Begin typing your search above and press return to search.

ఆటలో ఓడినా అతడి క్రీడా స్ఫూర్తికి లక్షల మంది ఫిదా

By:  Tupaki Desk   |   23 Sept 2020 5:00 AM IST
ఆటలో ఓడినా అతడి క్రీడా స్ఫూర్తికి లక్షల మంది ఫిదా
X
అతనో అథ్లెట్. తాజాగా నిర్వహించిన పరుగు పందెంలో ఓడాడు. కానీ.. ఆట చివర్లో అతడు ప్రదర్శించిన క్రీడా స్ఫూర్తితో అతను ఓడినా.. లక్షలాది మంది మనసుల్ని దోచేశాడు. స్పెయిన్ లో జరిగిన ఒక పోటీలో చోటు చేసుకున్న ఈ ఉదంతం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. క్రీడా ప్రపంచంలో చక్కటి చర్చకు తెర తీయటమే కాదు.. ఆ పోటీకి సంబంధించిన వీడియో ఒకటి వైరల్ గా మారింది.

ఈ వీడియోను ఇప్పటికి దగ్గర దగ్గర ఏడు మిలియన్ల మంది వీక్షించటం గమనార్హం. ఇంతకీ ఆ అథ్లెట్ ఎవరు? అతనేం చేశాడు? అంతలా అందరి మనసుల్ని ఎలా దోచేసుకున్నాడు? ఓడినా ప్రేక్షకుల మదిలో ఎలా గెలిచారన్నది చూస్తే.. తాజాగా స్పెయిన్ లో ట్రయథ్లాన్ ను నిర్వహించారు. అందులో స్పెయిన్ కు చెందిన అథ్లెట్ డియాగో మెట్రిగో పాల్గొన్నాడు. చాలా దూరం పరిగెత్తిన అతడు.. విజయతీరానికి కూసింత దూరంలో ఉండగా.. ఒక్కసారిగా నెమ్మదించాడు.

అతను ఏ ఊపులో అయితే ఉన్నారో.. అదే ఊపులో పరిగెత్తితే మూడో స్థానంలో నిలిచేవారు. కానీ.. అలా చేయని అతడు.. ముగింపు గీతకు కాస్త ముందుగా ఒక్కసారిగా నెమ్మదించి.. తన వెనుక ఉన్న బ్రిటిష్ అథ్లెట్ జేమ్స్ టియాగిల్ కు అవకాశం ఇచ్చాడు. ఎందుకిలా చేశాడంటే.. ఆ పోటీలో అతను చివర్లో తడబటం.. మలుపు తిరిగే క్రమంలో అతడు త్రోటుపాటుకు గురైన విషయాన్ని గుర్తించాడు. అప్పటివరకు తన కంటే ముందున్న టియాగిల్ చిన్న తప్పిదాన్ని గమనించి.. పోటీ ముగింపు గీతకు అడుగు దూరంలో నిలబడిపోయాడు.

దీంతో అతడి వెనుక ఉన్న టియాగిల్ ముందుకు వచ్చి గెలిచేలా చేశాడు. పందెంలో తన కంటే ముందున్న జేమ్స్ ఈ పోటీలో గెలవటం న్యాయమని.. అందుకే తాను వేగాన్ని తగ్గించినట్లుగా పేర్కొని అద్భుతమైన క్రీడాస్ఫూర్తిని ప్రదర్శించారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు భారీగా వైరల్ గా మారింది.