Begin typing your search above and press return to search.

భూమి వైపు దూసుకొస్తున్న భారీ ఆస్టరాయిడ్.. నాసా అలర్ట్..!

By:  Tupaki Desk   |   29 Dec 2022 5:13 PM GMT
భూమి వైపు దూసుకొస్తున్న భారీ ఆస్టరాయిడ్.. నాసా అలర్ట్..!
X
విశ్వంలో మనకు తెలియని ఎన్నో అంతుచిక్కని రహస్యాలు ఉన్నాయి. వీటిలో కొన్నింటిని మాత్రమే సైంటిస్టులు కనుక్కోగలిగారు. విశ్వం పుట్టుకపై ఎన్నో ఏళ్లుగా పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే సూర్యుడు.. భూమి.. చంద్రుడు.. నవగ్రహాలు.. వాటి ఉపగ్రహాలు.. పాలపుంత నక్షత్ర మండలంలోని కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

అనంత విశ్వంలో ఇప్పటి వరకు ఒక్క భూమిపైనే జీవుల మనుగడ సాధ్యమని తేలింది. అలాగే మనలాంటి జీవులు ఈ విశ్వం ఎక్కడైనా ఉండకపోరా? అనే పరిశోధనలు సైతం ఎప్పటి నుంచో కొనసాగుతున్నాయి. అయితే ఇప్పటి వరకు వీటికి సంబంధించిన ఆధారాలు మాత్రం దొరకలేదు. ఇదిలా ఉంటే భూమిపైకి చాలా అరుదుగా గ్రహశకలాలు(ఆస్టరాయిడ్స్) దూసుకు వస్తున్నాయి.

వీటిలో కొన్ని ఆస్టరాయిడ్స్ భూమి వాతావరణంలోకి రాగానే ఆ వేడిని తట్టుకోలేక మధ్యలో బస్ట్ అవుతుంటాయి. మరికొన్ని మాత్రం భూమిని బలంగా తాకడం వల్ల ఆ ప్రాంతంలో భారీ నష్టాన్ని కలుగజేస్తుంటాయి. ఆస్టరాయిడ్ భూమిని తాకితే పెను ముప్పు తప్పదని సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలోనే భూమి వైపు వచ్చే గ్రహశకలాలను తప్పించేందుకు సైంటిస్టులు ప్రయోగాలు చేపడుతున్నారు.

అంతరిక్షం నుంచే దూసుకొచ్చే ఆస్టరాయిడ్స్ ను.. అందులోనూ భూమిని ఢీకొట్టే అవకాశం ఉన్న వాటిని దారి మళ్ళించడం.. లేదంటే వాటిని నాశనం చేయడం కోసం నాసా ‘డార్ట్’ పేరిట ప్రయోగం చేపట్టి విజయం సాధించింది. అయితే ముందస్తు హెచ్చిరికలు.. సమయం ఉంటేనే ఆస్టరాయిడ్స్ దారి మళ్ళించడం లేదంటే ఢీ కొట్టించడానికి స్పేస్ షిప్ లను ప్రయోగించడం వీలవుతుందని నాసా చెబుతోంది.

కాగా డిసెంబర్ 30న ఆస్టరాయిడ్ 2022 వైజీ 5 భూమి వైపు దూసుకొస్తుందని సైంటిస్టులు ప్రకటించారు. భూమికి సమీపంగా 3.1మిలియన్ కిలోమీటర్ల దూరంలో ఇది ప్రయాణిస్తుందని అంచనా వేశారు. గంటకు 51వేల 246 కిలో మీటర్ల వేగంతో ఇది ప్రయాణిస్తుందని.. ఈ వేగం హైపర్ సోనిక్ బాలిస్టిక్ మిస్సైల్ ప్రయాణ వేగం కంటే ఐదు రేట్లు ఎక్కువని నాసా వెల్లడించింది. ఇది భూమిని ఢీ కొడితే మాత్రం అత్యంత ప్రమాదం జరిగే అవకాశం ఉందని నాసా హెచ్చరిస్తోంది.

కాగా ఈ ఆస్టరాయిడ్ ను నాసా డిసెంబర్ 24 నే గుర్తించింది. ఈ గ్రహశకలం అపోలో గ్రూప్ కు చెందినదని.. సూర్యుడికి గరిష్టంగా 398 మిలియన్ కిలోమీటర్ల దూరం.. కనిష్టంగా 119 కిలో మీటర్ల దూరంలో ప్రయాణిస్తుందని నాసా గుర్తించింది. ఈ గ్రహశకలం సూర్యుడి చుట్టూ ఒకసారి భ్రమణం చేయడానికి 829 రోజులు పడుతుందని పేర్కొన్నారు.

ఈ ఆస్టరాయిడ్ భూమి వైపు దూసుకొస్తున్న క్రమంలోనే నాసా సైంటిస్టులు దీనిని ‘డార్ట్’ ప్రయోగంతో దారిని మళ్లించాలని చూస్తున్నారు. ఈ క్రమంలోనే నాసా అలర్ట్ అయినట్లు తెలుస్తోంది. కాగా ఇప్పటి వరకు నాసా మాత్రమే డార్ట్ ప్రయోగం చేపట్టగా చైనా సైతం 2025 నాటికి గ్రహశకలాలను మళ్లింపు పరీక్షించాలని ప్రయత్నాలు చేస్తోంది.