Begin typing your search above and press return to search.

ప్రతి ఇంట్లో ఫోటో ఉండాల్సిన వ్యక్తిని చూపించినా గుర్తు పట్టలేని దైన్యం

By:  Tupaki Desk   |   7 Sept 2020 11:45 AM IST
ప్రతి ఇంట్లో ఫోటో ఉండాల్సిన వ్యక్తిని చూపించినా గుర్తు పట్టలేని దైన్యం
X
చేసింది తక్కువైనా ప్రచారం పొందేటోళ్లు.. హీరోలుగా మారేటోళ్లు చాలామంది ఉంటారు. కానీ.. నిస్వార్థంగా పోరాడిన కొందరి పోరాటం గురించి ఎవరికి పెద్దగా తెలీదు. ప్రచారంలోకి రాదు కూడా. వారి పోరాటం ఫలితంగా ఫలాలు అందరికి దక్కినా.. అందుకు కారణమైన వారిని గుర్తు పెట్టుకోవటం తర్వాత.. కనీసం ఆ పెద్ద మనిషి ఫోటోను చూపించినా గుర్తు పట్టలేని దైన్యం మన దేశవాసులకే మాత్రమే సొంతం.

ఇంతకీ ఇదంతా ఎవరి గురించి అంటారా? అక్కడికే వస్తున్నాం. పదో తరగతి.. లేదంటే.. ఆ పైన చదివిన ప్రతి ఒక్కరికి.. కోర్టుతో లింకు ఉన్నోళ్లకు.. వాళ్లు.. వీళ్లు అన్న తేడా లేకుండా చాలామందికి పేరుతో కనెక్టు అయ్యే వ్యక్తి.. ‘‘కేశవానంద భారతి’’. ఈ రోజున ప్రాథమిక హక్కుల్ని అనుభవిస్తున్న వారంతా ఆయనకు దండం పెట్టాల్సిందే. భారత దేశ పౌరులకు రాజ్యాంగం రక్షణ ఏర్పాటు చేసేందుకు కారణమైన కీలకవ్యక్తిగా చెప్పాలి.

రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత పలు అధికరణాల్ని తమకు తోచినప్పుడు.. తమకు ఇబ్బంది కలిగినప్పుడు మార్చేసే పాలకులకు చెక్ పెట్టటంలో సక్సెస్ అయ్యారు కేశవానంద భారతి. అంబేడ్కర్ సారథ్యంలో తయారైన రాజ్యాంగంలో దేశ వాసులకు ఇచ్చిన హక్కులకు పాలకులు చెక్ పెట్టకుండా చేయటంలో ఆయన కీలకభూమిక పోషించారు.

పలు సందర్భాల్లో ప్రభుత్వాధినేతలు ప్రజల హక్కుల్ని హరించేలా వివిధ అధికరణాల్ని ఎడాపెడా మార్చేసే ప్రయత్నాలకు వీలు లేని రీతిలో ఆయన సాగించిన న్యాయపోరాటం.. అంతా ఇంతా కాదు. ప్రభుత్వాల అహంభావానికి చెక్ చెప్పటమే కాదు.. ప్రజలు ఇచ్చిన అధికారంతో వారి హక్కులకు కత్తెర వేసే అవకాశం పాలకులకు లేకుండా చేయటంలో సుప్రీంలో ఆయన చేసిన న్యాయపోరాటం విజయవంతమైంది. కేంద్రానికి రాజ్యాంగాన్ని అదే పనిగా సవరించే హక్కు లేదని.. దానికి పరిమితులు ఉన్నాయని తేల్చి చెప్పేలా చేయటంలో ఆయన విజయం సాధించారు. అదే ఈ రోజున దేశ ప్రజల ప్రాథమిక హక్కుల్ని పరిరక్షిస్తోంది.

ఇంత చేసిన ఆయన ఫోటోను దేశ ప్రజలంతా తమ ఇళ్లల్లో పెట్టుకోవాలి. కానీ.. ఈ దేశంలో కుల.. మత.. రాజకీయ నేతల్ని ఇట్టే గుర్తించే ప్రజలు.. దేశ వాసులకు ఎంతో అవసరమైన ప్రాథమిక హక్కులకు భంగం వాటిల్లకుండా ఉండేలా పోరాడిన కేశవానంద భారతి పోటోను చూసినా గుర్తించలేని దుస్థితి. ఆదివారం ఆయన మరణించారు. ఇప్పటికైనా ఆయన ఫోటోను చూసి.. గుర్తు పెట్టుకోవటమే జాతి ఆయనకు ఇచ్చే ఘననివాళిగా చెప్పక తప్పదు.