Begin typing your search above and press return to search.

ర‌జ‌నీ రాజ‌కీయంపై జ్యోతిష్యుల మాటేంటంటే?

By:  Tupaki Desk   |   25 Jun 2017 4:25 AM GMT
ర‌జ‌నీ రాజ‌కీయంపై జ్యోతిష్యుల మాటేంటంటే?
X
ఆయ‌న ద‌క్షిణాది రాష్ట్రాల్లో సూప‌ర్ స్టార్‌. ఆయ‌న నోట ఒక్క డైలాగ్ వ‌స్తే... అదే వంద డైలాగుల్లా మారిపోతుంది. యువ‌త‌ను వెర్రెత్తిస్తుంది. ఏళ్లు గ‌డిచినా కూడా ఆ డైలాగ్ ప‌వ‌ర్ అలాగే ఉంటుంది. అంత‌టి డైలాగ్ ప‌వ‌ర్ ఉన్న ఆ సూప‌ర్ స్టార్ ఇప్పుడు త‌న ప‌య‌న‌మెటో తేల్చుకోలేక స‌త‌మ‌త‌మ‌వుతున్నారు. మిత్రుల‌తో పాటు శ్రేయోభిలాషులు, త‌నను ప్రాణం కంటే ఎక్కువ‌గా అభిమానించే ఫ్యాన్స్‌ తో మాట్లాడారు. అయినా ఆయ‌న‌కు క్లారిటీ రాలేద‌ట‌. దీంతో ఆయ‌న నేరుగా భవిష్య‌వాణి చెప్పే జ్యోతిష్యుల‌ను ఆశ్ర‌యించారట‌.

ఇలా ఆ సూప‌ర్ స్టార్ ఆశ్రయించిన జ్యోతిష్యుల సంఖ్య ఒక‌టో - రెండో కాద‌ట‌... ఏకంగా నాలుగ‌ట‌. అంటే ఆయ‌న త‌న రాజ‌కీయ‌ భ‌విష్య‌త్తు ఏమిటో తేల్చుకునేందుకు న‌లుగురు జ్యోతిష్యుల‌ను క‌లిశార‌ట‌. అస‌లు ఆ సూప‌ర్ స్టార్ పేరు చెప్ప‌కుండా ఈ సోది ఎందుకంటారా? ఇంత ఉపోద్ఘాతం చెప్పిన త‌ర్వాత ఆ సూప‌ర్ స్టార్ ఎవ‌రో ఇప్ప‌టికే మీకు అర్థ‌మ‌య్యే ఉంటుంది క‌దా. ఆయ‌న ఎవ‌రో కాదు మీర‌నుకుంటున్న‌ట్లు త‌మిళ స్టార్ హీరో ర‌జ‌నీకాంతే.

త‌మిళ‌నాడు దివంగ‌త సీఎం జ‌య‌ల‌లిత మ‌ర‌ణం తర్వాత అర‌వ రాజ‌కీయాల్లో భారీ శూన్యం ఏర్ప‌డింది. ఈ శూన్యాన్ని భ‌ర్తీ చేయాలంటే ఎవ‌రో ఒక‌రు కొత్త‌గా రావాల్సిందేనన్న వాద‌న వినిపిస్తోంది. ఆ వ‌చ్చే వ్య‌క్తి ర‌జ‌నీకాంత్ అయితే బాగుంటుందని మెజారిటీ ప్ర‌జ‌ల అభిప్రాయం. ఈ దిశ‌గా బాగానే ఆలోచించిన ర‌జ‌నీకాంత్‌... ఇప్ప‌టికే త‌న అభిమానుల‌తో ప్ర‌త్యేకంగా భేటీ అయ్యారు. అయినా తాను రాజకీయాల్లోకి వ‌స్తే... కింగ్‌ ను అవుతానా? లేక కింగ్ మేక‌ర్‌ గా మిగిలిపోతానా? అన్న అనుమానం వ‌చ్చింద‌ట‌.

ఈ అనుమానాన్ని నివృత్తి చేసుకునేందుకు ఆయ‌న ఒక‌రు కాదు, ఇద్ద‌రు కాదు... ఏకంగా న‌లుగురు జ్యోతిష్యుల‌ను ఆశ్ర‌యించార‌ట‌. ఈ న‌లుగురు జ్యోతిష్యుల్లో ముగ్గురు... ర‌జనీ కింగ్ గానే సక్సెస్ అవుతార‌ని చెప్ప‌గా. నాలుగో జ్యోతిష్యుడు మాత్రం కింగ్ లేదు - కింగ్ మేక‌రూ లేదు... రాజ‌కీయాల్లోకి వ‌స్తే ఇబ్బంది ప‌డ‌తార‌ని హెచ్చ‌రించార‌ట‌. మ‌రి ఈ న‌లుగురు జ్యోతిష్యుల్లో ముగ్గురు చెప్పిన మాట ప్ర‌కారం ర‌జ‌నీ రాజ‌కీయాల్లోకి దూకుతారా? లేదంటే.. ఒక్క‌రు చెప్పిన‌ట్లుగా సినిమాల‌కే ప‌రిమిత‌మ‌వుతారా? అన్న విష‌యం తేలాల్సి ఉంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/