Begin typing your search above and press return to search.

గుంటూరు జిల్లాలో దారుణం.. భర్తను చంపేందుకు సుపారీ.. సైనైడ్ తో అటాక్

By:  Tupaki Desk   |   29 Nov 2020 11:00 AM IST
గుంటూరు జిల్లాలో దారుణం.. భర్తను చంపేందుకు సుపారీ.. సైనైడ్ తో అటాక్
X
కాలం మారింది. ఒకప్పుడు భార్యల్ని చంపే భర్తల గురించి తరచూ వినేటోళ్లం. ఇప్పుడు భర్తల్ని చంపే భార్యల ఉదంతాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఇంతకీ..ఆ భర్తలు చేసిన పాపం ఏమిటంటే.. భార్యల వివాహేతర సంబంధాలకు అడ్డుగా ఉండటమే. పెళ్లి చేసుకొని పిల్లలతో ఉండి.. పరాయి మగాడి వలపు వలలో చిక్కి.. కట్టుకున్న భర్తను అత్యంత కిరాతకంగా చంపేసే దుర్మార్గం ఈ మధ్య కాలంలో అంతకంతకూ ఎక్కువ అవుతోంది. తాజాగా అలాంటి ఉదంతమే.. గుంటూరు జిల్లాలో చోటు చేసుకుంది. సంచలనంగా మారిన ఈ ఉదంతంలో భర్తను లేపేసేందుకు ఒక భార్య వేసిన స్కెచ్ చూస్తే.. మరీ ఇంత దారుణమా? అన్న భావన కలుగక మానదు.

పెదకూరుపాడు మండలం 75 తాళ్లూరుకు చెందిన 42 ఏళ్ల బ్రహ్మయ్య.. ఆ ఊళ్లో హోటల్.. పాల వ్యాపారం చేసేవాడు. ఈ నెల నాలుగున గ్రామ శివారులో అతడు వెళుతుంటే.. గుర్తు తెలియని వారు అతడి ముఖంపై విషపూరితమైన రసాయనాలు చల్లి.. దాడి చేసే ప్రయత్నం చేశారు. వారి నుంచి తప్పించుకున్న బ్రహ్మయ్య దగ్గర్లోని బంధువుల ఇంటికి వెళ్లాడు. అప్పటికే అస్వస్థతో ఉన్న అతన్ని ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేయగా.. మార్గమధ్యంలోనే మరణించాడు. ఈ ఉదంతంపై అనుమానాస్పద మరణంగా పోలీసులు కేసు నమోదు చేసి విచారణ షురూ చేశారు.

అన్ని వివరాల్ని సేకరించే క్రమంలో.. ఆ గ్రామం సెల్ టవర్ లొకేషన్ నుంచి ఘటన జరిగిన రోజు రాత్రి పది గంటల వరకు వచ్చి ఫోన్ కాల్స్.. బయటకు వెళ్లిన ఫోన్ కాల్స్ ను విశ్లేషించారు. ఇందులో బ్రహ్మయ్య హత్యకు ముందు అతడి భార్య సాయి కుమారి ఫోన్ నుంచి అదే గ్రామానికి చెందిన అశోక్ రెడ్డి అనే యువకుడికి కాల్ వెళ్లినట్లు గుర్తించారు. అదే సమయంలో అశోక్ రెడ్డి ఫోన్ నుంచి క్రిష్ణాజిల్లా మచిలీపట్నానికి ఫోన్లు వెళ్లాయి.

దీంతో అనుమానం వచ్చిన పోలీసులు సాయి కుమారి.. అశోక్ రెడ్డిల మధ్య సంబంధం గురించి ఆరా తీయగా.. వారిద్దరి మధ్య వివాహేతర సంబంధం ఉన్నట్లు గుర్తించారు. దీంతో.. వారిని అదుపులోకి తీసుకొని విచారించగా.. దారుణ నిజం బయటకు వచ్చింది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్న భర్తను తొలగించేందుకు మచిలీపట్నానికి చెందిన ఇద్దరికి రూ.10లక్షలు సుపారీ ఆఫర్ ఇచ్చారు. ఒప్పందంలో భాగంగా కొంత మొత్తాన్ని అడ్వాన్స్ రూపంలో చెల్లించారు. హత్య చేసేందుకు రోల్ గోల్డ్ తయారీలో వాడే సైనైడ్ ను బిస్కెట్ లో కలిపి ఒక కుక్కపై ప్రయోగించి చూశారు.

అది నిమిషాల్లో మరణించటంతో.. బ్రహ్మయ్య ముఖం మీద కూడా ఆ రసాయనాన్ని చల్లారు. దీనికి ముందు వారు రెక్కీ నిర్వహించారు. వారు ప్లాన్ చేసినట్లే.. రసాయనంతో దాడి చేసిన కాసేపటికే బ్రహ్మయ్య మరణించాడు. డబ్బుకు ఆశపడి మచిలీపట్నం కుర్రాళ్లు ఈ దారుణానికి పాల్పడితే.. వివాహేతర సంబంధం మోజులో భర్తను చంపేసుకొని జైలుపాలైంది కుమారి. భర్తతో జీవితం చాలనుకుంటే.. విషయాన్ని చెప్పేసి ఎంచక్కా విడాకులు తీసుకోవచ్చు. లేదంటే.. ఉత్తరం ముక్క రాసేసి తనదారి తాను చూసుకోవచ్చు. అంతేకాదు.. అభంశుభం తెలీని భర్తను భార్య ఇంత భారీ ప్లాన్ చేసి చంపటమేమిటో?