Begin typing your search above and press return to search.

ముహుర్తం సంగతేందో చూడు చంద్రబాబు

By:  Tupaki Desk   |   4 Oct 2015 5:54 AM GMT
ముహుర్తం సంగతేందో చూడు చంద్రబాబు
X
అసాధ్యాల్ని సుసాధ్యం చేసే సత్తా తమ నాయకుడికే ఉందని చెప్పుకుంటారు తెలుగుదేశం పార్టీ నేతలు. హైటెక్ సిటీనే కాదు.. అమరావతిని కూడా అద్భుతంగా నిర్మించాక.. చంద్రబాబు సత్తా ఏమిటో ప్రపంచానికి మరోసారి తెలుస్తుందని గొప్పలు చెప్పుకుంటారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే.. కీలక కార్యక్రమాలకు సంబంధించి నిర్ణయించే ముహుర్తాల విషయంలో తరచూ వివాదాలు చోటు చేసుకుంటుంటాయి.

గోదావరి మహా పుష్కరాల మీద ఇలానే జరిగింది. ఇక.. రాజధాని భూమిపూజకు సంబంధించి పెట్టిన ముహుర్తం మీద కూడా ఇదే పరిస్థితి. అప్పుడు నిర్ణయించిన ముహుర్తం మీద చాలానే వాదనలు వినిపించాయి. పలువురు.. సదరు ముహుర్తాన్ని తప్పు పట్టారు కూడా. ఇదిలా ఉంటే విజయదశమి రోజున శంకుస్థాపన కార్యక్రమానికి నిర్ణయించిన ముహుర్తం మీద కూడా భిన్నవాదనలు మొదలయ్యాయి. అసాధ్యాల్ని సుసాధ్యాలు చేసే చంద్రబాబు.. అందరికి ఆమోదయోగ్యమైన ముహుర్తాలు పెట్టే విషయంలో ఎందుకు విఫలమవుతుంటారో..?

ఇక.. రాజధాని శంకుస్థాపనకు నిర్ణయించిన ముహుర్తం విషయంలో పలువురు జ్యోతిష్యులు చెబుతున్న అభ్యంతరాలు చూస్తే.. విజయదశమి రోజున శంకుస్థాపన చేయటాన్ని ఎవరూ తప్పు పట్టకున్నా.. ముహుర్త సమయంలో విషయంలోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మధ్యాహ్నం 12.35 గంటల నుంచి 12.45 గంటల మధ్యలో శంకుస్థాపన ఉంటుందని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ముహుర్తారన్ని చంద్రబాబు వ్యక్తిగత జ్యోతిష్యుడు రేపల్లె సిద్ధాంతితో ముహుర్తం పెట్టించినట్లుగా చెబుతున్నారు.

అయితే.. ప్రభుత్వం నిర్ణయించిన ముహుర్తం.. ప్రమాదకరం.. స్థిరత్వం లేనిదిగా తాడేపల్లి గూడెనికి చెందిన జ్యోతిష్యుడు శ్రీరామకృష్ణ శర్మ హెచ్చరిస్తున్నారు. మకర లగ్నంలో కాకుండా.. ధనుర్ లగ్నంలో ముహుర్తం పెట్టాలని సూచిస్తున్నారు. విజయవాడకు చెందిన జ్యోతిష్యుడు కూడా ముహుర్తాన్ని తప్పు పడుతున్నారు. ఇంత పెద్ద కార్యక్రమానికి సంబంధించిన ముహుర్తం విషయంలో ప్యానల్ ఒకటి ఏర్పాటు చేసి.. నిర్ణయించి ఉంటే బాగుండేదన్న భావన వ్యక్తమవుతోంది.

ఇదిలా ఉంటే.. మరికొందరు చిత్రమైన వాదనను వినిపిస్తున్నారు. అమరావతి శంకుస్థాపన ముహుర్తం ఎవరు పెట్టారో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ముహుర్తం ఎవరు పెట్టినా అందరూ ఆమోదించేదిగా ఉండాలి. ఒక రాజధాని నగర నిర్మాణ ముహుర్తం అయినందున.. మరిన్ని జాగ్రత్తలు తీసుకొని భిన్నాభిప్రాయాలు లేకుండా నిర్ణయం తీసుకొని ఉంటే బాగుండేదేమో. మరి.. ముహుర్తం విషయంలో చంద్రబాబు దృష్టి బాగుంటుందేమో.