Begin typing your search above and press return to search.

నేను హిందూస్తానీని.. ఐఎస్ పనిపడతా: ఒవైసీ

By:  Tupaki Desk   |   7 Jan 2016 11:48 AM GMT
నేను హిందూస్తానీని.. ఐఎస్ పనిపడతా: ఒవైసీ
X
ఎంఐఎం అధ్యక్షుడు, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అంటే చాలామందిలో ఒకరకమైన అభిప్రాయం ఉంటుంది. అయితే ఇటీవల కాలంలో ఆయన సందర్భం వచ్చిన ప్రతిసారీ తన దేశభక్తిని నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. అదే తరహాలో మాట్లాడుతున్నారు. తాజాగా ఆయన్ను ఐఎస్ ఉగ్రవాదులు హెచ్చరించిన నేపథ్యంలో వారిపట్ల తీవ్ర స్థాయిలో స్పందించారు. ఆ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు దేశమంతటినీ ఆశ్చర్యంలో పడేశాయి... అంతేకాదు... ''శభాష్ అసద్ భాయ్'' అని అభినందిస్తున్నారు కూడా. ఇస్లాంకు వ్యతిరేకంగా మాట్లాడితే తీవ్ర పరిమాణాలుంటాయని... ఇండియాలో తాము ఇంకా విస్తరిస్తామని ట్విట్టర్‌లో ఐఎస్ ఉగ్రవాదులు హెచ్చరించిన నేపథ్యంలో ఆయన కూడా అదే స్థాయిలో స్పందించారు. ఐసిస్ బెదిరింపులకు తాను భయపడేదే లేదని ఆయన తీసిపడేశారు. ఏదో ఒక రోజు అందరూ చనిపోవాల్సిందే.. ఐఎస్ బెదిరింపులకు నేనేమీ భయపడను అన్నారు. అంతేకాదు... భారత్ వైపు ఎవరు కన్నెత్తి చూసినా హిందూస్థానీగా తాను వారికి బుద్ధి చెప్తానని తీవ్రస్థాయిలో ప్రతి హెచ్చరికలు జారీచేశారు. ఆయన చేసిన ఈ కామెంటు ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది.

ఐఎస్ఐఎస్ వల్ల లక్షన్నర మంది ముస్లింలు చనిపోయారని చెప్పిన అసద్ ఇస్లాంకు, ఐఎస్ఐఎస్‌కు ఎలాంటి సంబంధం లేదని, సోషల్ మీడియాలో మాత్రమే అలా ప్రచారం జరుగుతోందన్నారు. పన్నెండున్నర కోట్ల మంది ముస్లిం లుంటే.. ఐసిస్‌లో కేవలం ఐదుగురు సభ్యులు మాత్రమే వున్నారని కానీ సోషల్ మీడియా దీన్ని భూతద్దంలో చూపుతోందన్నారు. భారత్ వైపు ఎవరు కన్నెత్తి చూసినా హిందుస్తానీలా బుద్ధి చెబుతా అని కౌంటర్ ఎటాక్ ఇచ్చారు. ఐసిస్ ట్వీట్లను సీరియస్‌గా తీసుకున్న హైదరాబాద్ పోలీసులు ఓవైసీకీ గట్టి భద్రతను ఏర్పాటు చేశారు.

కాగా గ్రేటర్ హైదరబాద్ ఎన్నికల నేపథ్యంలో అన్ని వర్గాలను ఆకట్టుకునే ప్రయత్నంలో భాగంగా అసద్ హిందూస్థానీగా తాను ఎదిరిస్తాను అన్న వ్యాఖ్యలు చేశారని అంటున్నారు. కేవలం పాతబస్తీకే పరిమితం కాకుండా మిగతా ప్రాంతాలను కవర్ చేయడానికి.... టీఆరెస్ వ్యతిరేకించే ఏపీ సెటిలర్ల ఓట్లను లక్ష్యంగా చేసుకుని టీఆరెస్ కు ప్రత్యామ్నాయంగా వారు తమకు ఓటేసే అవకాశం సంపాదించుకోవడానికి అసద్ ఈ వ్యాఖ్యలు చేశారని అంటున్నారు. అదే సమయంలో అసద్ దేశభక్తినీ ఎవరూ కొట్టిపడేయడం లేదు. కారణం ఏదైనా కానీ అసద్ మాత్రం తన తాజా వ్యాఖ్యలతో దేశం మొత్తాన్నీ ఆకట్టుకున్నాడు.