Begin typing your search above and press return to search.

లేటెస్ట్: తమిళనాడులో రెండు కీలక పరిణామాలు

By:  Tupaki Desk   |   13 Feb 2017 3:57 PM GMT
లేటెస్ట్: తమిళనాడులో రెండు కీలక పరిణామాలు
X
వారం రోజులుగా సాగుతున్న అన్నాఢీఎంకే అంతర్గత సంక్షోభానికి సంబంధించి రెండు కీలక పరిణామాలు తాజాగా చోటు చేసుకున్నాయి. రేపు ఉదయం 10.30 గంటలకు ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శశికళ భవితవ్యాన్ని తేల్చే తీర్పును సుప్రీంకోర్టు ఇవ్వనున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. తమిళనాడులో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో భారత అటార్నీ జనరల్ తాజాగా తమిళనాడు ఇన్ చార్జ్ గవర్నర్ విద్యాసాగర్ రావుకు కీలక సలహా ఇచ్చినట్లుగా తెలుస్తోంది.

త్వరలో తమిళనాడు అసెంబ్లీని ఏర్పాటు చేసి.. సభలో ఎవరికి మెజార్టీ ఉందన్న విషయాన్ని తేల్చి.. ఆ తర్వాత ప్రభుత్వ ఏర్పాటు నిర్ణయం తీసుకోవాలని సూచించినట్లు తెలుస్తోంది. అసెంబ్లీ వేదికగా బలపరీక్ష నిర్వహిస్తే.. పారదర్శకంగా.. ప్రజాస్వామ్యంగా నిర్ణయం తీసుకోవటానికి వీలు కావటంతోపాటు.. బలపరీక్షలో ఎవరు విజేత అన్నది తేలిపోతుందని చెప్పినట్లుగా సమాచారం. అటార్నీ జనరల్ ఇచ్చిన సూచనపై గవర్నర్ ఎలా రియాక్ట్ అవుతారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

మరోవైపు.. పన్నీర్ సెల్వం వర్గానికి తమిళనాడు విపక్షమైన డీఎంకే మద్దతు ఉంటుందన్న వాదనల్లోఏ మాత్రం నిజం లేదన్న విషయాన్ని తేల్చేశారు ఆ పార్టీ నేత స్టాలిన్. పన్నీర్ వర్గానికి డీఎంకే మద్దతు ఉంటుందనటంలో ఏ మాత్రం వాస్తవం లేదన్న మాటను ఆయన తేల్చేశారు. తాజాగా డీఎంకే ప్రధాన కార్యాలయంలో స్టాలిన్ తో సహా పలువురు నేతలుహాజరై.. భవిష్యత్ ప్రణాళికపై చర్చలు జరిపారు.

అనంతరం స్టాలిన్ మీడియాతో మాట్లాడుతూ.. అన్నాడీఎంకే తమకు ప్రధాన ప్రతిపక్షమని.. ఆ పార్టీ చీలిక వర్గానికి తమ మద్దతు ఎట్టి పరిస్థితుల్లో ఉండదని తేల్చేశారు. బలపరీక్ష సమయంలో తమ పార్టీ నిర్ణయాన్ని వెల్లడిస్తామంటూ కాస్తంత ఉత్సుకత మిగిలే మాటను చెప్పుకొచ్చారు. అదే సమయంలో ఆస్తులకు మించిన కేసులో శశికళ భవితవ్యం ఎలా ఉంటుందన్న విషయంపై స్పందించేందుకు ఆయన నిరాకరించటం గమనార్హం. కోర్టు తీర్పు వచ్చిన తర్వాతే తాము స్పందిస్తామని చెప్పిన ఆయన.. రాష్ట్రంలో పాలన స్తంభించిపోయిందన్న ఆందోళన వ్యక్తం చేశారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/