Begin typing your search above and press return to search.

క‌మ‌ల్‌...సీఎం కాదు క‌దా...మంత్రి కూడా కాలేర‌ట‌!

By:  Tupaki Desk   |   24 Feb 2018 5:07 AM GMT
క‌మ‌ల్‌...సీఎం కాదు క‌దా...మంత్రి కూడా కాలేర‌ట‌!
X
త‌మిళ‌నాట మ‌రో కొత్త రాజ‌కీయ పార్టీ వ‌చ్చేసింది. మ‌క్క‌ల్ నీది మ‌య్య‌మ్ పేరిట రాజ‌కీయ పార్టీని ప్ర‌క‌టించిన విల‌క్ష‌ణ న‌టుడు క‌మ‌ల్ హాస‌న్‌... త‌న రాజ‌కీయ రంగ ప్ర‌వేశంపై భారీ ప్ర‌క‌ట‌నే చేశారు. డ‌బ్బులు తీసుకుని ఓట్లు వేసే రాజ‌కీయాల‌కు చ‌ర‌మ గీతం పాడ‌తాన‌ని, అందుకే తాను రాజ‌కీయాల్లోకి వ‌చ్చాన‌ని - ఇక‌పై పూర్తి స్థాయిలో పాలిటిక్స్‌ లోనే కొన‌సాగుతాన‌ని క‌మ‌ల్‌ కాస్తంత ఘ‌నంగానే ప్ర‌క‌టించారు. ప్ర‌క‌ట‌న‌లైతే బాగానే ఉన్నాయి గానీ... అస‌లు క‌మ‌ల్ హాసన్ రాజ‌కీయాల్లో ఏ మేర‌కు రాణిస్తార‌నే విష‌యంపై అప్పుడే విశ్లేష‌ణ‌లు మొద‌ల‌య్యాయి. ప్ర‌స్తుతం త‌మిళ‌నాడు దివంగ‌త సీఎం - అన్నాడీఎంకే అధినేత్రి జ‌య‌లలిత మ‌ర‌ణంతో త‌మిళ‌నాట రాజ‌కీయ శూన్య‌త ఉన్న మాట వాస్త‌వ‌మే. అయితే డీఎంకే త‌దుప‌రి అధినేత హోదాలో చాలా వేగంగా దూసుకువ‌స్తున్న ఎంకే స్టాలిన్‌... త‌మిళ‌నాడు భవిష్య‌త్తు సీఎంగా ఇప్ప‌టికే బాగానే ఎలివేట్ అయ్యారు. జాతీయ పార్టీల‌కు పెద్ద‌గా ఓట్లేయ‌ని తంబీలు ఇప్ప‌టిదాకా ఓ సారి డీఎంకేను - మ‌రోమారు అన్నాడీఎంకేను గెలిపిస్తూ వ‌చ్చారు. జ‌య‌ల‌లిత మ‌ర‌ణంతో అన్నాడీఎంకే లెక్క‌లేన‌న్ని చీలిక‌లు పేలిక‌లు అయిపోయింది. జ‌య బ‌తికుండ‌గానే జ‌రిగిన ఎన్నికల్లో తంబీలంతా అన్నాడీఎంకేను వ‌రుస‌గా రెండో ప‌ర్యాయం అదికారంలో కూర్చోబెట్టారు. ఈ టెర్మ్ మొత్తం అన్నాడీఎంకే అధికారంలో ఉన్నా... వ‌చ్చే ఎన్నిక‌ల్లో మాత్రం ఆ పార్టీ పెద్ద‌గా రాణించే అవ‌కాశాలు లేవ‌న్న వాద‌న వినిపిస్తోంది. ఇక మిగిలిన డీఎంకేతో పాటుగా కొత్త‌గా వ‌చ్చిన మ‌క్క‌ల్ నీది మ‌య్య‌మ్‌ - త్వ‌ర‌లోనే రానున్న సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ పార్టీలే ఆ ఎన్నిక‌ల్లో కీల‌క భూమిక పోషించ‌నున్నాయి.

ఈ క్ర‌మంలో ర‌జ‌నీ కంటే ఓ అడుగు ముందుగానే ఉన్న క‌మ‌ల్ హాస‌న్ భ‌విష్య‌త్తు ఎలా ఉంటుంద‌న్న అంశంపై అప్పుడే విశ్లేష‌ణ‌లు - జ్యోతిష్యాలు మొద‌లైపోయాయి. అయితే అన్ని విష‌యాల్లో మాదిరిగానే క‌మ‌ల్ పొలిటిక‌ల్ ఫ్యూచ‌ర్‌ పైనా భిన్నాభిప్రాయాలే వ్య‌క్త‌మ‌వుతున్నాయి. సినిమాల్లో నాయ‌కుడిగా రాణించిన క‌మ‌ల్ రాజ‌కీయాల్లోనూ రాణిస్తార‌ని ఒక‌రిద్ద‌రు జ్యోతిష్యులు చెబుతుంటే... మెజారిటీ జ్యోతిష్యులు మాత్రం అందుకు భిన్న‌మైన వాద‌న‌ను వినిపిస్తున్నారు. క‌మ‌ల్ రాజ‌కీయంగా సుదీర్ఘ ప్ర‌యాణ‌మే చేయ‌నున్న‌ప్ప‌టికీ... సీఎం కాదు క‌దా... మంత్రి కూడా అయ్యే అవ‌కాశాలు లేవ‌ని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. ఆ జ్యోతిష్యాలు ఎలా ఉన్నాయ‌న్న విష‌యంలోకి వెళితే... కమల్ హాసన్‌ కు ఉజ్వల రాజకీయ భవితవ్యం ఉన్నట్లు ఢిల్లీకి చెందిన ఓ జ్యోతిషుడు ఒకరు పేర్కొన్నారు. ఆయన పూర్తిగా ప్రజాసేవకే అంకితమవుతారని చెప్పారు. మరో తమిళ జ్యోతిషుడు రధన్ పండిట్ అయితే.. కమల్ జాతకాన్ని దివంగత సీఎం ఎంజీ రాంచంద్రన్ జాతకంతో పోల్చారు. క‌మ‌ల్‌ రాజకీయ జీవితం ఇప్పుడే ప్రారంభమైందని - నిరాటంకంగా 20-25 ఏళ్లపాటు ఆయన క్రియాశీల రాజకీయాల్లో కొనసాగుతారని రధన్ పండిట్ పేర్కొన్నారు. అంతేకాదు... డీఎంకే కార్యాధ్య‌క్షుడు ఎంకే స్టాలిన్‌ జాతకం కూడా ఉచ్ఛస్థితిలో ఉంద‌నీ, అయినగానీ కమల్‌ కు ఎదురే ఉండదని - రాబోయే రోజుల్లో క‌మ‌ల్‌ ముఖ్యమంత్రి అవడం తథ్యమని జోస్యం చెప్పారు. ప్రస్తుతం కమల్ వయసు 63 ఏళ్లు. ఆయన 90 ఏళ్లు జీవిస్తారని, 2036 వరకు ఆయన జాతకం ఉజ్వలంగా ఉంటుందని రధన్ పండిట్ చెబుతున్నారు.

మరో జ్యోతిషుడు భారతి శ్రీధర్ తెలిపిన వివరాల ప్రకారం... ప్రస్తుతం కమల్ హాసన్ బుధ మహాదశ నుంచి శుక్ర మహాదశలోకి అడుగుపెట్టబోతున్నాడు. ఈ దశ అక్టోబరు 2020 వరకు ఉంటుంది. నటుడిగా ఆయన ఇప్పటికే కావాల్సినంత పేరు సంపాదించుకున్నారు. కాబట్టి గ్రహబలం ప్రకారం అదనంగా ఎలాంటి లబ్ది ఉండదు. ఈ సమయంలో కుజుడు ఉచ్ఛదశలో ఉంటాడు కాబట్టి కమల్‌కు అన్నీ అనుకూలంగా ఉంటాయి. అంగారకుడి స్థానంలో బుధుడు ఉండటం వల్ల మిశ్రమ ఫలితాలు చేకూరుతాయి. అయితే రాజకీయాలు మాత్రం కమల్‌ హసన్‌ కు కలిసిరాకపోవచ్చని జ్యోతిషుడు భారతి శ్రీధర్ పేర్కొంటున్నారు. కమల్ హాసన్ జాతకంలో నవంబరు 2020 నుంచి మొదలయ్యే సూర్య మహాదశ ఆరేళ్లపాటు ఉంటుంది. అయితే ఈ కాలంలో సూర్యుడు బలహీనుడే కాకుండా శనితో కలిసి ఉంటాడు. అందువల్ల కమల్‌ కు పెద్దగా కలిసిరాదట. రాజకీయాల్లోనే కాదు - ఒకవేళ సినిమాల్లో నటించాలనుకున్నా కూడా ఆయనకు ఆ రంగంలోనూ అంతగా కలిసిరాదట. రాశిచక్రం ప్రకారం గురుడు ఉచ్చస్థితిలో ఉన్నా - 10 వ స్థానంలో ఉండటంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించినా - పదవులు మాత్రం దక్కవట. ఒకవేళ భాగ్యస్థానం ప్రకారం సూర్య - కేతువులతో బుధుడు కలిసినప్పుడు జనాదరణ పొందినా కానీ ప్రతినిధి మాత్రం కాలేడట. మొత్తంగా చెప్పాలంటే కమల్ జాతకంలో ముఖ్యమంత్రి యోగం కాదుగదా.. కనీసం ఆయన మంత్రి అయ్యే అవకాశం కూడా లేదని చెబుతున్నారు.

మన జ్యోతిష శాస్త్రం ప్రకారమే కాదు, చైనా జ్యోతిషమైన ఫెంగ్ షుయ్ ప్రకారం చూసుకున్నా కమల్ హాసన్‌ రాజకీయాల్లో రాణించడం కష్టమేనట. ఈ విషయాన్ని ఫెంగ్ షుయ్ కన్సల్టెంట్ ఎస్‌బీఎస్ సురేందరన్ వెల్లడించారు. గణితశాస్త్రం ప్రకారం వృత్తం - దానిలో ఆరు కోణాల నక్షత్రం శక్తి - జ్ఞానం - ఘనత - ప్రేమ - దయ - న్యాయం అనే గుణాలకు ప్రతీక. కమల్ జాతకంలోని ఎరుపు రంగు అగ్నిని సూచిస్తోందని, దీని ప్రభావం సమృద్ధి - కీర్తి - ఆనందం - బంధాలపై ఉంటుందని, ఇక తెలుపు అనేది లోహ మూలకం.. సృజనాత్మకత - ప్రజలకు సహాయపడటం - పనిలో నిబద్దతను ప్రభావితం చేస్తుందని ఆయన పేర్కొన్నారు. నలుపు అనేది నీటి మూలకమని, ప్రజలతో ప్రత్యక్ష సంబంధాలకు ఇదే కారణమవుతుందని, పై ఆరు గుణాలు - మూడు రంగుల సమన్వయంతో కలిసి ఏకకాలంలో పనిచేసినప్పుడు మాత్రమే మంచి ఫలితం ఉంటుందని - కానీ కమల్‌‌ హసన్‌ కు మాత్రం వీటి సమన్వయం చాలా తక్కువగా ఉందని, కాబట్టి ఆయన రాజకీయాల్లో రాణించడం కష్టమని ఫెంగ్ షుయ్ కన్సల్టెంట్ సురేందరన్ చెబుతున్నారు.