Begin typing your search above and press return to search.

సిద్దిపేటకు దుబ్బాక టెన్షన్.. గులాబీ ఎమ్మెల్యే క్రాంతిపై దాడి

By:  Tupaki Desk   |   3 Nov 2020 5:15 AM GMT
సిద్దిపేటకు దుబ్బాక టెన్షన్.. గులాబీ ఎమ్మెల్యే క్రాంతిపై దాడి
X
హైటెన్షన్ నెలకొన్న దుబ్బాక ఉప ఎన్నికల వేడి..సమీపాన ఉన్న సిద్ధిపేటకు తాకింది. సోమవారం రాత్రి చోటు చేసుకున్న అనూహ్య పరిణామాలతో ఊహించని రీతిలో టీఆర్ఎస్.. బీజేపీ కార్యకర్తల మధ్య ఫైటింగ్ జరిగింది. సిద్ధిపేటలోని స్వర్ణ ప్యాలెస్ దగ్గర రెండు పార్టీలకు చెందిన కార్యకర్తలు దాడులు చేయటంతో పలువురికి గాయాలయ్యాయి. ఈ ఉదంతంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ కు గాయాలయ్యాయి. తనపై దాడి జరిగినట్లుగా ఆయన ఆరోపించారు. దీంతో.. పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది.

ఈ ఉదంతంపై రెండు పార్టీలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. దుబ్బాక లో డబ్బుల పంపిణి చేసేందుకు టీఆర్ఎస్ కు చెందిన పలువురు నేతలు సిద్ధిపేటలోని స్వర్ణ ప్యాలెస్ లో మకాం వేసినట్లుగా బీజేపీ ఆరోపిస్తోంది. గులాబీ నేతల లోగుట్టును బయటపెట్టేందుకు బీజేపీ కార్యకర్తలు పలువురు హోటల్ కు రావటంతో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. తన రూంలో డబ్బులు ఉన్నాయని ఆరోపిస్తూ.. వెతికేందుకు అక్రమ పద్దతిలో ప్రయత్నించారని.. తాను వారిని తన రూంలో వెతుక్కోవచ్చని చెప్పినా దాడికి పాల్పడినట్లుగా ఎమ్మెల్యే క్రాంతి ఆరోపిస్తున్నారు.

ఈ ఉదంతంపై బీజేపీ నేతల వెర్షన్ వేరుగా ఉంది. డబ్బుల పంపిణీ పెద్ద ఎత్తున జరుగుతుందని.. స్వర్ణ ప్యాలెస్ లోనూ ఇదంతా జరుగుతుందన్న సమాచారంతో తాము వెళితే.. తమపై దాడికి పాల్పడినట్లుగా బీజేపీ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. ఇరు పార్టీల మధ్య చోటు చేసుకున్న ఘర్షణల్లో రెండు పార్టీలకు చెందిన పలువురికి గాయాలు అయినట్లుగా తెలుస్తోంది. ఎమ్మెల్యే క్రాంతి మీద దాడి జరగటం.. రక్తం నేల మీద పడిన తీరు టీవీల్లో పెద్ద ఎత్తున ప్రసారమైంది. దీంతో.. ఎన్నికల టెన్షన్ పీక్స్ కు చేరినట్లు చెబుతున్నారు.

సంచలన కోసమే బీజేపీ కార్యకర్తలు ఇలాంటి పని చేసినట్లుగా టీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఈ ఘటనపై మంత్రి హరీశ్ రావు స్పందించారు. దళిత ఎమ్మెల్యేపై దాడి చేయటాన్ని తప్పు పట్టారు. టీఆర్ఎస్ నేతలకు వస్తున్న అపూర్వ ఆదరణ చూసి తట్టుకోలేని బీజేపీ కార్యకర్తలు పని కట్టుకొని వచ్చి దాడికి పాల్పడినట్లుగా చెప్పారు. పథకం ప్రకారం కావాలనే ఇదంతా చేసినట్లు ఆరోపించారు. దాడి జరగటానికి 15 నిమిషాల ముందే.. పోలీసులు వచ్చి చెక్ చేసి వెళ్లారని.. తనిఖీల సందర్భంగా ఎలాంటి ప్రచార సామాగ్రి లేదని అధికారులు గుర్తించారన్నారు. అయినప్పటికీ బీజేపీ కార్యకర్తలు దాడి చేయటాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ఇదిలా ఉంటే.. తమ కార్యకర్తలపై గులాబీ పార్టీకి చెందిన వారే దాడి చేశారని.. తమను బద్నాం చేస్తున్నట్లుగా బీజేపీ నేతలు చెబుతున్నారు.