Begin typing your search above and press return to search.

టీఆర్ ఎస్ పార్టీ ఆఫీస్ పై దాడి.. ధ్వంసం.. ఎక్క‌డంటే?

By:  Tupaki Desk   |   26 Jan 2019 5:53 AM GMT
టీఆర్ ఎస్ పార్టీ ఆఫీస్ పై దాడి.. ధ్వంసం.. ఎక్క‌డంటే?
X
ఎవ‌రు అవున‌న్నా కాద‌న్నా.. తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ ఎస్ కు తిరుగులేని ప‌రిస్థితి. ఆ పార్టీ అధినేత మొద‌లుకొని.. ఆ పార్టీ నేత‌ల హ‌వా రాష్ట్రంలో ఎంత‌లా సాగుతుందో ప్ర‌త్యేకించి చెప్పాల్సిన అవ‌స‌ర‌మే లేదు. గులాబీ అధినేత‌.. ఆయ‌న వార‌సుడి న‌జ‌ర్ కోసం సామాన్యులే కాదు.. ప్ర‌ముఖులు సైతం ఎంత‌గా త‌హ‌త‌హ‌లాడుతున్నారో ఇటీవ‌ల కాలంలో చోటు చేసుకున్న ప‌రిణామాలు చెప్ప‌క‌నే చెప్పేస్తున్నాయి.

ఇక‌.. గులాబీ బాస్ చెప్పిందే వేదం అన్న‌ట్లుగా భావించే వారికి కొద‌వ లేదు. ప‌లు వ్య‌వ‌స్థ‌లు సైతం ఆయ‌న‌కు సాగిల‌ప‌డిపోతున్న ప‌రిస్థితి. ఒక‌వేళ‌.. త‌మ మాట విన‌ని వారి విష‌యంలో.. తెలంగాణ సెంటిమెంట్ అస్త్రాన్ని బ‌య‌ట‌కు తీసి.. తెలంగాణ ఎడిష‌న్లో ఏపీ వార్త‌లు ఎందుకంటూ.. ఎవ‌రేం రాయాలో.. ఎవ‌రేం చేయాలో కూడా డిసైడ్ చేసే వ‌ర‌కూ వెళుతున్న ప‌రిస్థితి. ఇలాంటివేళ‌.. అధికార పార్టీకి చెందిన ఆఫీస్ పై దాడి చేయ‌టం.. ఫ‌ర్నీచ‌ర్ ధ్వంసం చేయ‌టం లాంటివి జ‌రుగుతాయ‌ని క‌ల‌లో కూడా ఊహించ‌లేం.

కానీ.. అలాంటి ప‌రిణామం ఒక‌టి ఇల్లెందు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గంలో చోటు చేసుకుంది. పంచాయితీ ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా ఇల్లెందు ఎమ్మెల్యే బాణోతు హ‌రిప్రియ‌.. కాంగ్రెస్ అభ్య‌ర్థి గెలుపు కోసం ప్ర‌చారం చేస్తున్నారు. ఆమెను కోయ‌గూడెంలో టీఆర్ ఎస్ నేత‌లు అడ్డుకున్నారు. దీంతో ఆగ్ర‌హించిన కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌లు.. నేత‌లు టేకుల ప‌ల్లి టీఆర్ ఎస్ పార్టీ కార్యాల‌యంపై దాడి చేశారు. అంతేకాదు.. టేకుల‌ప‌ల్లి టీఆర్ ఎస్ అభ్య‌ర్థి బోడ స‌రిత‌కు చెంది ప్ర‌చార ర‌థం అద్దాల‌ను ప‌గ‌ల‌గొట్టారు. ఈ ఉదంతం గురించి స‌మాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి.. ద‌ర్యాప్తు చేస్తున్నారు.