Begin typing your search above and press return to search.

క‌న్నాపై హ‌త్యాయ‌త్నం?.. అనంత‌లో హైటెన్ష‌న్‌!

By:  Tupaki Desk   |   28 Jun 2018 10:40 AM GMT
క‌న్నాపై హ‌త్యాయ‌త్నం?.. అనంత‌లో హైటెన్ష‌న్‌!
X
ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌ప‌డుతున్న వేళ‌... ఏపీ రాజ‌కీయాల్లో మాట‌లు తూటాలై పేలుతున్నాయి. నిన్న‌టిదాకా మిత్రులుగా మెల‌గిన బీజేపీ - టీడీపీ మ‌ధ్య ఇప్పుడు ఆ మాట‌ల తూటాలు హ‌ద్దులు దాటేస్తున్నాయి. ఒక‌రిపై మ‌రొక‌రు తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు చేసుకుంటూ ఉండ‌టమే కాకుండా ప‌ర‌స్ప‌రం దాడులు చేసుకునే దాకా ప‌రిస్థితి వెళ్లిపోయిందంటే ప‌రిస్థితి ఎలా ఉందో ఇట్టే అర్థం కాక మాన‌దు. నాలుగేళ్ల పాటు మిత్ర‌ప‌క్షాలుగానే వ్య‌వ‌హ‌రించిన బీజేపీ - టీడీపీ... ఏపీకి కేంద్ర బ‌డ్జెట్ లో న్యాయం ద‌క్క‌క‌పోవ‌డంతో వైరి వ‌ర్గాలుగా మారిపోయాయి. అప్ప‌టిదాకా మిత్రులుగా మెలిగిన ఈ రెండు పార్టీల నేత‌లు... ఆ త‌ర్వాత బాహాబాహీకి కూడా దిగిపోతున్న వైనం ఇప్పుడు దాదాపుగా నిత్య‌కృత్యంగానే మారిపోయింది. మొన్న‌టికి మొన్న క‌ర్ణాట‌క అసెంబ్లీ ఫ‌లితాల్లో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవ‌త‌రించిన వైనాన్ని పుర‌స్క‌రించుకుని విజ‌య‌వాడ‌లో బీజేపీ నేత‌లు చేసుకున్న సంబ‌రాల్లో ఉద్రిక్త‌త చోటుచేసుకుంది. బీజేపీ సంబ‌రాల‌ను టీడీపీ నేత‌లు అడ్డుకునే య‌త్నం చేయ‌డం - బీజేపీ నేత‌లు తిర‌గ‌బ‌డ‌టం హైటెన్ష‌న్‌ కు దారి తీసింది. ఇక ఆ త‌ర్వాత బీజేపీ ప్ర‌ముఖులంతా క‌లిసి టీడీపీ వైఖ‌రిని నిర‌సిస్తూ విజ‌య‌వాడ‌లోనే దీక్ష‌కు దిగ‌గా... ఆ దీక్ష‌కు వ్య‌తిరేకంగా టీడీపీ కూడా ప్ర‌తి దీక్ష‌కు దిగింది. ఈ సంద‌ర్భంగానూ ఉద్రిక్త వాతావ‌ర‌ణం నెల‌కొంది.

ఇక ఈ రెండు ఘ‌ట‌న‌ల‌కు కాస్తంత ముందుగా తిరుమ‌ల వెంక‌న్న ద‌ర్శ‌నానికి వ‌చ్చిన బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్ షాపై టీడీపీ నేత‌లు దాడికి య‌త్నించ‌డం మ‌రింత‌గా టెన్ష‌న్‌ను నింపింది. ఈ దాడిలో షాకు ఏమీ కాకున్నా... ఆయ‌న ప్ర‌యాణిస్తున్న కాన్వాయ్‌ పై టీడీపీ నేత‌లు రాళ్లు విస‌ర‌డం - ఆ సంద‌ర్భంగా నెల‌కొన్న ఉద్రిక్త‌త‌ల‌ను కంట్రోల్ చేయ‌డం తిరుప‌తి పోలీసుల‌కు త‌ల‌కు మించిన భారంగానే ప‌రిగ‌ణించింద‌ని చెప్పాలి. ఎందుకంటే.. దాడి చేసిన వారు రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీకి చెందిన వారు కాగా... బాధిత నేత కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి ఏకంగా జాతీయ‌ అధ్యక్షుడు మ‌రి. ఎలాగోలా ఆ గోలంతా ముగిసిందిలే అనుకుంటున్న త‌రుణంలో తాజాగా... బీజేపీ ఏపీ చీఫ్ క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ‌పై టీడీపీ నేత‌లు దాడికి య‌త్నించార‌ట‌. అనంత‌పురంలో కాసేప‌టి క్రితం చోటుచేసుకున్న ఈ ప‌రిణామాలు రాష్ట్రంలో హైటెన్ష‌న్ వాతావర‌ణాన్ని సృష్టించాయ‌ని చెప్పాలి. క‌న్నాపై దాడి ఘ‌ట‌న‌కు సంబంధించిన వివ‌రాల్లోకెళితే... బీజేపీ ఏపీ రాష్ట్ర ప‌గ్గాల‌ను చేప‌ట్టిన త‌ర్వాత క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ జిల్లాల ప‌ర్య‌ట‌న‌ల‌కు బ‌య‌లుదేరారు. ఈ క్ర‌మంలో ఇప్ప‌టికే ప‌లు జిల్లాల్లో ప‌ర్య‌టించిన క‌న్నా... నేటి ఉద‌యం అనంత‌పురం జిల్లా ప‌ర్య‌ట‌న‌కు వెళ్లారు. ప‌ర్య‌ట‌న‌లో భాగంగా అనంత‌పురంలోని ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్‌ లో పార్టీ నేత‌ల‌తో మంత‌నాలు సాగించిన క‌న్నా... అక్క‌డే మీడియాలో మాట్లాడేందుకు సిద్ధ‌మ‌య్యారు. ప్రెస్ మీట్ కూడా దాదాపుగా ప్రారంభ‌మైపోయింది.

ఈ లోగా ఎక్క‌డి నుంచి వ‌చ్చారో తెలియ‌దు గానీ... అక్క‌డ టీడీపీకి చెందిన ప‌లువురు కార్య‌క‌ర్త‌లు ప్ర‌త్య‌క్ష‌మైపోయారు. అంతే... టీడీపీ - బీజేపీ కార్యక‌ర్త‌ల మ‌ధ్య మాట‌ల యుద్ధం - ఆ త‌ర్వాత బాహాబాహీ చోటుచేసుకుంది. దీంతో ఒక్క‌సారిగా అక్క‌డ ఉద్రిక్త వాతావ‌ర‌ణం చోటుచేసుకుంది. అయితే వెనువెంట‌నే స్పందించిన పోలీసు యంత్రాంగం ఇరువ‌ర్గాల‌ను చెద‌ర‌గొట్టేసి... క‌న్నా ప్రెస్ మీట్‌ కు మార్గం సుగ‌మం చేసింది. ఈ ఘ‌ట‌న‌తో షాక్ తిన్న క‌న్నా... టీడీపీపై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. జిల్లా ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చిన త‌న‌పై టీడీపీ నేత‌లు య‌త్నాయ‌త్నానికి పాల్ప‌డ్డార‌ని ఆరోపించారు. దాడి నుంచి త‌న‌ను కాపాడాల్సిన పోలీసు యంత్రాంగం అందుకు విరుద్ధంగా టీడీపీ కార్య‌క‌ర్త‌ల‌కు స‌హ‌కరిస్తున్నార‌ని కూడా ఆయ‌న ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. గ‌తంలో త‌మ పార్టీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్ షా తిరుప‌తికి వ‌స్తే... అక్క‌డి టీడీపీ నేత‌లు షాపై హ‌త్యాయ‌త్నం చేశార‌ని, ఇప్పుడు అనంత‌కు వ‌చ్చిన త‌న‌పై అదే పార్టీకి చెందిన నేత‌లు హ‌త్య చేసేందుకు య‌త్నించార‌ని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. మ‌రి ఈ దాడులు - ఆరోప‌ణ‌లు ఎంత‌దాకా వెళ‌తాయో చూడాలి.