Begin typing your search above and press return to search.

అశోక్ సింఘాల్ ఆఖ‌రి శ్వాస ఆగింది

By:  Tupaki Desk   |   17 Nov 2015 2:16 PM GMT
అశోక్ సింఘాల్ ఆఖ‌రి శ్వాస ఆగింది
X
క‌రుడుగ‌ట్టిన హిందుత్వ‌వాది.. విశ్వ‌హిందూ ప‌రిష‌త్ కు కేరాఫ్ అడ్ర‌స్ అయిన అశోక్ సింఘాల్ (89) ఆఖ‌రిశ్వాస ఆగిపోయింది. గ‌త కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధ ప‌డుతున్న ఆయ‌న మంగ‌ళ‌వారం మ‌ధ్యాహ్నం మ‌ర‌ణించారు. నిజానికి ఆయ‌న ఆరోగ్య ప‌రిస్థితి గ‌త కొద్దిరోజులుగా విష‌మంగా ఉంది. సోమ‌వారం ఆయ‌న ప‌రిస్థితి మ‌రింత దిగ‌జారిన‌ట్లుగా వార్త‌లు వ‌చ్చాయి. శ్వాస తీసుకోవ‌టంలో ఏర్ప‌డిన ఇబ్బందుల నేప‌థ్యంలో న‌వంబ‌రు 14న ఆయ‌న్ను గుర్ గావ్ లోని మేదాంత ఆసుప‌త్రిలో చేర్చి.. వెంటిలేట‌ర్ ద్వారా కృత్రిమశ్వాస అందించారు.మంగ‌ళ‌వారం మ‌ధ్యాహ్నం ఆయ‌న తిరిగిరాని లోకాల‌కు ప‌య‌న‌మ‌య్యారు.

హిందుత్వ వాదాన్ని బ‌లంగా వినిపించ‌టంతో పాటు.. కొన్ని సంద‌ర్భాల్లో ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు వివాదాస్ప‌దం అయ్యాయి. అగ్రాలో పుట్టి బెనార‌స్ హిందూ విశ్వ‌విద్యాల‌యంలో ఇంజ‌నీరింగ్ పూర్తి చేసిన ఆయ‌న‌.. 1942లో ఆర్ ఎస్ ఎస్ లో చేరారు. 1980 ప్రాంతంలో విశ్వ హిందూ ప‌రిష‌త్ కు ఉప కార్య‌ద‌ర్శిగా నియ‌మితులైన ఆయ‌న‌.. కొద్దికాలానికే ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి అయ్యారు. అనంత‌రం వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ గా వ్య‌వ‌హ‌రించిన ఆయ‌న‌.. రామ‌జ‌న్మ భూమి నినాదానికి.. అది జాతీయ స్థాయిలో ఒక నినాదంగా మార‌టానికి ఆయ‌నే కార‌ణంగా చెప్పొచ్చు. రామ‌జ‌న్మ‌భూమిలో దేవాల‌యాన్ని నిర్మించాల‌ని.. దాన్ని చూడాల‌ని ఆయ‌న ఎన్నో క‌ల‌లు క‌న్నారు. ఆయ‌న వైఖ‌రి కొన్ని వ‌ర్గాల‌కు అత్యంత ఆత్మీయుడిగా మారిస్తే.. మ‌రికొన్ని వ‌ర్గాలు మాత్రం ఆయ‌న్ను విప‌రీతంగా ద్వేషిస్తూ దూరంగా ఉంచేవి. అశోక్ సింఘాల్ మ‌ర‌ణంతో ఒక క‌రుడుగ‌ట్టిన హిందుత్వ వాది ఆ వ‌ర్గం కోల్పోయిన‌ట్లే. సింఘాల్ మృతి ప‌ట్ల ప్ర‌ధాని మోడీ స‌హా ప‌లువురు జాతీయ నేత‌లు సంతాపాన్ని వ్య‌క్తం చేశారు.