Begin typing your search above and press return to search.

లాక్ డౌన్ ఎఫెక్ట్ : భర్త శవం పక్కనే 3 రోజులపాటు..!

By:  Tupaki Desk   |   14 May 2020 11:45 AM IST
లాక్ డౌన్ ఎఫెక్ట్ : భర్త శవం పక్కనే 3 రోజులపాటు..!
X
ఈ మహమ్మారి కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరు భయంతో వణికిపోతున్నారు. అయితే , దీన్ని అరికట్టడానికి విధించిన లాక్ డౌన్ వల్ల కొందరు వృద్దులు ప్రాణాలు కోల్పోతున్నారు. కొడుకులు , కూతుర్లు ఉద్యోగాల నిమిత్తం వేరే చోట ఉండటంతో ... సొంతఊర్లలో నివాసం ఉంటున్న కొంతమంది వృద్దులు , లాక్ డౌన్ కారణంగా ఇంట్లో నుండి బయటకి రాలేక.. మాట్లాడేవారే లేక అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి ఓ దుర్ఘటన తాజాగా నిజామాబాద్ లో జరిగింది. ఆమెకి మతిస్థిమితం సరిగాలేదు .. అయన అనారోగ్యంతో భాదపడుతున్న వృద్ధుడు. ఆమె మానసిక స్థితి సరిగా లేకపోవడంతో అతని అనారోగ్యం గురించి పట్టించుకోలేదు. దీంతో అతను ఇంట్లోనే మృతి చెందాడు. విషాదమేంటంటే.. అతను చనిపోయి 3 రోజులు కావస్తున్నా, ఆ వృద్దురాలు ఆ విషయమే గుర్తించలేకపోయింది. లాక్ డౌన్ కారణంగా ఎవరిళ్లకు వారే పరిమితమవడంతో ఆ వృద్ద దంపతుల గురించి ఎవరూ పట్టించుకోకపోవడం వల్లే ఇలా జరిగినట్టు తెలుస్తోంది.

ఈ సంఘటన పై పూర్తి వివరాలు చూస్తే... నోముల లింబారెడ్డి వీఆర్వోగా పనిచేసి రిటైర్ అయ్యారు. ఆయనకు భార్య శకుంతల ఇద్దరు పిల్లలు ఉన్నారు. కొడుకు హైదరాబాద్‌ లో,కుమార్తె ఇంగ్లాండులో స్థిరపడ్డారు. రిటైర్ ‌మెంట్ తర్వాత లింబారెడ్డి తన భార్యతో కలిసి నిజామాబాద్‌ లోని కంఠేశ్వర్ న్యూహౌసింగ్ బోర్డు కాలనీలో నివసిస్తున్నారు. అయితే కొన్నేళ్లుగా శకుంతల మానసిక స్థితి సరిగా లేదు. కరోనా లాక్ డౌన్ కారణంగా అంతా ఎవరిళ్లకు వారే పరిమితమవడంతో ఈ వృద్ద జంట బాగోగులు ఎవరూ పట్టించుకోలేదు. బుధవారం ఉదయం ఇంట్లో పాలు పోసేందుకు వచ్చిన వ్యక్తి.. లోపలి నుంచి దుర్వాసన రావడం గుర్తించాడు. దీనిపై శకుంతలను ఆరా తీయగా ఆమె నుంచి ఎటువంటి సమాధానం రాలేదు. పొరుగింటి వాళ్లకు చెప్పడంతో వారు కూడా అడిగి చూశారు. అయినప్పటికీ ఆ వృద్దురాలు ఏమీ చెప్పలేదు.

దీంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఆ ఇంట్లోకి వెళ్లి చూడగా.. లింబారెడ్డి తన మంచం పైనే మృతి చెందినట్టు గుర్తించారు. మూడు రోజుల క్రితమే అతను చనిపోయినట్టు భావిస్తున్నారు. వెంటనే లింబారెడ్డి కొడుకుకు సమాచారం అందించి మృతదేహాన్ని పోస్టుమార్టమ్‌ కు తరలించారు. పోస్టుమార్టమ్ నివేదికలో సాధారణ మరణంగానే తేలింది. దీనిపై కొడుకు మాట్లాడుతూ తమకి ఎవరిపై అనుమానం లేదు అని , తన తల్లి మానసిక స్థితి సరిగా లేకపోవడంతోనే.. తండ్రి చనిపోయిన విషయాన్ని గుర్తించలేదన్నాడు. అయితే , ఈ లాక్ డౌన్ సమయంలో కొడుకు రోజుకి ఒకసారైనా కూడా వారికీ ఫోన్ చేసి , ఎలా ఉన్నారు , తిన్నారా లేదా అని ..వారి క్షేమ సమాచారాన్ని కనుక్కోవాల్సింది కదా అని స్థానికులు వాపోతున్నారు.