Begin typing your search above and press return to search.

సీఎం కేసీఆర్ అలా చేయకుంటే తిప్పలేనంటూ తేల్చేసిన జ్యోతిష్యులు

By:  Tupaki Desk   |   1 Sep 2022 4:19 AM GMT
సీఎం కేసీఆర్ అలా చేయకుంటే తిప్పలేనంటూ తేల్చేసిన జ్యోతిష్యులు
X
జాతకాల మీదా జ్యోతిష్యం మీద తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు నమ్మకం ఎంతన్న విషయం తెలిసిందే. వాస్తు మీదా.. కొన్ని నమ్మకాల మీదా.. మహుర్త బలం మీదా ఆయనకంటూ ప్రత్యేకమైన నమ్మకాలు చాలానే ఉన్నాయి. కొన్ని విషయాల్లో తాను నమ్మిన జ్యోతిష్యుల మాటను తూచా తప్పకుండా పాటిస్తారని చెబుతారు. ఇలాంటి వేళ.. ఆయన కలల పంటగా చెప్పుకునే కొత్త సచివాలయానికి సంబంధించి కేసీఆర్ కు కొత్త టెన్షన్ షురూ అయినట్లుగా చెబుతున్నారు.

తాను అధికారంలోకి వచ్చిన నాటి నుంచి తాను ఉండే ఇల్లు.. తాను పని చేయాల్సిన కార్యస్థలం (సెక్రటేరియట్) మీదా కొన్ని నిశ్చిత అభిప్రాయాలు ఉండటం.. అందుకు తగ్గట్లే ముఖ్యమంత్రి అధికారిక నివాసమైన ప్రగతిభవన్ ను నిర్మించే విషయంలో ఆయన ఎంతలా తపించారో తెలిసిందే. ప్రగతిభవన్ ను యుద్ద ప్రాతిపదికన పూర్తి చేసిన ఆయన.. ఇప్పుడు అందులోనే నివాసం ఉండటం తెలిసిందే. కొత్త వాటి విషయంలో కాస్తంత మోజు ప్రదర్శించే కేసీఆర్.. తాను అనుకున్న రీతిలో సచివాలయాన్ని నిర్మించటం కోసం ఆయన చేసిన కసరత్తు అంతా ఇంతా కాదు.

పలు ప్రయత్నాలు చేపట్టి.. అవన్నీ విఫలమైన తర్వాత.. పాత సెక్రటేరియట్ ను మొత్తంగా కూలగొట్టి.. నేలమట్టం చేసి.. తాజాగా భారీ ఎత్తున నిర్మిస్తున్న విషయం తెలిసిందే. వందల కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్న కొత్త సచివాలయాన్ని ఈ దసరాకు పూర్తి చేయాలన్న లక్ష్యం పెట్టుకున్న విషయం తెలిసిందే. రూ.వెయ్యి కోట్లకు పైగా బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ కొత్త సచివాలయానికి సంబంధించి తాజాగా జ్యోతిష్యులు చెప్పిన ఒక మాట సీఎం కేసీఆర్ కు కొత్త టెన్షన్ గా మారినట్లుగా చెబుతున్నారు.

ఎట్టి పరిస్థితుల్లో సెక్రటేరియట్ ను దసరా నాటిని ప్రారంభించి.. అందులో 90 రోజుల పాటు పాలన చేసిన తర్వాతే ఎన్నికలకు వెళ్లాలని.. అలా చేస్తే ఆయనకు తిరుగు ఉండదని చెబుతున్నారు. సెక్రటేరియట్ కు వెళ్లి ... అక్కడి నుంచి పాలన చేసే విషయంలో సీఎం కేసీఆర్ కున్న అభిప్రాయాల గురించి తెలిసిందే. గతంలో ఇదే అంశంపై మాట్లాడుతూ.. సీఎం ఎక్కడ ఉంటే అక్కడే సచివాలయం అన్న మాటపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చి పడినా పట్టించుకోలేదు.

గడిచిన ఎనిమిదేళ్లలో ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తూ సచివాలయానికి ఎనిమిది సార్లు కూడా వెళ్లలేదన్న మాట వినిపిస్తూ ఉంటుంది. తాజాగా నిర్మిస్తున్న భారీ సచివాలయం అనుకున్నట్లుగా దసరాకు పూర్తి అవుతుందా? అన్నదే ప్రశ్నగా మారింది. దసరాకు మరో 20 రోజులు మాత్రమే సమయం ఉండటం.. ఆలోపు పనులు పూర్తి చేయాలన్న పట్టుదలతో ఉన్నట్లు చెబుతున్నారు.

ఒకవేళ.. దసరా నాటికి పూర్తి కాకున్నా.. తన ఛాంబర్ వరకు పూర్తిగా సిద్దం చేయించాలన్న యోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. జ్యోతిష్యులు తనకు చేసిన సూచనలకు తగ్గట్లు.. సచివాలయాన్ని పూర్తి చేసి.. దాన్ని ప్రారంభించి 90 రోజుల పాలన మీద ఇప్పుడు ఫోకస్ పెట్టినట్లు చెబుతున్నారు. అయితే.. పనులు పూర్తి అంత తేలిక కాదని.. ఇప్పుడిదే అంశం ఆయనకు టెన్షన్ గా మారినట్లుగా తెలుస్తోంది. మరేం చేస్తారో చూడాలి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.