Begin typing your search above and press return to search.

డేటా చోరీ అప్ డేట్‌!..అశోక్ నోరిప్పాల్సిందేన‌ట‌!

By:  Tupaki Desk   |   11 March 2019 11:18 AM GMT
డేటా చోరీ అప్ డేట్‌!..అశోక్ నోరిప్పాల్సిందేన‌ట‌!
X
తెలుగు రాష్ట్రాల ప్ర‌చ్ఛ‌న్న యుద్ధానికి తెర లేపిన డేటా చోరీ కేసులో ఏపీలో అధికార పార్టీ టీడీపీకి గ‌ట్టి ఎదురు దెబ్బే త‌గ‌లింద‌ని చెప్పాలి. వైసీపీ ఫిర్యాదు మేర‌కు తెలంగాణ పోలీసులు త‌న‌పై న‌మోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ... ఈ కేసులో కీల‌క నిందితుడిగా ఉన్న ఐటీ గ్రిడ్ సీఈఓ దాక‌ర‌వ‌పు అశోక్ దాఖ‌లు చేసిన క్వాష్ పిటిష‌న్‌ ను కాసేప‌టి క్రితం తెలంగాణ హైకోర్టు వాయిదా వేసేసింది. తెలంగాణ పోలీసులు ఇచ్చిన నోటీసులకు వివ‌ర‌ణ ఇవ్వ‌కుండానే త‌న‌పై న‌మోదైన కేసును కొట్టి వేయాలంటూ ఎలా అడుగుతారంటూ అశోక్ ను కోర్టు ప్రశ్నించింది.

అంతేకాకుండా కోర్టుల చుట్టూ తిర‌గ‌డానికి బ‌దులుగా ముందుగా తెలంగాణ పోలీసుల నోటీసుల‌కు వివ‌ర‌ణ ఇచ్చే య‌త్నం చేయాల‌ని కూడా అశోక్‌ కు హైకోర్టు బ్ర‌యిన్ వాష్ చేసింది. త‌న కోసం తెలంగాణ సిట్ కు చెందిన రెండు బృందాలు గాలిస్తుండ‌గా... వాటికి త‌న ఆచూకీ దొర‌క‌కుండా త‌ప్పించుకుంటున్న అశోక్‌... త‌న త‌ర‌ఫు న్యాయ‌వాది ద్వారా క్వాష్ పిటిష‌న్ దాఖ‌లు చేయించిన సంగ‌తి తెలిసిందే. ఈ పిటిష‌న్‌ పై నేడు విచార‌ణ చేప‌ట్టిన హైకోర్టు ధ‌ర్మాస‌నం... పోలీసులు ఇచ్చిన నోటీసుల‌కు వివ‌ర‌ణ ఇచ్చేందుకు ఇబ్బందేమిట‌ని అశోక్ త‌ర‌ఫు లాయ‌ర్‌ ను ప్ర‌శ్నించింది. అంతేకాకుండా త‌క్ష‌ణ‌మే పోలీసుల‌కు వివ‌ర‌ణ ఇవ్వాల‌ని కూడా కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

తాము వేసిన పిటిష‌న్‌ ను కొట్టివేయ‌డంతో పాటుగా పోలీసుల నోటీసుల‌కు స్పందించాల‌ని కోర్టు చెబితే... ఇప్ప‌టికిప్పుడు తాము తెలంగాణ పోలీసుల నోటీసుల‌కు వివ‌ర‌ణ ఇవ్వ‌లేమ‌ని అశోక్ త‌ర‌ఫు న్యాయ‌వాది నేరుగా కోర్టుకే చెప్పేశారు. ఈ నేప‌థ్యంలో ఈ పిటిష‌న్ పై విచార‌ణ‌ను కోర్టు ఈ నెల 20కి వాయిదా వేసింది. ఇదిలా ఉంటే... అశోక్ త‌న లాయ‌ర్ ద్వారా హైకోర్టులో కొత్త వాద‌న‌ను వినిపించారు. ఈ కేసు తెలంగాణ పరిధిలోకి రాదని - ఏపీకి బదిలీ చేయాలని ఆయ‌న ధ‌ర్మాస‌నాన్ని కోరారు. అయితే ఈ వాదనతో హైకోర్టు ధర్మాసనం ఏకీ భవించలేదు. మొత్తంగా అశోక్ క్వాష్ పిటిష‌న్‌ పై విచార‌ణ‌ను వాయిదా వేయ‌డంతో పాటుగా పోలీసులు ఇచ్చిన నోటీసుల‌కు వివ‌ర‌ణ ఇవ్వాల‌ని కోర్టు ఆదేశాలు జారీ చేయ‌డంతో ఇప్పుడేం చేయాలో పాలుపోక ఇటు అశోక్ తో పాటు... ఆయ‌న సేవ‌ల‌ను తీసుకుంటున్న టీడీపీ కూడా అయోమ‌యంలో ప‌డిపోయాయ‌ని చెప్పాలి.