Begin typing your search above and press return to search.

కొత్త నోట్ల కామెడీ ఏంది మోడీ..?

By:  Tupaki Desk   |   28 Feb 2017 9:06 AM GMT
కొత్త నోట్ల కామెడీ ఏంది మోడీ..?
X
కొత్త నోట్లు వ్యవహారం కామెడీగా మారుతోంది. ఒక్క తప్పు దొర్లటానికి వీల్లేని విధంగా ఉండాల్సిన కరెన్సీ నోట్లు.. ఇప్పుడు జనాలకు కొత్త కష్టాలు తీసుకొస్తూ కంగారు పెడుతోంది. పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో తీసుకొచ్చిన కొత్త రూ.2వేలు.. రూ.500 నోట్లు జనాలకు షాకుల మీద షాకులు ఇస్తున్నాయి. కొన్ని నోట్లు ఒక వైపు మాత్రమే ప్రింట్ అయి బయటకు వస్తే.. మరికొన్ని నోట్ల మీద బొమ్మలు లేకుండా వస్తున్న వైనం బయటకు వచ్చి కలకలం రేపాయి.

కొత్త నోట్లును అమల్లోకి తీసుకొచ్చిన తర్వాత ఏటీఎంలలో ఎప్పుడు ఎలాంటి నోట్లు వస్తాయన్న కంగారు ఈ మధ్యన పెరిగిపోతోంది. ఏటీఎంలతో వచ్చే ఇబ్బందేమిటంటే.. ఏదైనా తేడా నోటు వస్తే.. దానికి సమాధానం చెప్పే వారు ఉండరు. సంబంధిత బ్యాంకు వద్దకు వెళితే సానుకూలంగా స్పందించేది తక్కువనే చెప్పాలి. ఈ మధ్యన ఏటీఎం నుంచి డబ్బులు డ్రా చేస్తే.. చిల్డ్రన్స్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేరుతో నోట్లు వచ్చి షాకిచ్చింది. ఈ మధ్యన దొంగ నోట్లు కూడా వస్తున్న ఫిర్యాదులు తరుచూ వినిపిస్తున్నాయి.

ఇదిలా ఉంటే.. తాజాగా నోట్ల మీద సీరియల్ నెంబర్లు ముద్రించని నోట్లు రావటం కలకలంగా మారింది. మధ్యప్రదేశ్ లో చోటు చేసుకున్న ఈ ఘటనను చూస్తే.. దామోహ్ లోని నారాయణ్ ఐర్వాల్ అనే స్కూల్ టీచరు ఏటీఎంలోకి వెళ్లి డ్రా చేస్తే.. సీరియల్ నెంబరు లేని నోటు రావటంతో అవాక్కు అయ్యారు. ఈ ఉదంతాన్ని స్థానిక మీడియా దృష్టికి తీసుకొచ్చిన ఆయన మాటలతో.. మరికొందరు అదే ఏటీఎం నుంచి విత్ డ్రా చేయగా.. సీరియల్ నెంబర్లు లేని నోట్లు రావటంతో ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో.. ఏటీఎంను మూసేశారు.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. సీరియల్ నెంబర్లులేని నోట్లు వచ్చిన వైనాన్నిఏటీఎంకు చెందిన బ్యాంకుకు తీసుకెళితే తమకు సంబంధం లేదని చెప్పటంపై బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు గతంలో పెద్దగా ఉండేవి కావు. మోడీ సర్కారు నేతృత్వంలో తీసుకొచ్చిన కొత్త నోట్లతోనే ఈ తరహా సమస్యలు తెర మీదకు వస్తున్నాయి. నోట్ల కష్టాల మీద పెదవి విప్పటానికి పెద్దగా ఇష్టపడని ప్రధాని.. నోట్ల విషయంలో వస్తున్న అచ్చు తప్పుల మీదన్న దృష్టి పెడితే బాగుండు. మరీ.. ఇంత బాధ్యతారాహిత్యంతో నోట్ల ముద్రణ జరగటం ఏమిటన్న ప్రశ్నకు ఆయన సమాధానం చెబుతారా?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/