Begin typing your search above and press return to search.

ఉత్కంఠ రేపి చివరకు రాజీనామా చేయని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే

By:  Tupaki Desk   |   6 March 2020 8:43 AM GMT
ఉత్కంఠ రేపి చివరకు రాజీనామా చేయని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే
X
కర్నూలు జిల్లా అధికార పార్టీలో విబేధాలు తారస్థాయికి వెళ్లాయి. ఇన్ చార్జి మంత్రి అనిల్ కుమార్ నే అడ్డుకున్న పరిణామాలు రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారాయి. ఆ పరిస్థితుల్లోనే నందికొట్కూరు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆర్థర్ పార్టీలో విబేధాలు ఉన్నాయని, వెంటనే పరిష్కరించాలని.. లేకపోతే రాజీనామా చేస్తానని బహిరంగంగా ప్రకటించాడు. యువ నాయకుడు బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డితో ఉన్న విబేధాలతో ఆయన అహసనం వ్యక్తం చేస్తున్నారు. తనకు పార్టీలో, ప్రభుత్వంలో ప్రాధాన్యం లేదని భావించి ఇన్నాళ్లు పార్టీపై, సీఎం జగన్ వైఖరిపై గుర్రుగా ఉన్న ఆయన అధిష్టానం స్పందించకుంటే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని సంచలన ప్రకటన చేశాడు.

దీనిపై శుక్రవారం విలేకరుల సమావేశం నిర్వహించి ఏ నిర్ణయమనేది చెబుతా అని తెలిపారు. ఆ మేరకు గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజీనామా ప్రస్తావన లేకుండానే సమావేశం కొనసాగించాడు. ఈ నేపథ్యంలో కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డితో కలిసి పని చేయడానికి తనకు ఎటువంటి అభ్యంతరం లేదు. బైరెడ్డిని తానెప్పుడూ విమర్శించలేదని కుండబద్ధలు కొట్టారు. ఈ మేరకు విలేకరుల సమావేశంలో ఆయన మాటలు ఇలా ఉన్నాయి.

‘‘మార్కెట్ కమిటీ పదవులు మాకు రానందుకు బాధ లేదు. పదవులు వచ్చిన వారికి కంగ్రాట్స్. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్ణయాలే శిరోధార్యం. నందికొట్కూరు నియోజకవర్గంలో అవినీతి లేకుండా అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. నా అనుచరులకు మార్కెట్ కమిటీ పదవులు రాలేదని బాధగా ఉంది. మనస్తాపానికి గురైన మాట వాస్తవమే. పదవులు అనేది కొందరికే అందరికీ రావని కార్యకర్తలకు వివరించా. స్థానిక సంస్థల ఎన్నికల్లో నియోజకవర్గంలోని అన్ని స్ధానాల్లో గెలుపొంది సీఎం జగన్ కు కానుకగా ఇస్తాం. 2014లో నందికొట్కూరు టికెట్ ఇస్తానని జగన్ ఇవ్వలేదు. అయినా నేను బాధపడలేదు. 2019 ఎన్నికల్లో పిలిచి టికెట్ ఇచ్చారు. మంత్రి అనిల్ కుమార్ యాదవ్‌ను జిల్లాలో అడుగు పెట్టనీయమని నా అనుచరులు అనలేదు. బయటి వ్యక్తులు అన్నారు. నందికొట్కూరు మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రమాణ స్వీకారం ఆహ్వానం అందలేదు. నందికొట్కూరు మార్కెట్ కమిటీ గౌరవాధ్యక్షుడిని. చైర్మన్ ప్రమాణ స్వీకారం గురించి సమాచారం ఇవ్వని అధికారులపై మంత్రికి ఫిర్యాదు చేస్తా. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డితో కలిసి పనిచేయడానికి ఎటువంటి అభ్యంతరం లేదు. బైరెడ్డిని నేను ఎప్పుడూ విమర్శించలేదు’’ అని తెలిపారు.

నందికొట్కూరులో నెలకొన్న పరిస్థితులపై అధిష్టానం స్పందించి వెంటనే చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. అధిష్టానం చొరవ తో ఎమ్మెల్యే ఆర్థర్ వైఖరిలో మార్పు వచ్చిందని, త్వరలోనే చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆయన చల్లబడ్డాడని సమాచారం. స్థానిక ఎన్నికలు సమీపిస్తుండడంతో పార్టీలో ఇలాంటి పరిస్థితులు ఉండవద్దని, ఎన్నికలయ్యాక ఏం చేద్దామనేది చర్చిద్దామని పార్టీ పెద్దలు పేర్కొనట్లు ఆర్దర్ అనుచరులు చెబుతున్నారు.