Begin typing your search above and press return to search.

ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిపై హత్యాయత్నం.. త్రుటిలో తప్పించుకున్న వైనం

By:  Tupaki Desk   |   8 Aug 2021 4:15 AM GMT
ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిపై హత్యాయత్నం.. త్రుటిలో తప్పించుకున్న వైనం
X
సంచలన వ్యాఖ్యలతో అప్పుడప్పుడు వార్తల్లో నిలిచే త్రిపుర ముఖ్యమంత్రి బిప్లవ్ కుమార్ దేబ్ పై తాజాగా హత్యాయత్నం జరిగింది. క్షణంలో వెయ్యో వంతు అన్నట్లుగా.. రెప్పపాటులో స్పందించిన సీఎం.. తనపై జరుగుతున్న అటాక్ ను గుర్తించి తప్పించుకోగలుగుతున్నారు. చుట్టూ సెక్యురిటీ ఉన్నప్పటికీ.. వాటిని చేధించుకునేలా చేసిన ప్లాన్ ఇప్పుడు షాకింగ్ గా మారింది.

కాస్త ఆలస్యంగా బయటకు వచ్చిన ఈ ఉదంతంలోకి వెళితే.. గురువారం సాయంత్రం ముఖ్యమంత్రి బిప్లవ్ కుమార్ మీద హత్యాయత్నం జరిగింది. సాయంత్రం వేళలో.. తన అధికార నివాసం నుంచి వాకింగ్ కు వెళ్లినప్పుడు గుర్తు తెలీని ముగ్గురు వ్యక్తులు కారుతో ఆయన్ను బలంగా ఢీ కొట్టే ప్రయత్నం చేశారు. చుట్టూ సెక్యురిటీ ఉన్న వేళలోనే.. ఆయన్ను చంపేందుకు ప్రయత్నించటం సంచలనమైంది. అయితే.. కారు ఢీ కొట్టేందుకు వస్తుందన్న విషయాన్ని గుర్తించిన వెంటనే స్పందించిన ముఖ్యమంత్రి వేగంగా పక్కకు జరిగారు. దీంతో.. పెను ప్రమాదం త్రుటిలో తప్పినట్లైంది.

హత్యాయత్నానికి పాల్పడిన వారిని అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించారు. కాస్త కష్టంతో వారిని పట్టుకోగలిగారు. కారులో ఉన్న ముగ్గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని విచారిస్తున్నారు. ఈ కుట్ర వెనుక ఉన్నదెవరన్న విషయాన్ని తేల్చేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ముఖ్యమంత్రిపై హత్యాయత్నానికి పాల్పడిన వారికి సుమారు 20 ఏళ్లు ఉంటాయని అంచనా వేస్తున్నారు. హత్యాయత్నానికి వారెందుకు పాల్పడ్డారన్న విషయంపై విచారణ జరుగుతోంది. వీరిని కోర్టుకు సబ్ మిట్ చేయగా.. పద్నాలుగు రోజుల పాటు జ్యడీషియల్ రిమాండ్ ను విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇదిలా ఉండగా.. ఈ ఉదంతంలో ఒక భద్రతా అధికారి గాయపడ్డారు.

కొద్ది రోజుల క్రితమే జార్ఖండ్ లోని ధన్ బాద్ లో అదనపు జిల్లా జడ్జిగా బాధ్యతలు నిర్వహిస్తునన ఎడిజే ఉత్తం ఆనంద్ కూడా ఇదే రీతిలో హత్యకు గురి కావటం గమనార్హం. ఒంటరిగా వాకింగ్ చేసే అలవాటు ఉన్న ఆయన్ను..ఆటోతో గుద్దేశారు. దీంతో.. ఆయన రోడ్డు మీద మరణించారు. ప్రమాదవశాత్తు జరిగినట్లుగా తొలుత భావించినా.. సీసీ కెమేరా ఫుటేజ్ బయటకు వచ్చిన తర్వాత ఇది ప్రమాదం కాదు.. హత్య అన్న విషయాన్నిగుర్తించారు. దాదాపు ఇదే తరహాలో తాజాగా త్రిపుర సీఎం మీద హత్యాయత్నం జరిగిందని చెప్పాలి. న్యాయమూర్తిని చంపేందుకు ఆటోను వినియోగిస్తే.. సీఎంను హతమార్చటానికి కారును ప్రయోగించటం గమనార్హం.