Begin typing your search above and press return to search.

వరల్డ్ కప్ లో ముగిసిన ఆసియా సింహాల పోరాటం

By:  Tupaki Desk   |   6 Dec 2022 11:38 AM GMT
వరల్డ్ కప్ లో ముగిసిన ఆసియా సింహాల పోరాటం
X
ఫిఫా ప్రపంచ కప్ ఫుట్ బాల్ లో ఆసియా సింహాలు.. దక్షిణ కొరియా, జపాన్ పోరాటం ముగిసింది. అంతేకాదు ఈ ప్రతిష్ఠాత్మక టోర్నీలో ఆసియా జట్ల ప్రస్థానమూ ముగిసింది. సంచలన ప్రదర్శనతో ప్రి క్వార్టర్స్ కు చేరుకున్న ఈ రెండు జట్లూ అనూహ్యంగా బలమైన ప్రత్యర్థుల చేతిలో పడ్డాయి. జపాన్.. క్రొయేషియా లాంటి ప్రమాదకర జట్టును ఎదుర్కొనగా, దక్షిణ కొరియా ఏకంగా దిగ్గజం బ్రెజిల్ కు ఎదురువెళ్లాల్సి వచ్చింది.

అయితే, జపాన్ తమ శక్తివంచన లేకుండా క్రొయేషియాతో పోరాడింది. కొరియా మాత్రం పెద్దన్న బ్రెజిల్ చేతిలో పరాభవం ఎదుర్కొంది. సోమవారం అర్థరాత్రి జరిగిన మ్యాచ్ లో బ్రెజిల్ ప్రతి పదినిమిషాలకో గోల్‌ కొట్టి కొరియాను మట్టికరిపించింది. ఈ మ్యాచ్‌ పూర్తి ఏకపక్షంగా సాగింది. గ్రూప్‌ దశలో గాయపడి విశ్రాంతి తీసుకొన్న బ్రెజిల్ స్టార్‌ ఆటగాడు నెయ్‌మార్‌ పునరాగమనం చేయడంతోపాటు ఓ గోల్‌ కూడా సాధించాడు.

ఫస్ట్ హాఫ్ లోనే..

బ్రెజిల్ తో మ్యాచ్ లో తొలి అర్ధభాగంలోనే నాలుగు గోల్స్‌ కొట్టింది. ఆ జట్ట ఆటగాళ్లు ప్రత్యర్థి గోల్‌పోస్టును కకావికలం చేశారు. మ్యాచ్‌ మొదలైన ఏడు నిమిషాలకే బ్రెజిల్‌ వింగర్‌ ఆటగాడు వినిసియస్‌ అద్భుతమైన కిక్‌తో గోల్‌ అందించాడు. 13వ నిమిషంలో దక్షిణ కొరియా ఆటగాడు జుంగ్‌ ఊ యంగ్‌ పొరపాటు చేయడం పరిస్థితిని మరింత ఇబ్బందిగా మార్చింది. అతడి కిక్‌ రిచర్లీసన్‌కు తాకడంతో బ్రెజిల్ కు పెనాల్టీ లభించింది.

దీనిని నెయ్‌మార్‌ గోల్‌గా మలిచాడు. టోర్నీలో భీకరమైన ఫామ్‌లో ఉన్న రిచర్లీసన్‌ 29వ నిమిషంలో థియాగో సిల్వా నుంచి వచ్చిన పాస్‌ను అద్భుతమైన గోల్‌గా మలిచాడు. మరో ఏడు నిమిషాలకు లూకస్‌ పకీటా నాలుగో గోల్‌ చేశాడు. అలా ఫస్ట్ హాఫ్ లోనే బ్రెజిల్‌ మ్యాచ్‌ను పూర్తిగా లాగేసుకొంది.

కొరియా తిరగబడ్డా..

ద్వితీయార్థం మొత్తం దక్షిణ కొరియా దాడులు చేస్తూనే ఉంది. కానీ, బ్రెజిల్‌ ఎక్కడా ఆత్మరక్షణ శైలిలో ఆడినట్లు కనిపించలేదు. కాకపోతే ద్వితీయార్థంలో బ్రెజిల్‌ జట్టు మరో గోల్‌ చేయకుండా కొరియా ఆటగాళ్లు అడ్డుకొన్నారు. మ్యాచ్‌ 76వ నిమిషంలో కొరియా ఆటగాడు కిమ్‌ సెయూంగ్‌ గ్యూ జట్టుకు తొలిగోల్‌ అందించి పరువు కాపాడాడు. మ్యాచ్‌ అనంతరం బ్రెజిల్‌ ఆటగాళ్ల సంబరాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. క్వార్టర్‌ఫైనల్స్‌లో బ్రెజిల్‌ జట్టు కొయేషియాతో తలపడనుంది. కాగా, అంతకుముందు జరిగిన ప్రి క్వార్టర్స్ లో క్రొయేషియా పెనాల్టీ షూటౌట్ లో జపాన్ ను 3-1తో ఓడించింది. మ్యాచ్ నిర్ణీత సమయానికి ఇరు జట్లూ చెరో గోల్ చేసి 1-1తో సమంగా నిలిచిచాయి. అదనపు సమయంలోనూ గోల్ నమోదు కాలేదు. దీంతో పెనాల్టీ షూటౌట్ తప్పలేదు.

అక్కడ విఫలమై..

ఎక్స్‌ట్రా టైమ్‌లో జపాన్‌ గోల్‌ చేసినంత పని చేసింది. మైదానం మధ్యలో బంతిని దొరకబుచ్చుకున్న మిటోమా 105వ నిమిషంలో ఒక్కో డిఫెండర్‌ను తప్పిస్తూ ఓ శక్తిమంతమైన షాట్‌ కొట్టాడు. కానీ దీన్ని క్రొయేషియా కీపర్‌ లివకోవిచ్‌ సమర్థంగా అడ్డుకున్నాడు. ఈ క్రమంలోనే జపాన్‌ ఆటగాళ్లు మరోసారి షాట్‌ కొట్టినా కీపర్‌ వారి ప్రయత్నాలకు అడ్డుపడ్డాడు. ఆ తర్వాత జపాన్‌ మరో విఫలయత్నం చేసింది. అదనపు సమయంలోనూ గోల్స్‌ కాకపోవడంతో మ్యాచ్‌ షూటౌట్‌కు మళ్లింది.

షూటౌట్లో తన తొలి రెండు ప్రయత్నాల్లో జపాన్‌ (మినామినో, మిటోమా) విఫలం కాగా.. క్రొయేషియా (వ్లాసిచ్‌, బ్రొజోవిచ్‌) సఫలమైంది. క్రొయేషియా గోల్‌కీపర్‌ లివకోవిచ్‌ జపాన్‌ తొలి రెండు పెనాల్టీను అడ్డుకున్నాడు. క్రొయేషియా 2-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. మూడో షాట్‌కు జపాన్‌ (తకూమా) గోల్‌ చేయగా.. క్రొయేషియా విఫలం (మార్కో) కావడంతో స్కోరు 1-2తో ఆసక్తికరంగా మారింది. కానీ నాలుగో ప్రయత్నంలో యొషిదా (జపాన్‌) విఫలం కాగా.. పెర్సీచ్‌ (క్రొయేషియా) గోల్‌ చేయడంతో క్రొయేషియా సంబరాల్లో మునిగిపోయింది.





నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.