Begin typing your search above and press return to search.

సారుకు సంచలన సవాలు విసిరిన అశ్వత్థామరెడ్డి

By:  Tupaki Desk   |   7 Oct 2019 11:12 AM GMT
సారుకు సంచలన సవాలు విసిరిన అశ్వత్థామరెడ్డి
X
ఆర్టీసీ సమ్మెపై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మూడో కన్ను తెరిచినంత పని చేశారు. సంస్థలో పని చేస్తున్న 48వేల మంది ఉద్యోగుల్ని తొలగించినట్లుగా ఆయన చెబుతున్నారు. కొత్తవారిని యుద్ధ ప్రాతిపదికన నియమిస్తామని.. పదిహేను రోజుల్లో అంతా సెట్ చేస్తున్నట్లు చెప్పిన వైనం పెద్ద ఆశ్చర్యానికి గురి చేయట్లేదు. కానీ.. కొత్తగా ఉద్యోగాలు పొందే వారు ఎట్టి పరిస్థితుల్లో తాము ఏ యూనియన్లో చేరమని హామీ పత్రం ఇవ్వాల్సి ఉంటుందన్న మాటపై పెద్ద ఎత్తున అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.

సీఎం కేసీఆర్ వ్యాఖ్యలపై ఆర్టీసీ సంఘాలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి. అంతేకాదు.. రానున్న రోజుల్లో ప్రభుత్వ - ప్రైవేటు భాగస్వామ్యంలో ఆర్టీసీ నడుస్తుందన్న మాటలపైనా అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. కేసీఆర్ ప్రస్తావించిన అంశాల్ని తీవ్రంగా ఖండిస్తున్న కార్మిక సంఘాలు.. సీఎంకు భారీ కౌంటర్ ఇచ్చేలా వాదనలు వినిపిస్తున్నాయి.

ఇందులో భాగంగా ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. సీఎం కేసీఆర్ వి దుర్మార్గమైన ఆలోచనలంటూ ఫైర్ అవుతున్న ఆయన.. ప్రభుత్వానికి మంట పుట్టేలా కొత్త తరహా వ్యాఖ్యలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి చెబుతున్నట్లు తాము ట్రేడ్ యూనియన్లను వదిలేస్తామని.. మరి ముఖ్యమంత్రి కేసీఆర్ రాజకీయ పార్టీని వదులుతారా? అని ప్రశ్నించారు. తన సవాల్ ను కేసీఆర్ స్వీకరిస్తారా? అంటూ ప్రశ్నిస్తున్న ఆయన.. కేసీఆర్ మతి భ్రమించిన మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

ఆర్టీసీ కార్మికులంతా క్రమబద్ధ నియామక ప్రక్రియలో ఉద్యోగాలు పొందిన వారని.. అలాంటి వారిని గంపగుత్తగా ఎలా తొలగిస్తారు? అని ప్రశ్నించారు. ఉద్యోగులకు రాజ్యాంగ హక్కులు ఉన్నాయని.. వాటిని కూలదోసే హక్కు ముఖ్యమంత్రికి లేదన్నారు. సీఎం తీసుకునే నిర్ణయాలకు తాము న్యాయపరంగా ఎదుర్కొంటామంటున్నారు. అంతేకాదు.. కేసీఆర్ మాటలకు ఉద్యోగులు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని భరోసా ఇస్తున్నారు. కేసీఆర్ తీరును కార్మిక సంఘాల నేతలే కాదు.. రాజకీయ పార్టీలు సైతం ఖండిస్తున్నాయి. వారి డిమాండ్లకు తాము అండగా నిలుస్తామంటున్నాయి. ఆర్టీసీ సమ్మెతో ఇప్పటికే తీవ్ర ఆగ్రహంలో ఉన్న కేసీఆర్.. తాజాగా అశత్థామ రెడ్డి సవాల్ కు ఎలా స్పందిస్తారో చూడాలి.