Begin typing your search above and press return to search.

హైదరాబాద్ ఆసుపత్రుల ఆరాచకం.. ఒకే రోజు రెండు దారుణ ఘటనలు

By:  Tupaki Desk   |   2 Aug 2020 6:12 PM GMT
హైదరాబాద్ ఆసుపత్రుల ఆరాచకం.. ఒకే రోజు రెండు దారుణ ఘటనలు
X
ఒకేరోజు రెండు షాకింగ్ సంఘటనలు హైదరాబాద్ కార్పొరేట్.. ప్రైవేటు ఆసుపత్రుల్లో చోటు చేసుకున్నాయి. ఊహకు అందని రీతిలో దారుణాలకు పాల్పడిన ఈ రెండు వైనాలు వింటే.. ప్రైవేటు ఆసుపత్రులకు వెళితే ఏం జరుగుతుందో అన్న భయాందోళనలకు గురి కావటం ఖాయం. కరోనా వేళ.. కాసుల కక్కుర్తి అంతకంతకూ పెరుగుతున్న వేళ.. ప్రైవేటు.. కార్పొరేట్ ఆసుపత్రుల మీద పెద్ద ఎత్తున ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖామంత్రి ఈటెల రాజేందర్ స్వయంగా కరోనా వైద్యానికి రూ.పది వేలు కూడా కాదని ఓపక్క చెప్పిన రోజే.. డబ్బుల కోసం ఎంత దారుణంగా ప్రైవేటు ఆసుపత్రులు వ్యవహరిస్తాయా? అన్న భావన కలగక మానదు.

దారుణం 1

బంజారాహిల్స్ లోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో కరోనాతో చికిత్స పొందుతూ ఒక మహిళ మరణించారు. రెండురోజుల క్రితం సదరు ఆసుపత్రిలో చేరిన ఆమె.. కరోనా వైద్యం జరుగుతుండగానే ప్రాణాలు విడిచారు. అనంతరం కోవిడ్ నిబంధనల ప్రకారం ఆమె అంత్యక్రియల్ని మున్సిపల్ సిబ్బంది నిర్వహించాల్సి ఉంటుంది. అయితే.. మృతురాలి ఒంటి మీద ఉన్న బంగారు నగలతోపాటు వజ్రాల చెవికమ్మలు కూడా మాయమైనట్లుగా బంధువులు ఆరోపిస్తున్నారు.

ముక్కుపుడక కూడా మిస్ అయిన విషయాన్ని వారు గుర్తించారు. ఈ మేరకు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో.. రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు నిర్వహించారు. ముగ్గురు అనుమానితుల్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఒక ప్రైవేటు ఆసుపత్రిలో ఇలాంటి ఘటన చోటు చేసుకోవటంపై విస్మయం వ్యక్తమవుతోంది.

దారుణం 2

సోమాజిగూడ లోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చోటు చేసుకున్న ఉదంతం గురించి విన్నంతనే షాక్ తినటమే కాదు.. నోటి వెంట మాట రాని పరిస్థితి. కరోనా అనుమానిత లక్షణాలతో ఆసుపత్రికి వచ్చిన పేషెంట్ ను చేర్చుకున్న ఆసుపత్రి యాజమాన్యం.. అతనికి పరీక్షలు నిర్వహించారు. అయితే.. ఫలితం నెగిటివ్ వచ్చింది. కాసుల కక్కుర్తి కోసం ఆ విషయాన్ని ఆసుపత్రి వారు దాచి పెట్టారు.

వారి ఆరాచకం అక్కడితో ఆగలేదు. కాసుల కక్కుర్తితో పాజిటివ్ వచ్చిన రోగులతో కలిపి ఉంచి వైద్యం చేశారు. తనను డిశ్చార్జి చేయాలని కోరగా.. లక్షలాది రూపాయిల్ని చెల్లించిన తర్వాత మాత్రమే డిశ్చార్జి చేశారు. దీంతో.. విసుగు చెందిన బాధితుడు తన స్నేహితులు.. బంధువులకు జరిగిన దారుణం గురించి వారికి సమాచారం అందించి పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు ఇచ్చారు.