Begin typing your search above and press return to search.

ఖేమ్కా... బ‌దిలీల‌కు కేరాఫ్ అడ్రెస్సేనా?

By:  Tupaki Desk   |   13 Nov 2017 11:20 AM GMT
ఖేమ్కా... బ‌దిలీల‌కు కేరాఫ్ అడ్రెస్సేనా?
X
అవినీతిప‌రుల పాలిట సింహ‌స్వ‌ప్నంగా పేరొందిన సీనియ‌ర్‌ ఐఏఎస్ అధికారి అశోక్ ఖేమ్కా మ‌రోసారి బ‌దిలీ అయ్యారు. 30 ఏళ్ల కెరీర్‌లో 45సార్లు బ‌దిలీ.. ఇది చాలు ఖేమ్కా వ్య‌క్తిత్వం ఎలాంటిదో వివ‌రించ‌డానికి. తాజాగా ఆయ‌న మ‌రోసారి బ‌దిలీ కావ‌డం వార్త‌ల్లో నిలుస్తోంది. 2012లో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ అల్లుడు రాబ‌ర్ట్ వాద్రా-డీఎల్ ఎఫ్ భూ కేటాయింపులను ర‌ద్దు చేస్తూ ఆయ‌న తీసుకున్న‌నిర్ణ‌యంతో ఒక్క‌సారిగా క‌ల‌క‌లం స‌ృష్టించారు. ప్ర‌స్తుతం ఆయ‌న హ‌ర్యానా ప్ర‌భుత్వంలో సామాజిక న్యాయం, సాధికార‌త శాఖ ముఖ్య కార్య‌ద‌ర్శిగా ఉన్నారు. తాజాగా 13మంది ఐఏఎస్ అధికారుల‌ను బ‌దిలీ చేస్తూ మ‌నోహ‌ర్ లాల్ ఖ‌ట్ట‌ర్ ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకోవ‌డంతో ఆయ‌న‌పైనా బ‌దిలీ వేటు ప‌డింది. ఆయ‌న‌ను క్రీడ‌లు, యువ‌జ‌న స‌ర్వీసుల శాఖ ముఖ్య కార్య‌ద‌ర్శిగా బ‌దిలీ చేస్తూ ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీచేసింది.

1991 ఐఏఎస్ బ్యాచ్‌ కు చెందిన ఖేమ్కాకు మొద‌టి నుంచీ నిజాయితీప‌రుడైన అధికారిగా పేరుంది. గతంలో కాంగ్రెస్ ప్ర‌భుత్వ హ‌యాంలో అవినీతిని ప్ర‌శ్నించినందుకు బ‌దిలీల‌ను బ‌హుమ‌తులుగా పొందిన అశోక్ ఖేమ్కా.. బీజేపీ ప్ర‌భుత్వంలోనైనా త‌న నిజాయితీకి త‌గిన గుర్తింపు ల‌భిస్తుంద‌ని భావించారు. అయితే తానొక‌టి త‌లిస్తే దైవం మ‌రొక‌టి త‌ల‌చింద‌న్న చందంగా ఆయ‌న ఊహించ‌ని ట్విస్ట్ ఎదురైంది. హ‌ర్యానా ప్ర‌భుత్వంలో మంత్రిగా ఉన్న క‌ృష్ణ‌కుమార్ బేడీ ఉప‌యోగిస్తున్న‌.. అంబాలా జిల్లా సాంఘిక సంక్షేమ అధికారికి చెందిన అధికారిక వాహ‌నాన్ని తిరిగి ఇచ్చాయాల‌ని ఆయ‌న ఆదేశించారు. ఇది జ‌రిగిన‌ నెల రోజుల త‌ర్వాత తాజా బ‌దిలీ అందుకోవ‌డం వెనుక రాజ‌కీయ ప్ర‌మేయం ఉంద‌న్న వాద‌న‌ల‌కు బ‌లం చేకూరుతోంది.

గ‌తంలో వాద్రా ఘ‌ట‌న‌లో ఆనాటి భూపేంద్ర హుడా నేత‌ృత్వంలోని కాంగ్రెస్ ప్ర‌భుత్వం వాద్రా ప్ర‌తిష్ఠ‌కు భంగం వాటిల్లేలా ప్ర‌వ‌ర్తించారంటూ ఖేమ్కాపై విచార‌ణ‌కు సైతం ఆదేశించింది. అయినా అశోక్ ఖేమ్కా లొంగ‌లేదు. దీంతో ఆయ‌న‌పై క‌క్ష సాధింపు చ‌ర్య‌ల్లో భాగంగా బ‌దిలీ చేశార‌ని చెబుతారు. అనంత‌రం జ‌రిగిన ఎన్నిక‌ల్లో అధికారంలోకి వ‌చ్చిన బీజేపీ ప్ర‌భుత్వంలోనైనా ఖేమ్కాలాంటి నిజాయితీ ప‌రుల‌కు స్వేచ్ఛనిస్తార‌ని ప‌లువురు భావించారు. అయితే బీజేపీ కూడా రాజ‌కీయ‌పార్టీల తానులో తానూ ఓ ముక్క‌నేన‌ని నిరూపించుకుంద‌నే విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి.