Begin typing your search above and press return to search.

మునుగోడులో హైటెన్షన్: రాజగోపాల్ రెడ్డిపై చెప్పుతో దాడి

By:  Tupaki Desk   |   24 Oct 2022 9:03 AM GMT
మునుగోడులో హైటెన్షన్: రాజగోపాల్ రెడ్డిపై చెప్పుతో దాడి
X
మొన్నటివరకూ మునుగోడులో పార్టీల మధ్య మాటల యుద్ధమే నడిచింది. ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేసుకోవడం మునుగోడులో మంట పుట్టిస్తోంది. పోలింగ్ కు సమయం దగ్గరపడుతుండడంతో భౌతిక దాడులకు పాల్పడుతుండడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడుతున్నాయి.

మునుగోడు ప్రచారంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రచారంలో దాడులు మొదలయ్యాయి. ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులపై దాడులతో ఘర్షణ వాతావరణం నెలకొంది. మొన్నటివరకు ఈ పార్టీల మధ్య పోరు మాటల యుద్ధానికి పరిమితం అవ్వగా.. ఇప్పుడు ఏకంగా భౌతిక దాడులకు దిగుతుండడం రచ్చకు దారితీస్తోంది.

ఆదివారం కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి కాన్వాయ్ పై బీజేపీ కార్యకర్తలు దాడికి పాల్పడిన ఘటన నియోజకవర్గంలో దుమారం రేగుతోన్న క్రమంలో తాజాగా బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డిపై కాంగ్రెస్ కార్యకర్త చెప్పుతో దాడికి యత్నించడంతో నియోజకవర్గంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.

ఆదివారం కాంగ్రెస్ అభ్యర్థి స్రవంతి కాన్వాయ్ ను అడ్డుకొని దాడులు చేయడంతో కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల మధ్య ఘర్షణ తలెత్తింది. కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క సహా పార్టీ నేతలు ఆందోళనకు దిగారు. జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు.

తాజాగా బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డిపై కాంగ్రెస్ కార్యకర్త చెప్పుతో దాడికి ప్రయత్నించడం కలకలం రేపుతోంది. ాయనప్రచారం నిర్వహిస్తుండగా.. ప్రచార వాహనంపైకి ఎక్కి చెప్పుతో కొట్టేందుకు ప్రయత్నించాడు. రాజగోపాల్ రెడ్డి వెంటనే గమనించి వెనక్కి తప్పుకోవడంతో కాంగ్రెస్ కార్యకర్త ప్రయత్నం ఫలించలేదు. బీజేపీ కార్యకర్తలు చెప్పుతో దాడికి ప్రయత్నించడంతో కాంగ్రెస్ కార్యకర్తను పక్కకు లాగి చితకబాదారు. ప్రచారంలో కాసేపు ఈ ఘటన ఘర్షణ వాతావరణానికి దారితీసింది. బీజేపీ, కాంగ్రెస్ శ్రేణులు పరస్పరం దాడులు చేసుకోవడంతో మునుగోడు నియోజకవర్గంలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది.

రాజగోపాల్ రెడ్డి ఇటీవల చౌటుప్పల్ మండలం జైకేసారంలో ప్రచారం సందర్భంగా ఓ వ్యక్తి ప్రచార వాహనంపైకి ఎక్కి మైక్ లాగేసుకున్నాడు. బీజేపీ నేతలు అతడిని పోలీసులకు అప్పగించారు. అంతుకుముందు జైకేసారంలోనూ రాజగోపాల్ రెడ్డిని కాంగ్రెస్, సీపీఎం నేతలు అడ్డుకున్నారు.గోబ్యాక్ అంటూ పంపించేశారు. మునుగోడు ప్రచారంలో తరచుగా ఇలాంటి ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.