Begin typing your search above and press return to search.

జగన్ ను అసద్ రిక్వెస్ట్ చేశారా? ఆర్డర్ వేశారా?

By:  Tupaki Desk   |   10 Feb 2020 10:07 AM IST
జగన్ ను అసద్ రిక్వెస్ట్ చేశారా? ఆర్డర్ వేశారా?
X
ప్రజలు ఎన్నుకున్న చట్టసభలు చట్టాలు చేసిన తర్వాత.. అవి అమలు కాకూడదని గుప్పెడు పార్టీలు.. కొందరు పార్టీ అధినేతలు డిమాండ్లు చేయటం సముచితమేనా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. పౌరసత్వ సవరణ చట్టం మీద మోడీ సర్కారు తీసుకొచ్చిన చట్టాన్ని కొన్ని పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఆ కోవలోకే వస్తుంది మజ్లిస్. పౌరసత్వ చట్టాన్ని 2024 వరకు అమలు కాకుండా చూస్తామని మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ చెబుతున్నారు.

పౌరసత్వ చట్టాలతో దేశాన్ని హిందూ దేశంగా మార్చాలన్న కుట్ర జరుగుతుందంటూ తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. సీఏఏ.. ఎన్ ఆర్ సీ.. ఎన్ పీఆర్ లకు వ్యతిరేకంగా ఆయన కర్నూలులో గళం విప్పారు. ఎన్ ఆర్ సీ.. ఎన్ పీఆర్ లకు సంబంధం లేదని కేంద్రం చెబుతోందని.. కానీ రెండింటికి సంబంధం ఉందని ఆయన స్పష్టం చేస్తున్నారు. భవిష్యత్తు కోసమే తాము పోరాటం చేస్తున్నామని చెప్పే అసద్.. దేశంలోకి అక్రమంగా వచ్చే వారి గురించి ఎందుకు గళం విప్పరు?

సీఏఏ మీద తమకున్న అభ్యంతరాలపై అసద్ ఇప్పటి వరకూ స్పష్టంగా చెప్పింది లేదు. లేనిపోని భయాలు.. అనుమానాలతో ప్రజల్లో కలకలం రేగేలా చేస్తున్న ఆయన తీరుకు నిదర్శనంగా కర్నూలులో నిర్వహించిన సభగా చెప్పాలి. పౌరసత్వ సవరణ చట్టం కారణంగా దేశంలోని ముస్లింలకు.. ఇతరులకు కలిగే నష్టమేమిటో స్పష్టంగా చెప్పలేని అసద్.. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ చట్టాన్ని అమలు కాకుండా చేస్తామన్నారు.

బీజేపీ ప్రభుత్వం తమను కాల్చి చంపాలని చూసినా దేశం విడిచి వెళ్లేది లేదంటూ పెద్ద మాటలు మాట్లాడుతున్న అసద్.. అసలు ఆ ప్రస్తావన ఎందుకు తీసుకొస్తున్నారో చెప్పాలి? ముస్లింలు మెజార్టీలు గా ఉన్న కశ్మీర్ లో లక్షలాది మంది హిందువులను కట్టు బట్టలతో రోడ్ల మీదకు పంపినప్పుడు.. ఇదే అసద్ ఎక్కడున్నాడు? ఏం చేశాడు? అలా జరగకూడదన్న ఆందోళన ను ఒక్క సారైనా వ్యక్తం చేయని అసద్ లాంటోళ్లు.. కేవలం తమ ఓటు బ్యాంకును కాపాడుకోవటం కోసమే ఈ తరహా వ్యాఖ్యలు చేస్తుంటారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

పౌరసత్వ సవరణ చట్టం అమలు కాకుండా చర్యలు తీసుకోవాలని తాను ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ని కోరానని.. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ని కూడా తాము డిమాండ్ చేస్తున్నట్లు చెప్పారు. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఏం చేయాలో చెప్పిన అసద్ మాటలకు.. ఇద్దరు ముఖ్యమంత్రులు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.