Begin typing your search above and press return to search.

సొంత జిల్లాను స్టార్ ను చేస్తున్న కేంద్ర మంత్రి

By:  Tupaki Desk   |   18 April 2016 9:09 AM GMT
సొంత జిల్లాను స్టార్ ను చేస్తున్న కేంద్ర మంత్రి
X
కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు తన సొంత జిల్లాకు జాతీయస్థాయి గుర్తింపు తెస్తున్నారు. ఏపీలో ఉత్తరాంధ్ర జిల్లాలంటే వెనుకబడిన ప్రాంతాలని పేరుపడ్డాయి. స్వాతంత్ర్యానికి పూర్వం నుంచి శ్రీకాకుళం - విజయనగరం జిల్లాల నుంచి రాజకీయంగా కీలకంగా ఎదిగిన నేతలు ఉన్నప్పటికీ ఈ ప్రాంతానికి పెద్దగా ఏమీ చేయలేకపోయారు. గతంలోనూ ఈ జిల్లాల నుంచి కేంద్రమంత్రులుగా పనిచేసినవారు... ఉమ్మడి రాష్ట్రంలో కీలకమౌన రెవెన్యూ వంటి శాఖలు చేపట్టినవారు ఉన్నప్పటికీ ఉత్తరాంధ్ర అభివృద్ధికి ప్రత్యేకంగా దృష్టిపెట్టడం తక్కువే. అయితే... తాజాగా కేంద్ర మంత్రిగా ఉన్న అశోక్ గజపతి రాజు ఈసారి తన సొంత జిల్లా విజయనగరం అభివృద్ధిపైన - ప్రాచుర్యంపైన దృష్టిపెట్టినట్లుగా కనిపిస్తోంది. కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా ఉన్న ఆయన విజయనగరం జిల్లా భోగాపురంలో విమానాశ్రయాన్ని సాధించారు. నిధుల విషయంలోనూ విజయనగరానికి ఇప్పుడు అగ్రప్రాధాన్యం లభిస్తోందని తెలుస్తోంది. కేంద్ర మంత్రిగా అశోక్ తన పరపతిని ఉపయోగించి విజయనగరం పేరు జాతీయ స్థాయిలో వినిపించేలా మరో అవకాశం కల్పించారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రెండు అవార్డులు విజయనగరం జిల్లాకు రావడం వెనుక ఆయన పాత్ర ఉందని తెలుస్తోంది.

కేంద్ర ప్రభుత్వం విజయనగరం జిల్లాకు తాజాగా రెండు అవార్డులు ప్రకటించింది. సశక్తీకరణ పురస్కార్‌ అవార్డుకు విజయనగరం జిల్లా పరిషత్‌ ఎంపిక కాగా, మరో అవార్డు ద్వారంపూడికి రాష్ట్రీయ గౌరవ్‌ గ్రామసభ పురస్కార్‌ కు ఎంపికైంది. ద్వారపూడి గ్రామం అశోక్ దత్తత గ్రామం అన్న సంగతి తెలిసిందే. దత్తత గ్రామాన్ని ప్రత్యేకంగా అభివృద్ధి చేస్తున్న ఆయన దానికి కేంద్ర పురస్కారం కూడా లభించేలా చేయగలిగారు. కాగా ఈ రెండు అవార్డులను ప్రధాని మోడీ నుంచి అందుకునే అవకాశాన్ని ఆ జిల్లాకు చెందిన యువ నాయకురాలు ఒకరికి దక్కడం విశేషం. విజయనగరం జిల్లా పరిషత్, ద్వారపూడి గ్రామానికి దక్కిన పురస్కారాలను విజయనగరం జడ్పీ అధ్యక్షురాలు శోభా స్వాతిరాణి అందుకోబోతున్నారు. టీడీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు శోభా హైమావతి కుమార్తె అయిన స్వాతి విజయనగరం జిల్లా రాజకీయాల్లో ఇటీవల చురుగ్గా పాల్గొంటున్నారు. తాజాగా మోడీ నుంచి ఆమె ఈ అవార్డులు అందుకోనున్నారు.