరఫున వాదించరాదు.

= అటార్నీ జనరల్‌కు సొలిసిటర్‌ జనరల్‌.. మరో నలుగురు అదనపు సొలిసిటర్‌ జనరల్స్‌ సాయంగా ఉంటారు.

= ఏ కంపెనీలో అయినా డైరెక్టర్‌ పదవిని ఆయన చేపట్టాలంటే భారత ప్రభుత్వ అనుమతి తప్పనిసరి.