Begin typing your search above and press return to search.

ఇస్లాం పేరుతో సిగ్గుమాలిన పనులు చేస్తారా?

By:  Tupaki Desk   |   27 Jun 2016 6:43 AM GMT
ఇస్లాం పేరుతో సిగ్గుమాలిన పనులు చేస్తారా?
X
జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి వార్తల్లోకి వచ్చారు. కలలో కూడా ఊహించని రీతిలో ఆమె ఆగ్రహం వ్యక్తం చేయటం.. ఆమె బోల్డ్ గా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారటమే కాదు.. ఉన్న విషయాన్ని ఉన్నట్లుగా మాట్లాడిన వైనానికి ఆమెను కొందరు అభినందిస్తుంటే.. మరికొందరు మాత్రం యథావిధిగా తప్పు పడుతున్నారు. ‘‘ఇస్లాం పేరుతో సిగ్గుమాలిన పనులు చేస్తారా? అది కూడా పవిత్ర రంజాన్ మాసంలో..’’ అంటూ అగ్గి బరాఠాలా ఫైర్ అయ్యారు. ఉన్నట్లుండి జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి మొహబూబా ముఫ్తీకి అంత ఆగ్రహం ఎందుకు వచ్చిందంటే.. అందుకు సముచిత కారణం లేకపోలేదు.

తాజాగా పైనికుల వాహనం మీద ఉగ్రవాదులు జరిపిన దాడిలో ఎనిమిది మంది మరణించిన సంగతి తెలిసిందే. ఇదే ఘటనలో మరో 25 మంది గాయపడ్డారు. ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన మొహబూబా ఉగ్రవాదుల తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మతం పేరుతో ఇలాంటి అనాగరిక హత్యలకు పాల్పడుతుంటే చూస్తూ ఊరుకునేది లేదన్న ఆమె.. ‘‘ఇస్లాం పేరుతో కొందరు ఇలాంటి సిగ్గుమాలిన పనులు ఎలా చేస్తారో అర్థం కావటం లేదు. పవిత్ర రంజాన్ మాసంలో ప్రజలంతా శాంతి.. క్షమలను కోరుకుంటుంటే.. ఇలా చేయటం ఏమిటి?’’ అని ప్రశ్నించారు.

ఉగ్రవాదులు జమ్మూకశ్మీర్ కు చెడ్డపేరు తీసుకొస్తున్నారని.. పర్యాటకులు ఈ ప్రాంతానికి రాకుండా చేస్తున్నారన్నారు. చాలా దేశాలు తమ పౌరులను కశ్మీర్ కు వెళ్లొద్దని చెబుతుంటాయని.. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేయటానికే తీవ్రవాదులు ఇలాంటి దారుణాలు చేస్తుంటారన్నారు. ఉగ్రవాదుల కారణంగా శాంతిని కోరుకునే మతానికి చెడ్డపేరు వస్తుందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

ముఫ్తీ చేసిన తాజా వ్యాఖ్యల్లో తనకు అవసరమైన వ్యాఖ్యల్ని మాత్రమే తీసుకున్న విపక్ష నేషనల్ కాన్ఫరెన్స్ వెంటనే రియాక్ట్ అయ్యింది. గతంలో ముఫ్తీ మాట్లాడుతూ.. ఉగ్రవాదానికి మతం లేదనే వారని.. ఇప్పుడు మాత్రం ఆమె ఉగ్రవాదానికి.. ఇస్లాంకు లింకు పెడుతున్నారంటూ తప్పు పట్టారు. ముఫ్తీ వైఖరికి ముస్లింలు సిగ్గుపడాలంటూ అగ్గి రాజేసే ప్రయత్నం ఆ పార్టీ చేసింది. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి నోటి నుంచి ఇలాంటి వ్యాఖ్యలు సిగ్గు చేటుగా ఆ పార్టీ అధికార ప్రతినిధి అజీమ్ మట్టు పేర్కొనటం గమనార్హం.