Begin typing your search above and press return to search.

ఆత్మ‌కూరు ఉప ఎన్నిక వైఎస్సార్సీపీలో ఆందోళ‌న పెంచుతోందా?

By:  Tupaki Desk   |   20 Jun 2022 5:30 PM GMT
ఆత్మ‌కూరు ఉప ఎన్నిక వైఎస్సార్సీపీలో ఆందోళ‌న పెంచుతోందా?
X
ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గానికి జరిగే ఉప ఎన్నిక వైఎస్సార్సీపీలో ఆందోళ‌న పెంచుతోందా అంటే అవున‌నే అంటున్నారు.. రాజ‌కీయ విశ్లేష‌కులు. దివంగ‌త ఐటీ, ప‌రిశ్ర‌మ‌లు, నైపుణ్యాభివృద్ధి శాఖ మంత్రి మేక‌పాటి గౌత‌మ్ రెడ్డి మృతితో ఆత్మ‌కూరులో ఉప ఎన్నిక జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. అధికార వైఎస్సార్సీపీ త‌ర‌ఫున మేక‌పాటి గౌత‌మ్ రెడ్డి సోద‌రుడు మేక‌పాటి విక్ర‌మ్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఈ ఎన్నిక‌కు టీడీపీ, జ‌న‌సేన పార్టీలు త‌మ అభ్య‌ర్థుల‌ను నిల‌ప‌లేదు. బీజేపీ మాత్రం పోటీలో ఉంది. ఆ పార్టీ త‌ర‌ఫున భ‌ర‌త్ కుమార్ యాదవ్ పోటీ చేస్తున్నారు.

ఈ నేప‌థ్యంలో అధికార వైఎస్సార్సీపీ ల‌క్ష‌కు పైగా మెజారిటీ సాధించాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం గ్రామానికో ఎమ్మెల్యే, మండ‌లానికో మంత్రిని రంగంలోకి దించింది. ఇక చోటామోటా నేత‌లు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, కార్పొరేష‌న్ల చైర్మ‌న్లు, మార్కెట్ క‌మిటీల చైర్మ‌న్ల‌క‌యితే లెక్క‌లేదు. ఇంత‌మందిని వైఎస్సార్సీపీ దించ‌డం వెనుక ఆ పార్టీకి ఉన్న భ‌య‌మే కార‌ణ‌మంటున్నారు.

ఆత్మ‌కూరులో ఏమాత్రం మెజారిటీ త‌గ్గినా ప్ర‌తిప‌క్షాలు జ‌గ‌న్ ప్ర‌భుత్వాన్ని ల‌క్ష్యంగా చేసుకోవ‌డం ఖాయం. అంతేకాకుండా ప్ర‌భుత్వ వ్య‌తిరేక‌త పెరుగుతోంద‌ని సంకేతం చేరిన‌ట్టే అవుతుంద‌ని అంటున్నారు.

ఇక ఇప్ప‌ట్లో రాష్ట్రంలో జ‌ర‌గ‌బోయే ఎన్నిక‌లు కూడా లేవు. పంచాయ‌తీల నుంచి మండ‌ల ప‌రిష‌త్ లు, జిల్లా ప‌రిష‌త్ లు, మున్సిపాలిటీలు, కార్పొరేష‌న్లు ఇలా అన్నిటికీ ఎన్నిక‌లు ముగిశాయి. ఈ నేప‌థ్యంలో ఆత్మ‌కూరులో ఘ‌న‌విజ‌యం సాధిస్తే ప్ర‌జ‌ల మ‌ద్ద‌తు త‌మ‌కే ఉంద‌ని చెప్పుకునే అవ‌కాశం వైఎస్సార్సీపీకి ఉంటుంద‌ని విశ్లేష‌కులు అంటున్నారు.

ఈ నేప‌థ్యంలోనే ల‌క్ష‌కు పైగా మెజారిటీ సాధించి త‌మ స‌త్తా చాటాల‌ని వైఎస్సార్సీపీ ఉవ్విళ్లూరుతుంద‌ని చెబుతున్నారు. ఇందులో భాగంగానే గ్రామానికో ఎమ్మెల్యే, మండ‌లానికో మంత్రిని ఆత్మ‌కూరు నియోజ‌క‌వ‌ర్గంలో దింపింద‌ని అంటున్నారు. ఎమ్మెల్యేల‌కు, మంత్రుల‌కు బాధ్య‌త‌లు అప్ప‌గించి.. వారికి ల‌క్ష‌కు పైగా మెజారిటీ సాధించాల‌ని ల‌క్ష్యాన్ని నిర్దేశించిన‌ట్టు స‌మాచారం. దీంతో వారు ఈ చిన్న అవ‌కాశాన్ని వ‌ద‌ల‌కుండా ఓట‌ర్ల‌పై సామ‌దాన‌బేధ దండోపాయాలు ప్ర‌యోగిస్తున్న‌ట్టు చెప్పుకుంటున్నారు.

జూన్ 23న ఆత్మ‌కూరులో ఉప ఎన్నికకు పోలింగ్ జ‌రుగుతుంది. గతం నుంచి నెల్లూరు జిల్లా వైఎస్సార్‌సీపీకి కంచుకోటగా ఉంది. గత ఎన్నికల్లో జిల్లాలోని మొత్తం 10 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించింది. అంతేకాకుండా నెల్లూరు లోక్ స‌భ స్థానాన్ని కూడా వైఎస్సార్సీపీ గెలుచుకుంది. మ‌రోవైపు వైఎస్సార్‌సీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్‌రెడ్డికి గట్టిపోటీ ఇచ్చేందుకు బీజేపీ అభ్యర్థి భరత్‌కుమార్‌ యాదవ్‌ ప్రచారాన్ని ముమ్మరం చేశారు. అధికార వైఎస్సార్‌సీకి ఉపఎన్నికల్లో గెలవడం అంత కష్టం కానప్పటికీ, తన బలాన్ని చాటుకునేందుకు లక్ష ఓట్ల తేడాతో విజయకేతనం ఎగురవేయాల‌ని చూస్తోంది.