Begin typing your search above and press return to search.

అంత ధైర్యమా; బాబు మాటనే అచ్చెన్నాయుడు ప్రశ్నించారు!

By:  Tupaki Desk   |   8 July 2015 5:12 AM GMT
అంత ధైర్యమా; బాబు మాటనే అచ్చెన్నాయుడు ప్రశ్నించారు!
X
ఏపీలోని చాలామంది మంత్రులకు లేని ఒక ప్రత్యేక మంత్రి అచ్చెన్నాయుడి సొంతం అని చెబుతారు. అవినీతి విషయంలో ఆయన చాలా దూరంగా ఉంటారని.. రాజకీయాల్లో ఇంతకాలం ఉన్నా వెనకేసుకున్నది ఏమీ లేదన్న మాట చాలా ఎక్కువగా వినిపిస్తుంటుంది. ఎవరు వచ్చినా సాయం చేసేందుకు సిద్ధంగా ఉంటూ.. వ్యక్తిగత సంపద సృష్టి మీద అచ్చెన్నాయుడికి మోజు తక్కువనే మాటను పలువురు చెబుతుంటారు.

అలాంటి అచ్చెన్నాయుడు పని విషయంలో రూల్‌ టు రూల్‌గా ముందుకెళతారన్న వాదన ఉంది. నిబంధనలకు మీరి నిర్ణయాలు తీసుకునే విషయంలో ససేమిరా అనటం అచ్చెన్నాయుడిలో కనిపిస్తుంది. తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల్ని సైతం.. నో చెప్పేస్తే.. ఫైలు తిప్పి పంపిన వైనం ఏపీ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తోంది.

ముఖ్యమంత్రి స్వయంగా ఫర్లేదు.. నిధులు ఇవ్వండని అన్నా.. నిబంధనలు ఒప్పుకోవని..సుప్రీంకోర్టు తీర్పు ఇందుకు అనుమతించదన్న విషయాన్ని స్పష్టంగా నోట్‌ రాసి మరీ.. అచ్చెన్నాయుడు తిరిగి పంపేయటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ముఖ్యమంత్రి ఆదేశాల్ని కాదనే పరిస్థితి సహజంగా మంత్రులకు ఉండదు. లోపాయికారీగా ఏదో నడిపించేస్తుంటారు లేదంటే రాజీ పడతారు. కానీ.. అచ్చెన్నాయుడు మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించారు.

కుప్పంలో నిర్మాణ కార్మికుల కోసం శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని చంద్రబాబు భావిస్తున్నారు.దీని భవన నిర్మాణానికి రూ.15కోట్లు విడుదల చేయాలని కార్మికశాఖకు ఫైలు పంపారు. అయితే.. నిబంధనల ప్రకారం ఆ మొత్తాన్ని రోడ్డు భవనాల శాఖ నుంచి తీసుకోవాలని.. కార్మికుల సంక్షేమం కోసం ఖర్చు చేసే మొత్తాన్ని భవన నిర్మాణానికి సాధ్యం కాదంటూ అధికారుల చేసిన సూచనను గౌరవిస్తూ.. అదే మాటను ఫైల్‌లో రాసి పంపారు.

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. చీఫ్‌ సెక్రటరీ సైతం.. భవన నిర్మాణానికి రూ.15కోట్లు ఇవ్వాలని సూచించినా.. అచ్చెన్నాయుడు మాత్రం తన అధికారులు చెప్పిన మాటకే కట్టుబడి ఉండటమే కాదు.. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల్ని సైతం నిర్మోహమాటంగా కుదరదని చెప్పేయటం ఇప్పుడు పెద్ద చర్చను రేపుతోంది. మరి.. దీనిపై బాబు ఎలా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.