Begin typing your search above and press return to search.

సజ్జనార్ ను ట్వీట్ కౌంటర్ చేసిన అసదుద్దీన్

By:  Tupaki Desk   |   8 Jan 2020 2:40 PM IST
సజ్జనార్ ను ట్వీట్ కౌంటర్ చేసిన అసదుద్దీన్
X
ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ కి, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ కు మధ్య ట్విట్టర్ వార్ కొనసాగింది. ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు అసుదుద్దీన్ దిమ్మదిరిగే పంచులతో సీపీ సజ్జనార్ ను ఉక్కిరిబిక్కిరి చేశారు.

ఇరాన్-అమెరికా మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారా? హైదరాబాద్ లోని సాఫ్ట్ వేర్ కంపెనీల్లో ఎవరైనా జిహాదీలు పనిచేస్తున్నారా? అని సురేష్ కొచ్చేటి అనే ఓ నెటిజన్ సీపీ సజ్జనార్ ను సూటిగా ప్రశ్నించాడు. దీనికి అవును అంటూ సజ్జనార్ సమాధానం ఇవ్వడం దుమారం రేపింది.

హైదరాబాద్ లో జిహాదీ లు ఉన్నారని సీపీ సజ్జనార్ పేర్కొనడాన్ని ఎంపీ అసదుద్దీన్ తప్పుపడుతూ ప్రశ్నించాడు. దీనిపై అసదుద్దీన్ ట్విట్టర్ లో ఘాటుగా రియాక్ట్ అయ్యారు. ‘సార్ మీరు హైదరాబాద్ లోని సాఫ్ట్ వేర్ కంపెనీల్లో జిహాదీలు ఎంత మంది పనిచేస్తున్నారో చెప్పగలరా అంటే ‘ఎస్’ అని చెప్పారు. ఎంతమంది జిహాదీలు ఉన్నారో చెప్పాలి? లేదంటే మీ ఉద్దేశమేంటో చెప్పండి’ అంటూ ట్వీట్ చేశారు. కేవలం మీ భక్తులకు మాత్రమే సమాధానం చెప్తారా? ఎంపీలకు సమాధానం చెప్పరా అని నిలదీశారు.

అయితే ఎంపీ అసదుద్దీన్ వేసిన ప్రశ్నలకు సీపీ సజ్జనార్ స్పందించ లేదు. దీంతో మరో ట్వీట్ లో సీపీ సజ్జనార్ పై ధ్వజమెత్తారు అసద్. ‘సార్ మీరేమైనా చేయండి. కానీ దిశ నిందితులు తెల్లవారు జామున 5 గంటలకు ఎన్ కౌంటర్ అయ్యారని చెప్పడం సరికాదు.. అవసరమైతే వాళ్ల పై థర్డ్ డిగ్రీ ప్రయోగించండి.. వాళ్ల కడుపులో బుల్లెట్లు దింపకండి’ అంటూ ఘాటుగా ప్రశ్నించారు.

ఇలా అసదుద్దీన్ ట్వీట్ వార్ కు సీపీ మౌనంగా ఉండిపోయారు. మరింత రెచ్చిపోయిన అసద్ సజ్జనార్ ను దిశ ఎన్ కౌంటర్ కు ముడిపెట్టి మరీ ఎండగట్టారు.