Begin typing your search above and press return to search.

టీ అధికారుల్ని కూడా వదిలి పెట్టని ఏపీ మంత్రులు

By:  Tupaki Desk   |   27 Jun 2015 12:57 PM IST
టీ అధికారుల్ని కూడా వదిలి పెట్టని ఏపీ మంత్రులు
X
ఓటుకు నోటుతో పాటు.. సెక్షన్‌ 8 పంచాయితీతో రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య నెలకొన్న ఘర్షణ వాతావరణం తెలిసిందే. ఉప్పు.. నిప్పు మాదిరిగా వ్యవహరిస్తున్న ఈ రెండు ప్రభుత్వాల ఫైటింగ్‌ రోజురోజుకీ మరింత విస్తృతమవుతోంది.

ఇప్పటివరకూ రాజకీయ నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు.. తీవ్ర ఆరోపణలు చేసుకునే స్థాయి నుంచి ఇప్పుడు కీలక అధికారులపై కూడా విమర్శలు మొదలుపెట్టారు. తాజాగా ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు తాజా వ్యాఖ్యలే దీనికి నిదర్శనం. ప్రభుత్వ అధికారి అయి ఉండి.. ఫక్తు రాజకీయనాయుడి మాదిరి మాట్లాడుతున్నారంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు.

తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజీవ్‌ శర్మ వైఖరిని తప్పు పట్టిన ఏపీ మంత్రి.. రాజీవ్‌శర్మను టార్గెట్‌ చేసుకున్నారు. అచ్చెన్నాయుడుతో పాటు మరో ఇద్దరు మంత్రులు కలిసి రాజీవ్‌శర్మ వైఖరిని తప్పు పట్టారు. తొమ్మిది.. పదో షెడ్యూల్‌కు సంబంధించిన సంస్థల విషయంలో రాజీవ్‌ శర్మ తొందరపడి నిర్ణయాలు తీసుకుంటున్నారని.. ఇది ఏ మాత్రం సబబు కాదని వారు వ్యాఖ్యానించారు.

ఇష్టం వచ్చిన రీతిలో నిర్ణయాలు తీసుకునే అవకాశం లేదని.. ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్‌లో ఏపీకి కూడా వాటా ఉందన్న విషయన్ని మర్చిపోవద్దని చెబుతున్నారు. సెక్షన్‌ 8పై గవర్నర్‌ తన పరిధి మేరకు వ్యవహరించాల్సి ఉంటుందన్న విషయాన్ని గుర్తు చేశారు. అయితే గవర్నర్‌ అలా చేయటం లేదని ఏపీ మంత్రులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇప్పటివరకూ నేతల మధ్యనే మాటల తూటాలు పేలితే.. ఇప్పుడు కీలకాధికారుల మీద కూడా పేలటం ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో చూడాలి.