Begin typing your search above and press return to search.

నయిం ఎన్ కౌంటర్ తర్వాత.. పోలీసులు స్వాధీనం చేసుకున్న లిస్టు ఇప్పటికి బయటకు

By:  Tupaki Desk   |   15 Dec 2020 1:00 PM IST
నయిం ఎన్ కౌంటర్ తర్వాత.. పోలీసులు స్వాధీనం చేసుకున్న లిస్టు ఇప్పటికి బయటకు
X
సామాన్యుడి చేతిలో పాశుపతాస్త్రంగా అభివర్ణించే సమాచార హక్కు చట్టంలో భాగంగా ఒకకొత్త విషయం బయటకు వచ్చింది. ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ సంస్థ చేసిన ప్రయత్నంతో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ నయిం ఎన్ కౌంటర్ తర్వాత పోలీసు వర్గాలు అతనికి సంబంధించిన బోలెడన్ని ఆస్తుల్ని.. ఆయుధాల్ని సీజ్ చేసినట్లు చెబుతారు. అయితే.. అధికారికంగా ఏమేం స్వాధీనం చేసుకున్నారన్న దానికి లెక్క లేదు. తాజాగా ఆ లెక్క బయటకు వచ్చింది.

2016 ఆగస్టు ఎనిమిది జరిగిన నయిం ఎన్ కౌంటర్ అనంతరం నార్సింగ్ లోని అతడి ఇంటితో పాటు.. వివిధ ప్రాంతాల్లో అతనికి ఉన్న స్థావరాలు.. బినామీల ఇళ్లల్లో పోలీసులు దాడులుచేసి పలురికార్డుల్ని స్వాధీనం చేసుకున్నారు. ఏమేం పట్టుకున్నారన్న అంశానికి సంబంధించిన అధికారిక వివరాలు ఇప్పటివరకు వెల్లడి కాలేదు. ఈ నేపథ్యంలో సహ చట్టం ద్వారా సమాచారాన్ని సేకరించారు. అధికారిక వర్గాలు అందించిన సమాచారం విస్తుపోయేలా ఉంది. సహ చట్టం కింద దాఖలు చేసుకున్న దరఖాస్తుకు వెస్ట్ జోన్ ఐజీ నాగిరెడ్డి వివరాలు ఇచ్చారు. ఆ వివరాలు ఇప్పుడు సంచలనంగా మారాయి.

మూడు ఏకే 47రైఫిళ్లు.. తొమ్మిది పిస్టళ్లు.. మూడు రివాల్వర్లు.. ఏడు తపంచాలు.. ఒక ఎస్ బీబీఎల్ 12 బోర్ గన్.. ఒక స్టెన్ గన్.. 616 లైవ్ రౌండ్లు.. ఒక బుల్లెట్ ఫ్రూప్ జాకెట్.. 21 కార్లు.. 26 టూవీలర్లు.. 602 సెల్ ఫోన్లతో పాటు.. రూ.2.16 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. అంతేకాదు.. రెండుకేజీల బంగారం.. 2,482 కేజీల వెండితోపాటు 752 భూ దస్తావేజులు.. 130 డైరీలు.. పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలు ఈ జాబితాలో ఉన్నట్లుగా వెల్లడైంది. ఇదంతా చూస్తే.. ఒక భారీ డంప్ కు ఏ మాత్రం తీసిపోని విధంగా ఉండటం గమనార్హం.

ఆస్తుల లెక్క ఒకలా ఉంటే.. నయింకు ఇన్ని ఆస్తులు ఎలా సమకూరాయి? అన్నదిప్పుడు మిస్టరీగా మారింది. ఒక వ్యక్తి ఇన్ని ఆయుధాలు సమకూర్చుకోవటం అంత సులువు కాదని.. అందునా పోలీసుల డేగ కన్ను నుంచి తప్పించుకోవటం సాధ్యం కాదంటున్నారు. ఇదంతా చూస్తుంటే..పోలీసుల హస్తం లేకుండా సాధ్యం కాదంటున్నారు. అంతేకాదు.. 752 భూ దస్తావేజులు అతడి పేరిట ఉన్నాయంటే.. రిజిస్ట్రేషన్ అధికారుల సహకారం లేకుండా సాధ్యం కాదంటున్నారు. మొత్తానికి వ్యవస్థను మేనేజ్ చేస్తే.. ఎంత ఆరాచక శక్తిగా ఎదగవచ్చన్న విషయాన్ని నయిం ఫ్రూవ్ చేశారని చెప్పక తప్పదు.